ఆవేశం ఆవేదనకు మూలం

                          ఆవేశం ఆవేదనకు మూలం

ANGRY
ANGRY

మీ జీవితంలో మీరు ఆశిస్తున్న ప్రధానమైన అంశం ఏదని అడిగితే ఎక్కువమంది చెప్పే సమాధానం ‘సంతోషం అంటారు. సంతోషం, మనశ్శాంతిపట్ల మనిషిలో ఇంతటి ఆకాంక్ష, ఆరాటం ఉన్నా, నేటి ప్రపంచంలో అధిక సంఖ్యాకులు అసంతృప్తితోను, అశాంతితో జీవితాన్ని గడుపుతున్నారు. సంపదకు సంతోషానికి సంబంధం ఉండదు. అసంతృప్తితో బాధపడుతున్న సంపన్నులను ఎందరినో నేడు చూస్తున్నాం. పేదరికంలో మగ్గుతున్నా ప్రశాంతంగా కాలం గడుపుతున్న సంతృప్తి జీవులూ మన మధ్య వున్నారు. మనం అనుభవించే భౌతిక సుఖాలకు, మనకు లభించే మానసిక సంతృప్తికీ సంబంధం ఉండదు. సంతోషం, సంతృప్తి వంటి పాజిటివ్‌ లేక వ్యధ, వ్యాకులత వంటి నెగటివ్‌ ఎమోషన్స్‌ మనం జీవితాన్ని అర్ధం చేసుకొనే విధానంపైన, పరిస్థితుకు మనం స్పందించే తీరు మీద ఆధారపడి ఉత్పన్నమవుతుంటాయి. ఆలోచనలు లోపభూయిష్ఠంగా ఉంటే మన మనసు నెగటివ్‌ ఆవేశాలకు కర్మాగారంగా మారుతుంది. మన జీవితం అలజడికి, ఆందోళనకు ఆలవాలమవుతుంది.

ఆధునిక సమాజంలో ప్రతి చోటా పోటీతత్త్వాలు అధికమవుతూ ఉన్నాయి. విద్యలోను, ఉద్యోగాలలోను, సంసారంలోను, సామాజిక జీవితంలోను ఎక్కడ చూసినా ఎడతెగని హడావుడి పెరిగిపోయింది. ఆశలతోపాటు అసుయలూ పెరిగాయి. వాంఛలతోపాటు వ్యాకులత లూ పెరిగాయి. మానసిక ఒత్తిడి పెరిగి మనుషులు ఆవేశపరులుగా మారిపోతున్నారు. దూకుడుగాను, దురుసుగాను వ్యవహరిస్తున్నారు. మానవ సంబంధాలను మంటగలుపు కొంటూ సమస్యలు సృష్టంచు కొంటున్నారు. విలువైనకాలాన్నీ, పరిమితమైన శక్తిసార్థ్యాలను విభేదా లకు, వివాదాలకు, ఘర్షణలకు వెచ్చిస్తూ జీవితాన్ని వృథా చేసుకొం టున్నారు. ఎదగవలసిన స్థాయికి ఎదగలేక, అందుకోవలసిన ఫలితా లు అందుకోలేక నిస్పృహతో, నిరాశతో మిగిలిపోతున్నారు.

విజయవంతంగా, సంతోషంగా జీవించడం అంటే అపారమైన సంప దను, అంతులేని సౌకర్యాలను సమకూర్చుకోవడం కాదు. అడ్డులేని అధికారంతో అహంకరించి విర్రవీగడం కాదు. సంతోషాన్ని పదిమంది తోనూ పంచుకొన్నప్పుడే మనకు నిజమైన సంతృప్తి లభిస్తుంది. మనలను ఇష్టపడి, పదిమంది ప్రేమతో ఆదరాభిమానాలు అందించినప్పుడే మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఇటువంటి సంతోషకర వాతావరణంలో జీవించాలి అంటే మనం నెగిటివ్‌ ఆవేశాలను నియంత్రించుకోవడం అవసరం. మన లోపాలు సరిదిద్దు కోవడం మరీ అవసరం. మనలోని హానికర ఆవేశాలు తొలగించు కోవడం ఉత్తమోత్తమం. అలా సాధ్యంకాని పక్షంలో ఆవేశాలు శ్రుతి మించకుండా, అనర్థాలకు దారితీయకుండా వాటిని అదుపులో ఉంచుకోవడం మధ్యమం.

ఈ రెండు విధానాలు కాదనుకొని భావోద్రేకాలకు బానిసలై వివాదాలతో, విరోధాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం అధోగతి మార్గం. ఇందులో మనం ఏమార్గాన్ని ఎంచుకొంటాం అన్నది మన విజ్ఞత మైన, సంస్కారంపైన ఆధారపడి ఉంటుంది. మన మస్తిష్కంలో ఆవేశపడే మనసూ, ఆలోచించే మనసూ పక్క పక్కనే పనిచేస్తూ ఉంటాయి. నిదానమే ప్రధానం అన్నది ఆలోచించే మనసు విధానం. ఆవేశాలు ఆలస్యాన్ని సహించవు. అనుకొన్నదే తడవుగా రంగంలోకి దూకడం వాటి స్వభావం. ఆపైన పర్యవసా నాలతో వాటికి పని ఉండదు. ఆవేశాలు మన మాటలను, ప్రవర్తన లను మన అధీనంలో లేకుండా చేస్తాయి.