ఆలోచనలు కావాలి ఆయుధం

       ఆలోచనలు కావాలి ఆయుధం

CUTE
CUTE

ప్రేమలో నింపేయాలి. మన జీవితం ప్రేమమయంగా మల్చుకోవాలి. మనం అప్పుడే బతుకుని అనుభవించగలం, బతుకుని, మన జీవితాన్ని మనం అత్యంత ప్రేమగా ప్రేమించాలి. ఎవ్వరూ ఒంటరి కాదు. మన దైవం,ప్రకృతి మనకు ఆలోచనలు ఇచ్చింది. గొప్ప దేహాన్ని ఇచ్చింది. ఎన్నోఅవకాశాల్ని ఇచ్చింది. కాలం అనంతమైంది. కాలాన్ని మన సౌలభ్యం కోసం మన పూర్వికులు రకరకాలుగా విభజించారు. ఎన్నో మార్పులు, చేర్పుల తర్వాత నేటి ఆధునిక కాలప్రమాణం రూపుదిద్దుకుంది. కాలానికి హద్దులు, మైలురాళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు 2018 మైలురాయిని దాటి కాలం 2019కి చేరుకుంది. జీవితంలో ప్రతి సందర్భాన్ని మనం పండుగ చేసుకుంటాం. శుభాలు జరగాలని ప్రకృతిని, దైవాన్ని ,కాలాన్ని వేడుకుంటాం.

మన సమసు రోజువారి దినచర్యల్లో, సంఘర్షణ పరుగుల్లో మునిగి బతుకు మలుపుల్ని గమనించనే గమనించం. ఒక్కసారిగా తేరుకుని అప్పుడే సంవత్సరం గడిచిందా! మాయగా ఉంది అని ఉలిక్కిపడతాం. సమీక్షించుకుని కొత్త కలల్ని గమ్యాలుగా సంకల్పం చేసుకుంటాం. కానీ ఆ సంకల్పాన్ని సజీవంగా గుర్తుంచుకుంటామా… నిజంగా గమ్యాల్ని కలవరించేవారు జీవితంలో తప్పక విజేతలవుతారు. ఊహిస్తాం అనుకుంటాం… సరదాల్లో మునిగి మర్చిపోతాం. డిసెంబర్‌ 31న, జనవరి 1న తాజాగా ఉంటాం.

హ్యాపీ న్యూఇయర్‌ అని మొత్తుకుంటాం. పార్టీలు విందులు, చిందులు మునిగితేలుతాం. ఆరంభాన్ని సంతోషంగా చిరునవ్వులతో మొదలు పెడితే సంవత్సరం పొడవునా శుభాలే అని రూఢిగా అనుకుంటాం. దేవుళ్ళకు మొక్కుకుంటాం. ముగ్గులు వేస్తాం. రంగులు వేస్తాం. విచిత్రం రెండో రోజు ఎప్పటిలాగే సాగే దినచర్యలో మనం కొత్తదనమేమి లేక పాత సంవత్సరంలాగానే కొత్త సంవత్సరం సాదాసీదాగా దొర్లిపోతూవుంటుంది. కొత్తదనమనేది ప్రతి క్షణం కొత్తదనమే కావాలి. విచిత్రమేమంటే అంతా మారాలనుకుంటాం.

కానీ మనం మారం. మనం కేవలం మన ఆలోచనల ప్రతిరూపమే మన ఆలోచనల్ని మార్చుకోనంత వరకు మనం మారం. మన ఆలోచనలను సమీక్షించుకోం. జీవితం ఎవరికోసమో కాదు. మొదటిగా జీవితం మనకోసమే అనే స్పృహా మనకు ఉండదు. జీవితం మన అమ్మానాన్న కోసమో, పెళ్లాం కోసమే, మొగుడు కోసమో, సమాజం కోసమో అనుకుంటూ భ్రమల్ని పోగేసుకుంటాం. మొదటి ఈ జీవితం మన కోసమే. తరువాతే ఆ జీవితం అందరికి అంకితమవుతుంది. మనకోసం మనం అంటే మనం మనపై శ్రద్ధ తీసుకుంటాం.

మనం వేరొకరి కోసం అనుకుంటే నిరాశ ఎదురయినపుడు, చేదు నిజాలు ఎదురైనప్పుడు మన జీవన శైలిలో ఉదాసీనత చోటు చేసుకుంటుంది. మనం మొదటిగా మన ఆలోచనల్ని ప్రక్షాళన చేయాలి. అంటే మన దేహంలో పరుగులు తీసే ఆలోచనా స్రవంతి పోకడలను, మాయను, ఆలోచనల జీవితాన్ని మనం సమీక్షించుకోవాలి. మనం కూర్చున్న చోటే ఉంటాం. కానీ మన ఆలోచనలు కాల నియమాన్ని, మన అనుభంలో ఉన్న సమాజ నియమాలను అధిగమించి స్వేచ్ఛగా కాలం ముందుకు, వెనకకు, పైకి, కిందికి అనంతంగా మన ఆలోచనలు (మరో పేరు మనసు ) సాగుతూ ఉంటాయి.

మనం ఉన్నచోటే ఉంటాం. మన ఆలోచనలు భూత, వర్తమానం, భవిష్యత్తు కాలాల్లోకి కన్నుమూసి తెరిచే లోపే వెళ్ళిపోతాయి. గమ్మత్తైన విషయమే మంటే ఆలోచనలు వేరు. మనం వేరు కాదు కాలం వెంట వెళ్ళిన ఆలోచనలు తీసుకునే అనుభూతులను, జ్ఞాపకాలను సహజంగా అక్కడ ఉన్నట్లే జీవించినట్లే అన్పించి స్పందనకు గురవుతాం. మనం నిద్రపోతున్నా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. బతుకును కళ్ళముందు చూపిస్తాం. ఈ ఆలోచనల మర్మం ఏమిటి చెప్మా? అని తెగ గందరగోళంలో పడ్తాం. నిజంగా చెప్పాలంటే ఆలోచనలు మనకు ఎంతో మేలు చేస్తాయి.

మనం ఏ అంశంపైనైనా కాస్త ప్రత్యేక దృష్టిపెట్టగానే ఆలోచనలు ఆ విషయం తాలూకు మంచి చెడ్డల ఫైల్‌ను జాబితాను వెంటనే సిద్ధం చేస్తుంది. తల్లి పిట్ట చెట్టు గూడులో ఉన్న తన పిల్లలకు ఆకలితీర్చేందుకు దూరతీరాలకు అటూ ఇటూ వెదికి ఆహారం తెచ్చి ఇచ్చినట్లు మన ఆలోచనలు మనం సంకల్పించిన అంశాలకు సంబంధించిన వివరాలను కాలం వెనుక్కు, ముందుకు వెళ్ళి జాబితా, వివరాలు సిద్ధం చేస్తుంది. మనం మెరుపుల్ని స్వీకరించి దేహానికి పనికల్పించాలి. కేవలం ఆలోచనల వల్ల ప్రయోజనం లేదు. దైవం, ప్రకృతి మనకు ఆలోచనలు ఇచ్చింది.

అది మన మేలు కోసమే. ఆలోచనలు మనకు కర్తవ్యనిర్వహణకు కావల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆ ప్రధాన అంశాలను దేహం జీవితంలో ఆచరించాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. పరుగుల జీవితంలో ఆలోచనలకు కూడా సమయం లేదనుకునేవారికి కూడా ఓ సౌలభ్యం ఉంది. మంచో, చెడో పనిచేస్తూ పోవాలి. విజయం సిద్ధిస్తే శుభమే. ఒకవేళ అవరోధాలు ఎదురైతే ప్రయత్నాన్ని మరో దిశలో మరో ఆయుధంతో పరుగులు తీయాలి. అంతిమ విజయం మనదే. అహంకారం మంచి వారికి ఉండాలి. చెడ్డ వారికి ఎలానూ ఉంటుంది.

మంచి వారు మంచికోసం అహంకారం ప్రదర్శించకపోతే చెడు చేసే పెత్తనాన్ని ఆమోదించాల్సి వస్తుంది. మనం మంచికి కట్టుబడి ఉన్నప్పుడు సమాజానికి మేలు చేద్దామనుకున్నప్పుడు ధిక్కార స్వరంతోనే ఉండాలి. బతుకులో గట్టిగా ముద్రలు వేస్తూ ఆత్మవిశ్వాసంతోనే ఉండాలి. దేవుడు, ప్రకృతి ఈ జీవితంలో మనం గెలుపోందటం కోసమే మనకు ఎన్నో అద్భుత ఆయుధాలను అందించింది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనసును అదుపులోకి తీసుకుని మార్గదర్శకత్వం ఇచ్చే ఆత్మ మనలోనే దైవం,ప్రకృతి ఇచ్చింది.

దేహం,మనసు,ఆత్మఅనేవి ఒకే రూపాలే. ఒక్కో దశలో ఒక్కోరూపంగా చెప్పబడుతుంది. నిరంతర ఆలోచనల మర్మం తెలుసుకుని ఆలోచనలు అందించే దిశానిర్ధేశాన్ని వాస్తవంలో ఆచరించినపుడే మనం ముందుకు వెళ్తాం. కాలం క్షణకాలం ఆగదు కదా. మన ఆలోచనలే మన ఆయుధంగా జీవితంలో నిరంతరం పనిచేయడమే శ్వాసగా ప్రేమే మన చూపుగా మనం ముందుకు పోదాం!
– తంగెళ్ళపల్లి కనకాచారి