ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో రతన్‌టాటా

Rathan tata & Mohan bhagavath
Rathan tata & Mohan bhagavath

ముంబాయి: నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో వేదిక పంచుకోగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గోననున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆగస్టు 24న ఏర్పాటు చేయనున్న కార్యక్రమానికి రతన్‌టాటా హాజరుకానున్నారు. వీరువురూ ముంబాయిలో నానా పాల్కర్‌ స్మృతి సమితి నిర్వహంచే కార్యక్రమంలో పాల్గోంటారని సంఘ్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సంఘ్‌ ప్రచారక్‌ నానాపాల్కర్‌ పేరిట ఈ ఎన్జీవో ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో టాటా మోమోరియల్‌ ఆస్పత్రి ఎదుట ఉంది. కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు సమితి సేవలందిస్తోంది. రతన్‌టాటాకు తమ సంస్థ కార్యకలపాల గురించి అవగాహన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. నానా పాల్కర్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఆగస్టు 24న జరగనుంది.