ఆరోగ్యశ్రీనే భేష్‌!

kcr
kcr

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే మా ప్రథమ ప్రాధాన్యం
వచ్చే మూడేళ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు
కేంద్రంలో అననుకూల ప్రభుత్వం ఉంది
ప్రతీ గ్రామపంచాయతీకి బీటీ రోడ్లు
కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధిలో ముందుకెళుతున్నాం
వచ్చే ఐదేళ్లలో ఆదాయ వ్యయాల అంచనా రూ. 10 లక్షల కోట్లు
అవినీతి రహిత పాలన అందిస్తున్నందుకే మళ్లీ అధికారం
ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నిర్వహణకు సిద్ధం
రుణమాఫీ నూటికి నూరు శాతం అమలు చేస్తాం
నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షాలతో చర్చించి విధివిధానాలు
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం
శాసనసభలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీనే మంచి పథకమనీ, అందుకే ఆ పథకంలో చేరబోమని ప్రధాన మంత్రికి చెప్పామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అనీ, వచ్చే మూడేళ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లు అవినీతికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరిపాలన సాగించామనీ అందుకే రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి మళ్లీ అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అననుకూలంగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు ఇవ్వడం రాజ్యాంగబద్దమైన హక్కు అనీ ఇందులో కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు ఏమీ లేవని తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు రూ. 99 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి రూ. లక్షా 17 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి కేటాయించిన 1330 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
రెండో ప్రాధాన్యంగా రహదారుల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం రెండో ప్రాధాన్యంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామనీ, రానున్న రోజుల్లో పాత, కొత్త గ్రామ పంచాయతీలు అన్నింటిలో బీటీ రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. పాత రోడ్లను అద్దాల్లాగా తీర్దిదిద్దుతామనీ, దీనిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రతీ గ్రామంలో ఎ1 నాణ్యతతో కూడిన బీటీ రోడ్లను నిర్మిస్తామనీ, వచ్చే బడ్జెట్‌లో రోడ్‌ పాలసీని ప్రవేశపెడతామని వెల్లడించారు. కేసీఆర్‌ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా ఏమీ లేదనీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరూ అడక్కుండానే రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామనీ, ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను కేంద్ర మంత్రులంతా ప్రశంసించారనీ, నీతి ఆయోగ్‌ కూడా వీటికి రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం కనీసం రూ. 24 కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో చిన్నా,పెద్ద తారతమ్యం లేకుండా రూ. లక్ష వరకు రుణమాఫీ వందకు వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా రూ. లక్ష వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పామనీ, అదే కాంగ్రెస్‌ పార్టీ ఏకమొత్తంగా రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందనీ, అయినప్పటికీ ప్రజల విశ్వాసం తమ వైపే ఉందని పేర్కొన్నారు. ఏకమొత్తంలో అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని గుర్తు చేశారు. గతంలో కొన్ని చోట్ల బ్యాంకుల నుంచి వచ్చిన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. గతంలో రూ. రైతులకు రూ. 17 వేల కోట్ట రుణమాఫీ చేశామనీ అది ఇప్పుడు రూ. 24 వేల కోట్లకు చేరిందని చెప్పారు. గిట్టుబాటు ధర అంశంపై స్పందిస్తూ పంటలకు గిట్టుబాటు ధర ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదనీ, అది కేంద్రం చేతిలో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రతీ నియోజకవర్గంలో నెలకొల్పి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ బెడదను నివారించేందుకు మంచి బ్రాండ్‌ వచ్చే విధంగా పాటుపడతామనీ, పంట కాలనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై అధ్యయనం జరుగుతుందని వెల్లడించారు.
కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయలేం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలో ప్రస్తావించిన విధంగా రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయడం సాధ్యం కాదనీ, ఎవరు రైతు, ఎవరు కౌలు రైతు అనేది చూడటం ప్రభుత్వం బాధ్యత కాదని స్పష్టం చేశారు. కౌలు రైతులు మారుతుంటారనీ, అందుకే రైతులే సహృదయంతో ఆలోచించి కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు 2.70లక్షల ఇళ్లను మంజూరు చేసిందనీ, వీటి కేటాయింపులో అవినీతికి అవకాశం లేకుండా ఉండేందుకు లబ్దిదారులను కేవలం లాటరీ విధానం ద్వారానే ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా, ఎమ్మెల్యే నియోజకవర్గమైనా అతీతం కాదని స్పష్టం చేశారు. వచ్చే మే తరువాత గ్రామ పంచాయతీ కార్యదర్శులను బాధ్యులుగా చేసి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి ? ఇంకా ఎన్ని అవసరం ఉంది ? అనే విషయాలను నిర్ణయించడానికి సమగ్ర నివేదికను తప్పించుకుంటామని స్పష్టం చేశారు. ఇల్లు నిర్మించుకునే స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించామనీ, ఆ లెక్కలన్నీ బడ్జెట్‌లో పెడతామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరించిన అన్ని విధానాలను గత నాలుగేళ్లలో ప్రజలు గమనించారనీ, అందుకే తిరగి తమ పార్టీకి అఖండ మెజార్టీని ఇచ్చారని పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగం పబ్లిక్‌ మీటింగ్‌ లాగా ఉందని కొందరు అన్నారనీ, వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారో, ఆ పార్టీ మేనిఫెస్టో, అదే పాలసీ గవర్నర్‌ ప్రసంగంలో ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల బడ్జెట్‌
వచ్చే ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఆదాయ, వ్యయాల అంచనా రూ. 10 లక్షల కోట్లనీ కేసీఆర్‌ పేర్కొన్నారు. వీటిలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ. 2 లక్షల 40 వేల కోట్లనీ, ఆ అప్పు చెల్లిస్తే మళ్లీ రూ. లక్షా 30 వేల కోట్లు తెచ్చుకునే వీలు కలుగుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటి వరకూ లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేయగా, మరిన్ని వ్యయం చేస్తామని చెప్పారు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున కేంద్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి వచ్చే నెలలో ఆర్థిక సంఘం సభ్యులు రాష్ట్రానికి వస్తారనీ, ఆ చర్చల తరువాతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై స్పష్టత వస్తుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అయితే, నిరుద్యోగ భృతిని అమలు చేయడానికి మాత్రం ఐదారు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఎవరు నిరుద్యోగి ? ఏ వయసును ప్రాతిపదికగా తీసుకోవాలి ? అనే అంశాలపై ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడి విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు శాసనసభను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామనీ, అయితే, శాసనసభలో విమర్శలు, నిందల ప్రసంగాలు కాకుండా ప్రజలకు అవసరమైన చర్చ జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేసీఆర్‌ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదనీ, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు.