ఆమె మామూలు మనిషిగా మారిపోతుంది

వ్యధ

SAD1
Lady Depression

 

ఆమె మామూలు మనిషిగా మారిపోతుంది

యవ్వనంలో ప్రేమలో పడి తపించడం సహజం అనుకోవచ్చు. ప్రేమించినవాడు విస్మరిస్తే భరించలేకపోవడాన్ని వయస్సు ప్రభావంగా భావించవచ్చు. పెళ్లయిన కొత్తలో భర్త సానిహిత్యం కోసం పరితపిస్తారంటే అర్థముంటుంది. అయితే 55 ఏళ్ల వయస్సు పైబడిన మా అమ్మ ప్రియుడి కోసం పరితపిస్తుంటే భరించలేకపోతున్నాం. మనవళ్లు, మనవరాళ్లతో సరదాలు తీర్చుకోవాల్సిన వయస్సులో వివాహేతర సంబంధం కోసం అర్రులు చాచడాన్ని ఏమనుకోవాలో తెలియడం లేదు.

మాదొక పల్లెటూరులోని వ్యవసాయ కుటుంబం. మా అమ్మను స్వంత మేనమామకిచ్చి పెళ్లి చేశారు. తొలి నుంచి వారి మధ్య సఖ్యత వ్ఞండేది కాదట. మా నాన్న అమ్మను పట్టించుకోకుండా తాగి, తిరిగేవాడని మా నాన్నమ్మ, తాతయ్యలు చెప్పేవారు. మా అమ్మ గతిలేని జీవితం విధిలేని సంసారం గడుపుతూ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అక్క, నేను ఇద్దరం డిగ్రీవరకు చదువ్ఞకుని, పెళ్లిల్లు చేసుకుని, స్థిరపడ్డాం. మా అమ్మకు పదేళ్ల క్రితం పరాయి వ్యక్తితో పరిచయం అయ్యింది. అది వివాహేతర బంధంగా బలపడింది. కొన్నాళ్లు రహస్యంగా సాగినప్పటికీ, రంకు, బొంకు దాగదన్నట్టు మానా న్నకు తెలిసిపోయింది. దాంతో అమ్మ గొడవపడి నాన్నతో తెగతెంపులు చేసుకుని వేరు కాపురం పెట్టింది. ఇద్దరు విడాకులు తీసుకోనప్పటికి, విడివిడిగా ఉంటున్నారు. మా అమ్మ పరాయి వ్యక్తినే భర్తగా భావించి, అతనితోనే జీవితం అన్నట్టు మారిపోయింది. అతనికి భార్య, పిల్లలు వ్ఞన్నారు. అతని వయస్సు 70 ఏళ్లకు పైగా ఉంటుంది. రెండేళ్ల క్రితం అమ్మకు గర్భసంచి తొలగించవలసి వచ్చింది. దాంతో వారిద్దరి మధ్య కొంత అవరోధం ఏర్పడింది. అతను అమ్మ వద్దకు రావడం తగ్గించివేశాడు. రానురాను ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి ఘర్షణకు దారితీసింది. దాంతో అతను పూర్తిగా అమ్మను పట్టించుకోవడం మానేశాడు. ఆరునెలల నుంచి అమ్మ ప్రవర్తనలో విపరీతమార్పులు వచ్చాయి. అతను తనమీద, ఆమె పిల్లలైన మామీద కక్షకట్టాడని, మాకు హాని చేయడానికి చూస్తున్నాడని భయపడుతున్నది. రాత్రుల్లో నిద్రసమయంలో వచ్చి మాకు హాని తలపెడుతాడంటూ, రాత్రంతా తలుపులు మూసుకునే ఉంటుంది. ఆందోళన చెందుతూ, రాత్రుల్లో మేలుకుని, పగలు నిద్రపోతున్నది. ఆయన మా అక్కను, నన్ను కూడా కోరుకుంటున్నాడని ఆరోపిస్తోంది. అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని తపిస్తున్నది. అతనేమో ఫోన్‌ చేసినా తీయడం లేదు. చిన్నపిల్లల ఆట వస్తువ్ఞలకు మారాం చేసినట్టు, అమ్మ అతన్ని తీసుకురమ్మంటోంది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలన్నా అసహ్యంగా ఉంటుంది. ఆమె పొంతనలేని మాటలు చెపుతున్నది. అతనికి దాదాపు 20మంది ఆడవారితో సంబంధం ఉంటుందని ఆరోపిస్తున్నది. ఆమె చెప్పే జాబితాలో పెద్దపెద్ద వారి పేర్లు ఉన్నాయి. ఈ మధ్య పూజలు ఎక్కువయ్యాయి.

ఒక్కోరోజు ఆయన వస్తాడని స్నానం చేసి ముస్తాబు చేసుకుని ఎదురు చూస్తుంటుంది. ఆమెది ప్రేమో, పిచ్చో అర్థం కావడం లేదు. ఈ స్థితిలో అమ్మను మార్చడం ఎలాగో చెప్పండి. -కుటి అమ్మాళ్‌, నెల్లూరు అమ్మా! మీ అమ్మ అనుమానం, భ్రమలు, భ్రాంతులకు గురవ్ఞతున్నది. అలాగే ఆమెలో అబ్బెసివ్‌ కంపెల్సివ్‌ డిజార్టర్‌ కూడా ఉన్నట్టు భావించాల్సి వస్తున్నది. దీర్ఘకాలం నిరాశ, నిస్పృహలు, మానసిక ఒత్తిళ్లకు గురవడం వల్ల ఆమెలో ఈ రుగ్మతలు తలెత్తి ఉంటాయి. అలాగే మీ అమ్మ, నాన్నల మధ్య మానసిక సాన్నిహిత్యం, శారీరక సుఖాల కొరత స్పష్టంగా తెలుస్తున్నది. దాంపత్య జీవితం సుఖవంతం కాని చాలామంది మహిళల్లో మానసిక సమస్యలు తలెత్తు తుంటాయి. దిగువ, డిప్రెషన్‌, హిస్టీరియా,భయం, ఆందోళన, అబ్బెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ ఇతర నాడీ రుగ్మతలు, ‘మూడ్‌ డిజార్డర్స్‌ ఆవహిస్తుంటాయి. చాలామందిలో వీటి తీవ్రత అంతగా ఉండదు. కొద్దిగానో, ఒక మోసర్తరుగానో బాధపడేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మనసుకు ఊరట కలి గించుకుంటుంటారు. భక్తిభావం, పూజలు, పునస్కా రాలతో చాలామంది మనశ్శాంతిని పొందుతుంటారు.

మీ అమ్మలాంటి ప్రవర్త న చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఆమెలో విపరీత శృంగార భావాలు చెలరేగుతున్నాయి. చాలామంది భావించినట్టు వృద్ధాప్యం రాగానే కోర్కెలు చచ్చిపోతాయనుకోవడం సరికాదు. కొందరిలో అప్పుడే కోర్కెలు పురివిప్పుతాయి. మీ అమ్మ వయస్సులో వ్ఞన్నప్పుడు కోర్కెలు తీరక విపరీత మానసిక వ్యధను అనుభవించింది. మీ నాన్న తాగుడు, తిరుగుళ్లను భరించ లేక ఒత్తిడిని పెంచుకున్నది. 45 ఏళ్ల వయస్సులో దొరికిన స్వేచ్ఛను సద్విని యోగం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇదే జీవితమని, స్వర్గతుల్యమని భావించింది. అయితే గర్భసంచి తొలగించడం వల్ల కొన్నాళ్లు సుఖాలకు దూరం కావాల్సి వచ్చింది. అలాగే దీనివల్ల కొన్నాళ్లు సుఖాలకు దూరం కావాల్సి వస్తుంది. దీనివల్ల హోర్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఉంటుంది. మెనోపాజ్‌ సమస్యలు తలెత్తి వ్ఞంటాయి. మనస్సు, శరీరం, హోర్మోన్లు ఒక్కసారిగా గాడి తప్పడం వల్ల ఆమె పిచ్చిదానిలా తయారయ్యింది.

కాబట్టి మీరు వెంటనే ఒక సైకియాట్రిస్టును కలిసి పరిస్థితిని వివరిం చండి. అనుమానం, భ్రమలు, భ్రాంతులు తగ్గడానికి డాక్టరు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడండి. అలాగే ఆమెను ఒంటరిగా ఉంచకుండా మీ వద్ద వ్ఞంచుకుని మానసిక స్థైర్యం కల్పించే ప్రయత్నం చేయండి. వాకింగ్‌, యోగలాంటి శారీరక శ్రమను కల్గించే వ్యాయా మాలు చేయించండి. ధ్యానం, సెల్ఫ్‌హిప్పాటిజం సాధన చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అనుభవజ్ఞుడైన సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్‌ కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపి చేయించండి. అన్నీ సక్రమంగా చేసినప్పటికి ఆమె సాధారణ స్థితికి రావడానికి కొద్దినెలలు పట్టవచ్చు. బాగా ముదిరిన మానసిక రుగ్మతులకు దీర్ఘకాల చికిత్స తప్పదన్నది గుర్తుంచుకోండి. జ్వరం, తలనొప్పి లాగా మాత్రవేసిన గంటలోపే మానసిక రుగ్మతలు తగ్గవ్ఞ. కాబట్టి సహానుభూతితో మీ అమ్మ సమస్యను అర్థం చేసుకుని చికిత్స, కౌన్సెలింగ్‌ అందించండి. కొన్ని నెలల్లోనే ఆమె మామూలు మనిషిగా మారిపోతుంది.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్ట్‌