ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్లు

anil singhal, ttd eo
anil singhal, ttd eo

-మార్చి13న హైదరాబాద్‌లో శ్రీవారివిగ్రహప్రతిష్ట
తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి మే నెల కోటాలో మొత్తం 70,786టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఇవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,486 సేవాటికెట్లు విడుదల చేశామని ఇందులో సుప్రభాతం 8,091, తోమాల 140, అర్చన 140, అష్టదళపాదపద్మారాధన240,నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 59,300 సేవాటికెట్లు ఉండగా వీటిలో విశేష పూజ 2000, కల్యాణం 14,725, ఉంజల్‌సేవ 4,650, ఆర్జితబ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 6,200 టికెట్ల ఉన్నాయని వివరించారు. అనంతరం అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఇవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఇవో సమాధానాలిచ్చారు. అంతకుముందు భక్తులతో మాట్లాడుతూ ఇవో సింఘాల్‌ తెలంగాణారాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో 28కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని మార్చి 13వతేదీ విగ్రహప్రతిష్ట చేస్తామన్నారు. దీంతో హైదరాబాద్‌లోని స్థానిక భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌రాజధాని అమరావతిలో 150కోట్ల రూపాయలతో అధునాతనంగా విశాలంగా నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి భూకర్షణం జరిగిందని, సిఎం చంద్రబాబునాయుడు పాల్గోని శ్రీవారి సేవకుల పనితీరును,సేవలను, టిటిడి చేపడుతున్న ధార్మికకార్యక్రమాలను అభినందించారని తెలిపారు. తమిళనాడులోని కన్యాకుమారిలో 22.50కోట్లరూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విగ్రహప్రతిష్టజరిగిన తరువాత భక్తులు రోజుకు 4వేలమంది వరకు దర్శించుకుంటున్నారని, వారాంతంలో ఐదువేలమందివరకు వస్తున్నారని తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 12న సూర్యజయంతిని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామి ఒకేరోజు ఏడువాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారని. వేలాదిగా వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సింఘాల్‌ పేర్కొన్నారు. 12వతేదీ తెల్లవారుజామున 5.30గంటల నుంచి రాత్రి 7గంటలవరకు వివిధ వాహనాలపై శ్రీవేంకటేశ్వరుడు భక్తులను కటాక్షించనున్నారు.ఈ సందర్భంగా రథసప్తమిన అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దుచేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని 10 అతిధిగృహాల్లో చాపలు, దిండ్లు, రగ్గులు,దుప్పట్లు అదనంగా అందిస్తున్నామని ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల జెఇవో కెఎస్‌ శ్రీనివాసరాజు,తిరుపతి జెఇవో పోలభాస్కర్‌, సివిఎస్‌వో గోపినాధ్‌జెట్టి, ఛీప్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.