ఆనంద జీవనమార్గం

                              ఆనంద జీవనమార్గం

LORD KRISHNA
LORD KRISHNA

ఒకరోజు మనం ప్రపంచంలోకి వచ్చాం. ఒకనాడు ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాం. ఈరోజు ఉన్నాం. అందుకే అంటున్నాను మనది ఒక్కరోజు జీవితం అని. నేడు ఉన్నాం. రేపు ఉంటామో లేదో చెప్పలేం. ఉండకపోవచ్చు కూడా. అంతమాత్రాన చింత ఎందుకు? ఎలాగో ఒకనాడు పోయేవాళ్లమే. నేడు ఉన్నందుకు సంతోషపడాలి. నేడు చేయగలిగింది చేయాలి. నేటిని వినియోగించుకుంటే రేపు ఉపకరిస్తుంది. నేడు ఎలాగైతే ఒక్కరోజో, రేపు అనేది ఒకవేళ వస్తే అది కూడా ఒక్కరోజే. ఇదొక అద్భుతమైన సత్యం. శ్రమించి బుద్ధికి పట్టించవలసిన జీవనసత్యం. అన్నం కావలసింది ఒక్కరోజుకే. బట్ట కట్టేది ఒక్క రోజుకే. అన్నం తినేది ఒక్కరోజుకే. నిజం చెప్పాలంటే ఒక్కపూటకే. ఒక్కరోజు హాయిగా, ఆనందంగా సాగిపోతే, బ్రతికినంత కాలం హాయిగా సాగిపోతుంది. మితిమీరిన భావాలు బ్రతుకును క్రుంగదీస్తాయి. గాలి పీలుస్తూ ఉంటేనే మనం బ్రతుకుతాం.

మాసానికి, లేదా వారానికి, లేదా ఒకరోజుకి కావలసిన గాలినంతా ఈ క్షణంలోనే పీల్చుకోవాలా? అది సాధ్యమేనా? మనం గాలి పీల్చేది ఒక్క క్షణం. ఆ గాలి ఈ క్షణానికే. క్షణం క్షణం పీల్చుతూ ఉంటే ఎన్ని క్షణాలైనా బ్రతుకుతాం. అలాగే రోజు రోజు ఆనందంగా జీవించగలిగితే ఎన్ని రోజులైనా ఆనందంగా బ్రతకగలం. మన శక్తిని ఉపయోగించుకుని మనం చేయవలసిన విహిత కర్మలను చేస్తూ పోవాలి. ఇతరులు మనకు సహకరిస్తే సహాయం తీసుకోవడంలో తప్పులేదు. సహాయం అవసరమైన ఉండి, ఎవరి సహాయము మనకు అందనపుడు భగవంతుని ప్రార్థించాలి. అద్భుతమైన సహాయాన్ని అచ్యుతుడు అందిస్తాడు. మనం చేసే కార్యాలు మనకు తృప్తినిస్తే చాలు. ఇతరులకు మనల్ని మనం రుజువ్ఞ చేసుకోవలసిన అవసరం లేదు. మనం సన్మార్గంలో చరిస్తున్నా, ఇతరులు మనది దుర్మార్గం అని ఊహించుకుంటే, వాళ్లను అలా ఊహించుకోనీ.

అదంతా వాళ్ల సమస్యే గాని మనది కాదు. మోపే వారు నిందలు ఎందరో మోసే వాడివి కాబోకు కాకి కూతలు ఎవరికి మధురం? కోకిల రవమే కమనీయం సహనమె సంపద పగయే ఆపద సద్గతి కిదియే సోపానం అని రామజోగి చిట్కా. నాకేదో లేదు. నేను చాలా చిన్నవాణ్ణి అనే న్యూనతభావం కూడా దూరం కావాలి. అప్పుడే వర్తమానం ఆనందంగా సాగుతుంది. న్యూనతలు, అభద్రతలు అసౌకర్యాన్ని కల్పిస్తాయి. సుఖం లేకుండా చేస్తాయి. మనకు ఏమీ లేదని ఈ విచారం? లేక ఎవరికో ఏదో ఉంది అనేది మన ఆరాటమా? ఎవరికి ఏదుంటే మనకెందుకు? మనకు అవసరం లేనివి ఎంత గొప్పవి అయితే మాత్రం ఏం ప్రయోజనం? భాగ్యాల పేరిట భారాల్ని ఎత్తుకోవడం తేలికే. కాని, బ్రతికినంత కాలం భారాల్ని మోయడం తేలిక కాదు.

కిరీటం ధరించిన తలకు అసౌకర్యమే ఉంటుంది అంటాడు షేక్‌స్పియర్‌. ఇది అక్షరసత్యం. భవిష్యత్తును గూర్చి ఎవరు ఎన్ని కలలు గనినా అడ్డు తగిలేవారు ఎవ్వరూ లేరు. కాని, ఒక్కటి మనకు అర్థం కావాలి. రేపటిని గూర్చి ఊహాలోకాల్లో మనం తేలిపోవచ్చు. కాని, నేడు చేయగలిగింది మాత్రమే చేయగలం. నేడు చేయగలిగింది చేస్తే, రేపు చూడగలిగింది చూస్తాం. జరగవలసింది జరిగి తీరుతుంది (భవితవ్యం భవత్యేవ). ప్రపంచం బయట ఉంటుంది. కాని, పరమేశ్వరుడు లోపల ఉండాలి. భుజాలపై సంసారం ఉంటే తప్పులేదు. బుద్ధిలో భగవంతుడు దూరమైతే మాత్రం ముప్పు తప్పదు. బ్రతుకు ప్రపంచంలో బుద్ధి భగవంతునిలో ఇదే రహస్యం. ఆనందజీవనానికి ఆదర్శమార్గం.