ఆదాయ వనరుల పెంపుపై ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ!

TSRTC
TSRTC

హైదరాబాద్‌: టిఎస్‌ ఆర్టీసీ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆదాయ మార్గాలకు గల అవకాశాలపై పూర్తిస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. సంస్థ ఖాళీ స్థలాల్లో నెలకొల్పిన పెట్రోల్‌ బంకుల నిర్వహణ వాటిపై ప్రధాన ఆదాయ మార్గాలను పరిశీలించింది. గురువారం బస్‌భవన్‌లో టిఆఎస్‌ ఆర్టీసీ ఈడి (రెవెన్యూ), సంస్థ కార్యదర్శి పురుష్తోతం అధికారులతో కలిసి హెచ్‌పిసిఎల్‌, ఐఓసిఎల్‌ ప్రతినిధులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అయిల్‌ అవుట్‌లెట్స్‌ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాలపై కూడా చర్చించారు. సేల్స్‌ రూం, టాయిలెట్స్‌, షెడ్డువంటి వాటిని సమకూర్చడం వాటిపై సమాలోచనలు చేశారు. ఇంధన అవుట్‌లెట్స్‌ నిర్వహణ ద్వారా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రయత్నించినప్పుడే లక్ష్యం నెరవేరగలదని ఇడి పేర్కొన్నారు. సంస్థ అధికారులు, అయిల్‌ కంపెనీల ప్రతినిధుల సమన్వయంతో కలిసి పని చేయడానికి పరస్పరం అంగీకారం తెలిపారు. సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే ఇంధన అవుట్‌లెట్స్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంతేకాక సర్వీస్‌ ప్రొవైడర్స్‌, అకౌంట్స్‌ అధికారులు, డిపో మేనేజర్ల అందరితో కలిసి ఓ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆయన వ్యక్తపరిచారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎక్కడెక్కడ సంస్థ ఖాళీ స్థలాలు ఉన్నాయో, వాటిని ఏరకంగా ఉపయోగించుకుని ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చనే విషయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇడి చెప్పారు.