ఆడ శిశువును జ‌న్మ‌నిచ్చింద‌నే నెపంతో యాసిడ్ దాడి

Acid attack
Acid attack

ముజఫర్‌ నగర్‌(ఉత్తర్‌ ప్రదేశ్‌): ఆడబిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంగా భార్యపై భర్త యాసిడ్‌ పోశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ముజఫర్‌ నగర్‌కు చెందిన కోమల్‌ దక్షిణ దిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన కపిల్‌ కుమార్‌ అనే వ్యక్తితో 2013లో  వివాహం జరిగింది. వీరిద్దరికీ 2016లో పాప జన్మించడంతో  వారిద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. కూతురు పుట్టడం తనకు ఇష్టం లేదనీ, ఆపాపను ఎక్కడైనా పారేయమని లేకపోతే ఆమెను పోషించడానికి అదనపు కట్నం తీసుకురావాలన్నాడు. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో అదే సంవత్సరం నవంబరు నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ కపిల్‌ ముజఫర్‌నగర్‌ వచ్చి తనకు విడాకులు ఇవ్వాలని కోమల్‌ను వేధించేవాడు.ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆమెను కలవాలని ఊరి బయటకు రమ్మని కోరాడు. దీంతో అక్కడికి వెళ్లిన తర్వాత కోమల్‌-కపిల్‌ మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను కోమల్‌ ముఖంపై పోసి కపిల్‌ పరారయ్యాడు. గాయాలతో అక్కడ పడిపోయిన ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కపిల్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.