ఆటోస్టార్ట‌ర్‌లు అన‌వ‌స‌రం..సీఎం కెసిఆర్‌

 

TSCM Kcr
K. Chandrasekhara rao

హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న నేపథ్యంలో మోటార్లకు ఆటోస్టార్లర్ల అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ నేడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఆటో స్టార్టర్ల వల్ల రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటుకుపోవడం ముఖ్య కారణంగా తెలుస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊడిందనే సామెత వ్యవసాయ కరెంటు విషయంలో నిజమయ్యే ప్రమాదం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులు నూటికి నూరుశాతం ఆటోస్టార్లర్లు తొలగించుకుంటేనే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల లాభం కలుగుతుందని వెల్లడించారు. లేకపోతే పంట పొట్టకొచ్చిన సమయంలో కరెంటు ఉన్నా.. నీళ్లు లేక పంటలు ఎండిపోయి నష్టపోయే దుస్థితి తలెత్తుతుందన్నారు. ఆటోస్టార్టర్ల వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెబితే రైతులు అర్థం చేసుకుంటారని.. స్వచ్ఛందంగా ఆటో స్టార్టర్లు తొలగించుకుని సహకరిస్తారని సీఎం చెప్పారు. రైతులకు నచ్చజెప్పడం కోసం వ్యవసాయ, విద్యుత్‌శాఖ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సభలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయానికి 24 గంటల సరఫరా కార్యక్రమం వల్ల రైతులు పూర్తి స్థాయిలో లబ్ధిపొందే వ్యూహం ఖరారు చేసి అమలు చేయాలని పేర్కొన్నారు.  రైతులు తమను తాము నష్టపరుచుకునే విధంగా ఎప్పుడూ వ్యవహరించరని సీఎం అన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతులంతా ఆటోస్టార్లర్లు పెట్టుకున్నారు. కాగా ఇప్పుడు 24 గంటల సరఫరాతో ఆటోస్టార్టర్ల వల్ల 24 గంటల పాటు బోర్లు పోస్తాయి. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చే నాటికి నీటి ఎద్దడి నెలకొంటుందన్నారు. కరెంటు అందుబాటులో ఉన్నా భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. కావునా ఆటోస్టార్లర్లను తొలగించుకోవడంతో పాటు అవసరం మేరకు మోటార్లతో నీరు తోడుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. చెరువులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుని వ్యవసాయం చేసుకునే అలవాటు, పద్ధతి మన రైతులకు ఉందన్నారు. పంటలకు అవసరానికి మించి నీరు పెడితే నష్టమే జరుగుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన ఉందన్నారు. ఇప్పుడు భూగర్భ జలాలను కూడా అవసరం ఉన్న మేరకే పొదుపుగా వాడుకుంటారనే నమ్మకం తనకుందని సీఎం పేర్కొన్నారు.