ఆటోను ఢీకొన్న మినీ వ్యాను: అయిదుగురు మృతి

Accident-1
Raod Accident In Nakarikallu Adda road

ఆటోను ఢీకొన్న మినీ వ్యాను: అయిదుగురు మృతి

నకరికల్లు అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
– పలువురికి తీవ్ర గాయాలు

నకరికల్లు, : ”రెప్పపాటులో, క్షణకాలంలో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి…దూరదృష్టం వెంటాడి ఆటో ప్రయాణం వారి ప్రాణాలను బలిగొంది…ఐదు కుటుంబాలలో రోడ్డు ప్రమాదం విషాదఛాయలను నింపింది…

గుంటూరుజిల్లా నకరికల్లు మండలంలోని అడ్డరోడ్డు గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు నిండు ప్రాణాలను విడిచారు. నకరికల్లు వైపు నుండి ఐదుగురు ప్రయాణికులతో ఆటో నరసరావుపేటకు వస్తుంది. ఇదే సమయంలో నరసరావుపేట వైపు నుండి నకరికల్లు వైపు వెళ్తున్న అశోక్‌ లైల్యాండ్‌ వాహనం ఆటోను ఢీకొంది. అశోక్‌ లైల్యాండ్‌ వాహనం లిక్కర్‌ బాటిల్స్‌తో నకరికల్లు వైపు వెళ్తుంది. కాగా ప్రాథమిక సమాచారం మేరకు ఆటోకు ఉన్న ముందు చక్రం ఊడిపోవడంతో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అశోక్‌ లైల్యాండ్‌ వాహనాన్ని ఢీకొన్నట్లు స్ధానికులు చెప్తున్నారు.

ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మృతిచెందారు. మరొకరు సంఘటనా స్థలం నుండి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతిచెందారు. ఇంకొకరు వైద్యశాలలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో డిఎస్పీ కె.నాగేశ్వరరావుతో పాటు రూరల్‌ సి.ఐ.ప్రభాకర్‌, నకరికల్లు ఎస్‌.ఐ.అనీల్‌కుమార్‌, వారి సిబ్బంది, ఎక్సైజ్‌ సి.ఐ.వెంకటేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వెటర్నరీ వైద్యులు డాక్టర్‌ మురళికృష్ణ క్షతగాత్రులను కాపాడేందుకు తన సొంత వాహనంలో వారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.