అహింస

elephant

వాగుకు ఈవల రెండు ఏనుగులు నీళ్లలోకి దిగి తొండంతో నీళ్లు పీల్చుకొని పైన చల్లుకొంటున్నాయి. అది స్నానాంకమో, దాహార్తిని తీర్చుకోవడంతో పాటు ఏదేమైనా వాటి శారీరక పరిశు భ్రతకు నీళ్లల్లోకి దిగి ఆ చల్లదనంతో మనోల్లాసానికో దోహదమవుతోందని ఊహిద్దాం! ఇక వాగుకు ఆవలి గట్టు దగ్గర రెండు సింహాలు నీళ్లలోకి దిగి ఆరామ్‌గా పడుకొని అటు ఇటు దొర్లుతున్న భంగిమ స్నానాంకమని, దాహార్తిని తీర్చుకోవడమని ఏదైనా అనుకోవచ్చు! చిత్రమేమంటే ఆ సింహాలను చూస్తున్న ఈ ఏనుగులకు ప్రాణభయంతో వెనక్కు పరిగెత్తే సీన్‌ లేదు. అలాగే ఆ సింహాలకు ఈ ఏనుగులకు చూసినా మీదికి దూకి కత్తులాంటి నోటి పళ్లతో ఘోరంగా కొరికి, కొడవలి పదునులాంటి కాలిగోళ్లతో నానా రభసగా రక్కి చంపేసి ఆరగించాలనే భావన అసలే లేదు. ఇది చూడను, తినను అతిశయోక్తిగా నేడన్నా వాస్తవమే అంత. ఏమంటే ఆ వాగు పరిసరాలంత స్థలమహాత్యం, చిన్న చీమకైనా హాని తలపెట్టలేని, ఆ తలపే మచ్చుకు రాని సాధవర్తనతో కూడుకున్న పుణ్యధామం. ఏనుగుల్లాంటి సాధుజంతువుల కదలికలు అటుంచినా ఎంత క్రూరమృగాలైనా సింహాలు ఎటువంటి దుర్మార్గానికీ తావివ్వలేనంతగా తోకముడుచుకొని అక్కడికొచ్చిన పనిమాత్రమే చూసుకొని మౌనంగా అవతలికికెళ్లే విచిత్ర సన్నిధానం. ఆ తావు వీడిని సింహాలకు, ఏనుగులకు ఇంకా అచ్చెరువు గొలిపే విషయం అక్కడున్నంతసేపు గాఢస్నేహితుల్లా, కుటుంబసభ్యుల్లా, ఎనలేని ప్రేమ, వాత్సల్యం, జాలి చూపులు, ఆ స్థాయిలోనే మాటలూనా, అదే ఇవతలికొచ్చినా సరే ఎందుకు కొనసాగకూడదు? అడవి చరితకే మకుటాయమానంగా.

వాసి, రాశికెక్కిన సంఘటనలపరంగా ఎందుకు మలుచుకోకూడదు? అని రోజుల తరబడి అదే యోచన. అలాగే ఆచరిస్తున్నట్లుగా పగటికలలు. ఆకలేసినప్పుడు సింహాల జీవహింస వేట సరేసరి! అప్పుడెటూ హింస తప్పదు. అది భగవంతుని సృష్టి ఓ విధంగా. ఆ సమయం తప్పిస్తే తమతో సమాన బలవంతమైన ఏనుగుల జోలికే పోక వాటిని వెదికి వెదికి హింసించడం అటుంచి ఒకవేళ ఎదుట పడినా సరే వాటిని సాహార్ధంగా నవ్వుతూ పలకరించేంతగా, అడపాదడపా తమ ఇంట విందు, వినోదాలకు వాటిని సాదరంగా ఆహ్వానించేంతగా పరిణతి చెందాయి. స్థల మహాత్యం ఆ వాగు పరిసరాలకే కాదు. అడవి ఎల్లెడల సంఘీభావమే. మరీ గొప్ప పుటక ప్రాణుల మధ్య కనీ వినీ ఎరుగనంత స్నేహం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. అని ఎగిరి గంతేసినంతగా ఏనుగుల సంబరం. హింసకు అలవాటు పడిన తాము బలవంతాన అహింస బాటపడితే క్రమేపీ అలాగే అలవాటుపడితే దానికి స్పందించే తమ సంతృప్తి అంతా ఇంతాని సింహాలు. స్థూలంగా చూస్తే ఇది కదా ప్రాణుల మనుగడకు సార్థకత! దైవసన్నిధానంతో సరితూగగల సుగంధ భరిత, జ్వాజ్వలమాన ఉనికి. అది సాధ్యపడనీ, కేవం ఊహకే పరిమితమననీ ఏదేమైనా మంచి తలపోయడం వరకు శుభపరిణామమే ఎవరికైనా. ఆ సాకారం చరిఛాయలు ఆయా ప్రాణుల ప్రాప్తి, కృషితో అనుసంధానమై ఉండడం మాత్రం కేవలం దైవ నిర్ణయం కాగా వాతావరణం అనుకూలత, ప్రతికూలతకు ముడిపడి ఉన్నట్లే సుమండీ!
– వేలూరు మునుస్వామి, సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా