అవ‌స‌ర‌మైతే రైఫిల్ అసోసియేష‌న్‌ను ఎదుర్కొంటాం

trump
trump

తుపాకీ సంస్కృతిని రూపుమాపేందుకు చట్టాలు తీసుకువచ్చే విషయంలో అవసరమైతే నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఎ)ను ఎదుర్కొనడానికి సుముఖంగా వున్నానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌పై పూర్తిగా పట్టువున్న రిపబ్లికన్లు మాత్రం ఈ విషయంలో సృష్టతతో లేరు. తుపాకులకు పరిమితులు విధించే విషయంలో కొన్ని మార్పులు చేయడానికి మాత్రమే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. ఫ్లోరిడా స్కూల్లో కాల్పులు జరిగి 17 మంది విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో రిపబ్లికన్‌ నేతలు తీవ్రంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని హామీల వెల్లువ కురిపించినప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం. మరింత కఠినతరమైన తుపాకీ చట్టాలను తీసుకురావాలని కాల్పులు జరిగిన వెంటనే పదే పదే బహిరంగంగా పిలుపులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కిమ్మనకుండా వుండిపోయారు.
ఈ వారంలో ఉభయ పార్టీలకు చెందిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వౌట్‌హౌస్‌ పేర్కొంది. రిపబ్లికన్‌ హౌస్‌ స్పీకర్‌ పాల్‌ రియాన్‌తో ట్రంప్‌ ఈ ఘటనపై మాట్లాడారు. టిచర్లకు ఆయుధాలివ్వాలని, ఆసాల్ట్‌ రైఫిల్స్‌ కొనుగోలు చేసేందుకు కనీస వయసు పెంచాలని ట్రంప్‌ సూచించినా వాటికి పెద్ద ఆదరణ లభించలేదు.