అవినీతిని నిర్మూలించనిదే అభివృద్ధి ఎలా సాధ్యం?

Corruption
Corruption

అవినీతిని నిర్మూలించనిదే అభివృద్ధి ఎలా సాధ్యం?

దేశాభివృద్ధికి ‘అవినీతి ప్రధానఅవరోధంగా మారింది. సమాజంలోని అధిక సంఖ్యాకులైన ప్రజలు కొంత మేరకు అవినీతి సహించతగినదే అనే భావనకు వచ్చారు. వేగవంతమైన అభివృద్ధికి నిబంధనల అడ్డంకిని దాటా లంటే కొంతమేర అవినీతికి పాల్పడినా నష్టం లేదనే భావనలో జనం ఉంటున్నారు. అవినీతి మన జీవన విధానంలో భాగంగా మారింది. కుటుంబం నుండే దానికి బీజం పడుతున్నది. అక్రమ సంపాదన, లంచాలు తీసుకోవడం, వృత్తి బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం, అబద్ధ్దాలాడటం, నిబంధనలను ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు లెక్కలురాయడం,జీవిత భాగస్వా మిని మోసంచేయడం, అక్రమ లైంగిక సంబంధాలు వంటి అవినీతి చర్యలకు తల్లిదండ్రులు పాల్పడటం చూసి గమనిస్తున్న నేటి బాల లు ఇవి సమాజంలో ‘సహజం అనుకుంటూ పెరుగుతున్నారు.

ఇతరుల జ్ఞానం,ఆస్తిని దొంగలించడం తప్పుగా పెద్దగా భావించడం లేదు. చూసి రాసి మార్కులు అతిసహజంగా సంపాదిస్తున్నారు. యాజమాన్యాల, తల్లిదండ్రుల ఒత్తిడికి కొంత, సహజ బోధన ప్రతిభ లేక కొంతమంది టీచర్లు పిల్లలను చూసీచూడనట్లు వదిలి వేసి వారు ఎక్కువ మార్కులు అక్రమంగా పొందేలా చేస్తున్నారు. ఎంట్రెన్స్‌లు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలలలో ఒకరికి బదులు ఇంకొకరు రాయడం, దళారులకు డబ్బులు ఇచ్చిమార్కులు వేయించుకుని ప్రతి భావంతులకు అన్యాయం చేస్తున్నారు. అక్రమంగా ఉద్యోగం సంపా దించిన వాడు కుర్చీలోకూర్చోగానే అక్రమాలకు, అవినీతికి తెరతీస్తు న్నారు. అంతకు ఇంత అనే రీతిలో సంపాదిస్తున్నారు. రాజకీయ అవినీతి మరో రకమైనది. వార్డు మెంబర్‌ నుండి ఎంపి, ఎమ్మెల్యేల వరకు ఎన్నికలలో ధనవ్యయం పెరిగింది. ఇసికి చూపించేది గోరం త, ఖర్చుపెట్టేది కొండంతగా ఉంది.

చిన్న గ్రామ సర్పంచ్‌ ఐదు నుండి 10 లక్షల ఖర్చు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలలు, ఎమ్మె ల్సీలు, ఎంపిల ఖర్చు కోట్లలో ఉంటున్నది. ఇంత డబ్బు వారెక్కడి నుండి తెస్తున్నారు? వారికెవరు ఇస్తున్నారు? వారు ప్రజలకెందుకు ఓట్ల కోసం ఇస్తున్నారు? ఎవరూ ఆలోచించడం లేదు. ఆలోచించినా తామేం చేయలేమని ఊరుకొంటున్నారు. ఇంత ఖర్చుపెట్టి గెలిచిన వీరు వడ్డీతో సహా రాబట్టుకోవడానికి అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బులు తీసుకొని మద్దతివ్వడం, ప్రత్యర్థి పార్టీలోకి మారడం, డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడగడం, అంశాలవారి మద్దతు ఇవ్వడం, డబ్బులు తీసుకుని ప్రత్యర్థిని ఓడించడం వంటి వాటి ద్వారా పెట్టిన ఖర్చు పూడ్చుకుంటున్నారు.
ఇక లాభంగా ప్రభుత్వ ధనాన్ని మేస్తున్నారు. అభివృద్ధి పనులలో పర్సంటేజీలు, అక్రమ కాంట్రాక్టులు, అక్రమ ఉద్యోగ బదిలీలు, డబ్బులు తీసుకుని ఉద్యోగులను నియమించడం వంటివాటిద్వారా కోట్లు గడిస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు విధానపరమైన నిర్ణయాలలో మార్పులు చేయడం ద్వారా కొంత మందికి ఉపయోగ పడే నిబంధనలను చేర్చడం ద్వారా కొన్ని రంగాలకు ఎక్కవ నిధు లు కేటాయించడం ద్వారా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుండి కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టర్ల నుండి రాజకీయ పార్టీలకు ఈ డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది. కాంట్రాక్టర్లు అంటే కేవలం పనులు చేసేవారే గాక, అనేక ఇతర రంగాలను తీసుకోవాలి. ఉదా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న అక్రమ కాలేజీలు వగైరా. వ్యక్తులు వ్యక్తులను మోసం చేయడం, వ్యక్తులు ప్రభుత్వాన్ని మోసం చేయడం నేడు సర్వసాధారణంగా మారింది. ప్రతివాడూ ఇంకొకన్ని దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం కోసం ఏదైనా చేయవచ్చు అనే ఆలోచనలు పెరిగాయి.

అక్రమ మార్గాల ద్వారా త్వరగా అందలం ఎక్కినవారిని చూసి నీతిపరులు ఆందోళన చెందు తున్నారు. చివరకు ‘నీతి మార్గాన్ని పాటించేవారిని సమాజం చేత కాని వారిగా కష్టించే మనస్తత్వం లేని వారిగా ముద్రవేస్తుంది. నేడు అవినీతి సార్వజననమైపోయింది. పిల్లవాడు చూసి రాసే దగ్గరి నుండి మేధోపరమైన పరిశోధనలను తస్కరించేవరకు అవినీతి పెరిగింది. ఇది ఒక క్యాన్సర్‌ లాంటి నివారించలేని వ్యాధిస్థాయికి చేరింది. దీనిని ఇప్పటికైనా పసిగట్టి నివారించలేకపోతే ఎంతటి ఘనమైన ప్రణాళికలు ప్రవేశపెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టినా అభివృద్ధి కానరాదు. నేడు కొన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి బాహాటంగా కొనసాగుతుంది. రవాణా శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు పోలీసులు, రెవెన్యూశాఖ, రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ, ఇలా ఒక్కటేమిటి ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది.

నాడు రాజీవ్‌ గాంధీ ప్రతి రూపాయిలో 15పైసలు మాత్రమే పేదవారికి చేరుతుందనే నిజాన్ని అంగీకరించాడు. కాని నేడు ఎన్ని పైసలు అందుతుంది? మొత్తం బడ్జెట్‌లో ఎన్ని కోట్లు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లుతుందో, యేయే మార్గాల్లో ఏయే శాఖల్లో అవినీతి జరుగుతుందో ఒక కమిటీతో పరిశీలన చేయించాలి. అవినీతి సున్నా శాతంగా ఉన్న ‘నార్వే తదితర దేశాలను అధ్యయనం చేయాలి. అవినీతి నిర్మూలనకు బహుముఖీయమైన కృషి జరగాలి. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆధునీకరించి బయోమెట్రిక్‌ హాజ రు, సిసి కెమెరాలు అమర్చాలి. వీటిని ఆ శాఖల అధిపతుల కార్యా లయంలో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలి. ప్రతివారం సమీక్షలు,చర్చలు ఉండేలా చూడాలి.ముఖ్యమంత్రిని,మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్‌ఎల్‌సిలను, లోకాయుక్తా పరిధిలోకి తీసుకురా వాలి. వీరిపై వచ్చే అవినీతి ఆరోపణలపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి శిక్షించేలా చట్టసవరణ చేయాలి. ఎసిబి పరిధిని విస్త రించాలి. ప్రభుత్వేతర సామాజిక అవినీతిని వెలికితీసే బాధ్యతలు కూడా అప్పగించాలి. పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుండి కాక ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ద్వారా నీతిపరులను ఎంపిక చేయాలి.

దీనికి ఇసి తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. లేదా హైకోర్టుకు బాధ్యత వహించేలా చూడాలి. రాష్ట్రప్రభుత్వ నియంత్రణను పూర్తిగా తొల గించాలి. మేధావ్ఞలతో ఒక కమిటీని నియమించి అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే మార్గాలపై సూచనలు ఆహ్వానించాలి. వాటిని వెంటనే అమలు చేయాలి. ప్రజల నుండి సలహాలు స్వీకరించాలి. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో రోజువారీ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫిర్యాదులు స్వీకరించాలి. పత్రికలలో ఫోన్‌నెం, ఈమెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ నెం.లు ప్రతిరోజు ప్రచారం చేయాలి. వీరి వివరాలను గోప్యంగా ఉంచి తక్షణమే విచా రణ చర్యలు తీసుకునే యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ప్రజలు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఎస్‌ఎమ్‌ఎస్‌, ఇమెయిల్‌, ఆన్‌లైన్‌ ద్వారా కేసులురిజిస్ట్రర్‌ చేసుకునే సౌకర్యం కల్పించాలి.

ఫిర్యాదు అందగానే పోలీసులే వెళ్లి విచారణ చేసేలా చూడాలి. పోలీసులు డ్రస్సు, బాష, నడవడికను మార్చాలి. పాఠశాలల్లో ఇచ్చే స్టడీ సర్టిఫికెట్‌ నుండి ముఖ్యమంత్రి ఫైల్‌ నోట్స్‌ వరకు ప్రతి కాగితం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా, పారదర్శకతను నెలకొల్పాలి. అవినీతి జరిగినట్లు నిరూపితమైతే వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ప్రజలలో మార్పు రానిదే ఏ వ్యవస్థ బాగుపడదు. ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత ఆదాయాలు, ఓట్ల సమయాల్లో వచ్చే బహుమతులకు ఆశపడకుండా మొత్తం సమాజ అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. మనిషిని మనిషి దోచుకునే ఈ సంస్కృతిని నిర్మూలించకపోతే ఈ దేశాన్ని ఈ ప్రజలను ఎప్పటికీి బాగు చేయలేం. పేదవాని కన్నీళ్లను ఎన్నటికీ తుడ్వలేం.

– తండప్రభాకర్‌ గౌడ్‌