అవినీతిని నియంత్రించలేరా?

corruption
Corruption

అవినీతి, అభివృద్ధి కలిసి పయనించలేవు. అవినీతిపెరిగే కొద్దీ అభివృద్ధికి తూట్లు పడక తప్పదు. అభివృద్ధి ముందుకు నడిచేకొద్దీ అవినీతి వెనక్కు గుంజుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అవినీతి కూడా అక్కడే ఏదో ఒకరూపంలో ఉంటూనే ఉంటుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు వెచ్చించకపోతే అసలు అవినీతి తలెత్తే ప్రసక్తి ఉండదంటారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాలు అభివృద్ధి వైపు అడుగులు వేయక తప్పదు. వేలాది కోట్ల రూపాయలు వెచ్చించకా తప్పదు. అప్పుడు అదేస్థాయిలో అవినీతి పెరుగుతూనే ఉంటుంది. ఈ అవినీతిని అడ్డుకునేందుకు నియంత్రించేందుకు ప్రజాధనాన్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగైదు దశాబ్దాలుగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. 1962 జనవరి రెండున అవినీతినిరోధక శాఖను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసారు. ఎన్నో చట్టాలుచేసారు. వేలాదిమంది అధికారులను వలపన్ని పట్టుకున్నారు. మరెందరినో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినందుకు అరెస్టులుకూడా చేసారు. జైళ్లకు పంపారు. ఆస్తులు రికవరీచేసారు. ఇలాంటి చర్యలెన్నో తీసుకున్నారు. తీసుకుంటున్నారు. అవినీతిని సహించేదిలేదని ఉక్కుపాదంతో అణిచివేస్తామని అధికారంలో ఉన్నవారు ప్రకటనలపై ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఉభయరాష్ట్రాల్లో ముఖ్యమంత్రులిద్దరూ అవినీతిపై యుద్ధమే ప్రకటించినట్లు చెపుతున్నారు. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా అవినీతికి పాల్పడితే క్షమించేదిలేదని హెచ్చరికలపై హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నారు. కానీ ”ఊదరగొట్టం వాడు ఊదుతూ ఉంటే, చల్లార్పుడు గొట్టం వాడు చల్లార్చుకుంటూ పోయాడన్నట్లు ప్రభుత్వం ఎన్ని చట్టాలుచేసినా ఎంతమంది అధికారులను నియమించినా ఎంతమందిపై చర్యలు తీసుకున్నా అవినీతి మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితి తారస్థాయికి చేరిందనే చెప్పవచ్చు. మొన్న నెల్లూరు జిల్లాలో అటెండరుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగిపై అవినీతినిరోధక శాఖ అధికారులు దాడులుచేసి పట్టుకుంటే విస్తుపోయే విషయాలు బైటపడ్డాయి. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 100 కోట్లరూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు కనుగొన్నారు.ఆయన్ను అరెస్టుచేశారు. దర్యాప్తు జరుగుతున్నది. ఇది పూర్తయితే ఇంకెన్ని ఆస్తులు బైటపడతాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక అటెండరుస్థాయి ఉద్యోగి 100 కోట్లరూపాయలకుపైగా ఆస్తులు సంపాదించారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణలో కూడా గతవారంలో సిబిఐ వలపన్ని ఒక రైల్వే కాంట్రాక్టరు వద్ద ఏకంగా 15 లక్షలరూపాయలు లంచం తీసుకుంటున్న ఒక ఇంజనీరును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టుచేసారు. ఇక తెలంగాణలో మరొక హెచ్‌ఎండిఎ అధికారి ఇంటిపై జరిపిన దాడుల్లో 150 కోట్లరూపాయలకుపైగా అక్రమాస్తులు బైటపడ్డాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులే ఆయనకు సహకరించారని ఆరోపణలు రావడంతో ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. అందుకే అవినీతినిరోధించేందుకు ఎన్నిచర్యలు తీసుకున్నా ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకూ మరింత విజృంభిస్తున్న ఇందుగలడందులేడన్న సందేహం వలదన్నట్లు అంతటా వ్యాపించిపోయింది. అవినీతి అధికారులు భయం భక్తి లేకుండాపోతున్నది. పరాకాష్టకు చేరిందన్నా తప్పులేదు. మరొక ముఖ్యకారణం కష్టపడకుండా తెల్లారేసరికి లక్ష్మీపతులు కావాలన్న దురాశ సమాజంలో పెరగడమే కావచ్చు. కీలకపదవుల్లో నిర్వహిస్తున్న కొందరు అధికారులు, ప్రజాసేవ ముసుగులో చెలామణి అవుతున్న కొందరు రాజకీయ నాయకులు దళారులు ఈ దురాశకు అతీతులు కాకపోవడం వల్లనే దాని దుష్ప్రభావాలు సమాజంపై పడుతున్నాయి. వారి రాజకీయ అధికార దాటికి సమర్ధులైన అధికారులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. మూడోకంటికి తెలియకుండా జరుగుతున్న అవినీతిని పట్టుకోడం కష్టమే అయినా వాటిని వలపన్ని పట్టుకోగలుగుతున్నారు. కనుక బాహాటంగా నిర్లజ్జగా జరుగుతున్న అవినీతిని పసికట్టలేకపోవడం అనే ప్రశ్న ఉదయించదు. ఏశాఖలో అవినీతి ఉన్నదో ఎసిబి అధికారులకే కాదు ప్రజలకు కూడా తెలుసు. ఎలా అదుపుచేయాలో కూడా అధికారులకు కూడా తెలుసు. కానీ రాజకీయ జోక్యం వారిని స్వతంత్రంగా వ్యవహరించనివ్వడంలేదు. ఇదిఇప్పుడే కాదు ఏనాటినుంచో జరుగుతున్న తతంగమే. పశువులను కట్టేసి ఉన్నచోటుకు దూరంగా మేతవేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఎసిబి పటిష్టం కావాలని పాలకులు త్రికరణశుద్ధిగా కోరుకోవడంలేదేమోనన్న సందేహం స్పష్టం అవుతున్నది. ఇందుకు జరుగుతున్న సంఘటనలు కూడా అద్దంపడుతున్నాయి. ఏది ఏమైనా కారకులు కారణాలు ఏమైనా ఎసిబి పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లపోతున్నది. ఇన్నేళ్ల తర్వాత కూడా అవినీతి అధికారులను ఎసిబి పట్ల భయభక్తులు కలగడంలేదు. గతంలో ఉన్న భయాందోళనలు కూడా ప్రస్తుతం లేవనే చెప్పవచ్చు రాజకీయ జోక్యం పెరిగే కొద్దీ ఎసిబి బలహీనపడుతున్నదన్న మాట వాస్తవం. రాజకీయ అండ ఉంటే తమను ఏమీచేయలేరన్న ధీమా రోజురోజుకూ అవినీతి అధికారుల్లో పెరిగిపోతున్నది.ఇందుకు కొన్ని సందర్భాల్లో పాలకులు వ్యవహరిస్తున్న తీరు కూడా బలంచేకూరుస్తున్నది. ఎంత అభివృద్ధిచేసినా పథకాలు ప్రకటించినా అవినీతి అంతం చేయకపోతే వ్యర్ధమనే నిజాన్ని పాలకులు గుర్తించాలి.