అవార్డుపై విమర్శలు చేయడం హాస్యాస్పదం: మంత్రి జగదీష్‌ రెడ్డి

Jagadish reddy
G. Jagadish reddy

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ
నాయకత్వ అవార్డుపై చేస్తున్న విమర్శలు అర్థరహితమని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష రెడ్డి అన్నారు. ప్రజలకు
సంబంధం లేని అవార్డు అంశాన్ని కొండంతలుగా చేసి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ అవార్డుకు
ప్రముఖ వ్యవసాయవేత్త స్వావినాథన్‌ సీఎం కేసీఆర్‌ను సిఫార్సు చేసిన అంశాన్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తించాలని
సూచించారు. గతంలో ఇటువంటి అవార్డు కాంగ్రెస్‌ సీఎంలలో ఎవరికైనా వచ్చింది? అని జగదీష్‌ రెడ్డి ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంపై అసూయతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి సైతం అభివృద్ధిని
అడ్డుకునేందుకు ఎక్కువ కేసులు వేసిన పార్టీగా గుర్తించి ప్రజలు అవార్డులు ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌
పార్టీలోకి టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు వస్తాయని ఆ పార్టీ నేతల ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఆ పార్టీలోకి
టీఆర్‌ఎస్‌ వలసలు వెళ్లే వారు ఎవరూ ఉండరని చెప్పారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై అఖిలపక్ష
సమావేశం ఏర్పాటు చేయడం వృథా అని మంత్రి అభిప్రాయపడ్డారన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని ప్రతిపక్షాల
నుంచి ఎమి సలహాలు స్వీకరిస్తామని ప్రశ్నించారని తెలిపారు.