అర్చ‌కుల‌కు కూడా ఇక‌పై పేస్కేలు

hindu preists
hindu preists

హైద‌రాబాద్ః తెలంగాణలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుకను ముందుగానే అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకులకు కూడా పేస్కేల్ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్ లో ఈరోజు అర్చకులతో కేసీఆర్ భేటీయై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం . ఈ సందర్భంగా అర్చకుల సమస్యలు, ఆలయాల నిర్వహణ, వేతనాల పెంపు, ధూపదీప నైవేద్యాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నవంబర్ నుంచి అర్చకులు, ఆలయాల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పేస్కేలు అమలు చేస్తామని చెప్పారు. మొత్తం 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందుతాయని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతాయని చెప్పారు. అర్చకులకు పిల్లను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారని… తాజా నిర్ణయంతో అర్చకుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు అమలవుతున్నాయని… ఈ పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేవాలయాల నిర్వహణ పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తామని… దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గిస్తామని తెలిపారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.