అరకులో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

30 మంది పర్యాటకులతో వెళుతున్న బస్సు

విశాఖపట్నం: విశాఖ జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 19మంది గాయపడ్డారు. 30 మంది ప్రయాణికులతో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు అనంతగిరి మండలం డముక వద్ద ఐదో నెంబరు మలుపు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ బస్సులో ఉన్నవారిని హైదరాబాదుకు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఎస్‌కోట, అనంతగిరి, కేజీహెచ్‌ దవాఖానలకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చీకటిగా ఉండటంతో సహాయచర్యలకు అంతరాయం ఏర్పడుతున్నది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని భావిస్తున్నారు.