‘అమ్మ’ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాంః దిన‌క‌ర‌న్‌

Dinakaran
Dinakaran

చెన్నైః రాష్ట్ర అసెంబ్లీకి జరుగబోయే ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వాన్ని నెలకొల్పనున్నట్టు ఆర్‌కే నగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ పేర్కొన్నారు. తిరువారూర్‌ జిల్లా మన్నార్‌గుడి సమీపంలోని పట్టాన్‌కోయిల్‌ ప్రాంతంలో ఉన్న తమ కులదైవం వీరమణవాళస్వామి ఆలయంలో టీటీవీ దినకరన్‌, ఆయన భార్య అనూరాధ, కుమార్తె జయహర్షిణితో సహా బంధువులతో కలసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితలు ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం పలు మంచి పథకాలను ప్రవేశపెట్టి చరిత్రలో స్ధిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంలు ఈ పథకాలను అటకెక్కించి తన పదవులను కాపాడుకొనేందుకు బీజేపీకి బానిసలయ్యారని విమర్శించారు.
రాష్ట్ర అసెంబ్లీకి జరుగబోయే ఎన్నికల్లో ఆర్‌కే నగర్‌ స్థాయికి మెజార్టీ విజయం సాధించి అమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా తన రాజకీయాలు సాగుతాయన్నారు. తనపై నమోదుచేసిన కేసులన్నింటిలోనూ విజయం సాధిస్తానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. బుధవారం ఆర్‌కే నగర్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నట్టు దినకరన్‌ తెలిపారు.