అమరావతి అభివృద్ధిలో జపాన్‌ భాగస్వామ్యం

AP CM
AP CM

+ ముఖ్యమంత్రిని కలిసిన జపాన్‌ రాయబారి బృందం
+ సిఎంకు విజయవాడ ట్రాఫిక్‌, మంచినీటి సరఫరా, డ్రైనేజ్‌ వ్యవస్థలపై నివేదిక అందించిన బృందం
విజయవాడ: రాష్ట్ర అభివృద్ధిలో జపాన్‌ భాగస్వామ్యంపై సిఎం చంద్రబాబు నాయుడు జపాన్‌ రాయబారి కెంజి హిరమట్సుతో చర్చించారు. బుధవారం సిఎంను ఆయన నివాసంలో జపాన్‌ రాయబారితోపాటు పలువురు సభ్యులు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం ఆయనను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ విజ్ఞానం పెంచే సంస్థలను ఏర్పాటు చేస్తే ఉపాధి, పెట్టుబడులు మెరుగుపడతాయని, అందుకు కావాల్సిన వనరులన్నీ నవ్యాంధ్రలో వున్నాయని జపాన్‌ ప్రతినిధి బృందానికి సిఎం తెలిపారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌, రవాణాకు సంబంధించిన అధ్యయనం, నవంబర్‌ 2018 నాటికి ఇస్తామన్న నివేదికపై ముఖ్యమంత్రిని అడిగి వారు వివరాలు తెలసుకున్నారు. అమరావతిలో డేటా సెంటర్‌, విపత్తుల నిరోధక వ్యవస్థ, విజయవాడలో ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ఐదు మంది సభ్యులతో కూడిన జపాన్‌ ప్రతినిథి బృందం స్పష్టమైన ప్రతిపాదనలను సమర్పించింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం సిఎం జపాన్‌ పర్యటనలో, ఆ తర్వాత ఏడాదిచైనాలో జరిగిన పర్యటనలో జపాన్‌ ఎక్స్టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో) ప్రతినిథులతో జరిగిన సమావేశంలో చర్చించుకున్న అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్‌ రాయబారితో ప్రస్తావించారు. ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కి చెందిన అనేక సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఏపి అధికారులు, జపాన్‌ అధికారులు పలు దఫాలుగా సమావేశమై చర్చలు జరుపుతున్నారన్నారు. సీఆర్‌డిఏ సహకారంతో రాజధాని అమరావతిలో 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌ను అభివృద్ధి చేయడానికి కుని ఉమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. అంతేకాదు, రాజధాని ప్రాంతంలో గృహనిర్మాణం పట్ల జపాన్‌ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఆహార శుద్ది యూనిట్లు పరస్పర సాంకేతిక సహకారాలకు ఆసక్తిని ప్రదర్శించిందని బృంద సభ్యులు తెలిపారు. ఆహారశుద్ది యూనిట్లు, పరస్పర సాంకేతికత సహకారాలకు ఆసక్తి కనబర్చారు. త్వరలో విశ్వవిద్యాలయాల్లో జపాన్‌ భాషను కూడా ప్రవేశపెడతామని జపాన్‌ ప్రతినిథి బృందంతో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బౌద్ధ పర్యాటకంలో జపాన్‌కు ఏపికి ఎంతో సారూప్యత వుందని, ఇరువురు ఈ సందర్భంగా సమాలోచనలు చేశారు. అమరావతి రెఎండో టోక్యోగా చూడాలని గతం నుండి కూడా జపాన్‌, ఆంధ్రప్రదేశ్‌ అభిలషిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఆదిశగా అభివృద్ధికి బాటలు వేయాలని, ఇందులో జపాన్‌ సహాయ సహకారాలెంతైనా అవసరముందని సిఎం వారికి స్పష్టం చేశారు.