అభిమానం పిచ్చ ముదిరితే ..

Sahar tabar, Iran
Sahar tabar, Iran

అభిమానం ఉండటం తప్పు లేదు. కానీ.. మోతాదుకు మించిన అభిమానం ఎప్పుడూ మంచిది కాదు. మొదటికే మోసం తెచ్చే వైనం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కావటమే కాదు.. ఒక హెచ్చరికగా మారుతుందనటంలో సందేహం లేదు. అభిమాన నటీనటులను గుడ్డిగా అభిమానించటం.. వారిలా ఉండాలని ప్రయత్నించే పిచ్చ కొందరిలో కనిపిస్తుంది.

కానీ.. ఇది ముదిరి.. పిచ్చగా మారితే ఎంత ప్రమదమన్న విషయం ఇరాన్కు చెందిన సహర్ తబర్ అనే 19 ఏళ్ల యువతిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ అంటే పిచ్చ ఇష్టం. ఆమెలా కనిపించాలన్నది తబర్ తపన. ఇందుకోసం భారీ సాహసాన్నే చేసింది.

ఏంజెలీనా మాదిరి కనిపించటం కోసం బరువు విషయంలో చాలా కఠినంగా ఉంటూ 40 కేజీలు మించకుండా జాగ్రత్తపడుతోంది. ఇందుకోసం నానాపాట్లు పడుతోంది. ఇది సరిపోనట్లు..తన అభిమాన కథానాయికి మాదిరి కనిపించాలన్న అత్యాశతో యాభై ఆపరేషన్లు చేయించుకుంది. ఆమె మాదిరిగా మారటానికి రకరకాల ఆపరేషన్లు చేయించుకుంది. చివరకు ఎలా తయారైందంటే.. చూసేందుకే భయపడేలా మారింది.

ఒకప్పుడు చక్కని చుక్కలా ఉండే తబర్.. ఏంజెలీనా పిచ్చతో తాను చేసిన పనిని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆపరేషన్లకు ముందు తర్వాత అంటూ తన పాత.. ప్రస్తుత ఫోటోల్ని పెట్టగా.. పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. దెయ్యంలా మారవని.. మంత్రగత్తె బతికించిన శవంలా ఉన్నావని మరికొందరు తిట్టిపోస్తున్నారు. నిజమే.. మరి ఆమె పాత ఫోటోను చూస్తే.. తబర్కున్న పిచ్చ ఎంతో ఇట్టే అర్థమవుతుంది.