‘అభినందన’లోనూ దుబారాయేనా?

చంచాగిరిలో పోటీపడుతున్న అధికారులు
ప్రజాధనం వృధాలో మునుగుతున్న తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్‌ : యథా రాజా తథా ప్రజా అనేది పాత సామె తే అయినా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట అధికంగా వినిపిస్తున్నది. పాలకులు ఎలా ఉంటే అధికారులు కూడా అలాగే ఉంటారని ఈ రాష్ట్రాల్లో అన్వయించుకోవాల్సి ఉంటున్నది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చివరికి ముఖ్య మంత్రి అయినా లోటుపాట్లు జరుగుతుంటే సవరించాల్సిన ఉన్నతాధికారులు కూడా చంచాగిరికి పాల్పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అధికారుల చంచాగిరి వల్ల వ్యక్తిగతంగా వారు లాభ పడితే ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు కానీ…ప్రజాధనం వృధా అవుతున్నందున అది విమర్శలకు తావిస్తు న్నది. ఉన్నత స్థానంలో ఉన్న వారు ఇలాంటి చంచాగిరిని ప్రోత్సహించే విధం గా వ్యవహరిస్తున్నందున పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతున్నది. ఇలాంటి పోకడలకు స్వయంగా అధిక ప్రాథాన్యత కల్పించేలా అన్ని స్థాయిల్లో ఉన్న వారు పాలుపంచుకుంటున్నందున దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితికి పరాకాష్ఠగా నూతన సంవత్సరం సందర్భంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిని కలిసి, అభినందనలు తెలి పిన విషయంలో జరిగిన ఉదంతం తాజాగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉన్న ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు స్వంత ఖర్చులతో కాకుం డా ప్రభుత్వ వ్యయంతో విమానాలు,కార్లతో వెళ్లిన ఉన్నతాధికారులు కొందరు కాగా, స్వయంగా ప్రభుత్వ పరిపాలన శాఖ అంటే జిఎడి ఏర్పాటు చేసిన వాహనంలో విజయవాడకు వెళ్లడం గమనార్హం. ముఖ్యమంత్రికి నూతన సం వత్సరం కోసం శుభాకాంక్షలు తెలిపి, అభినందించాలని స్వయంగా జిఎడి అధి కారులే వర్తమానం పంపి, గరుడ లక్జరీ బస్సును ఏర్పాటు చేసి తీసుకెళ్లడం లోని ఔచిత్యం ప్రశ్నార్థకమవుతున్నది. పైగా అధికారులు ఇదే పనిపెట్టుకొని కొందరు విమానాల్లో, ప్రభుత్వ వాహనాల్లో విజయవాడకు వెళ్లి,అక్కడ ముఖ్య మంత్రిని కలసి అభినందించేందుకు పోటీపడటంతో జరిగిన ప్రజాధనం వృధా ను లెక్కించాల్సిఉంది. అక్కడే బడాబడా హోటళ్లలో బసచేసి మర్నాడు హైదరా బాద్‌కు చేరుకొనడంతో ఈ వ్యయంకూడా ప్రభుత్వ ఖజానాకు మైనస్‌గా భావించాల్సి ఉంది. అయితే తక్కువ మంది అధికారులు మాత్రమే వచ్చారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రస్తావించడం కూడా ఆయన ప్రజాధనం వృధాను కోరుకున్నట్లు అయిందనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

ప్రత్యేక సందర్భాలకు ముఖ్యమంత్రిని అభినందించాలనే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేసి సిఎం చంద్రబాబు అక్కడి నుంచే ప్రభుత్వ కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు. వివిధ జిల్లాల పర్యటనలు చేస్తూ ఎక్కువ సమ యం ఆ ప్రాంతంలోనే ఉంటూ హైదరాబాద్‌కు అప్పుడప్పుడే వచ్చి వెళ్తున్నారు. కాగా నూతన సంవత్సరం 2016ను పురష్కరించుకొని ప్రభుత్వ అధిపతిగా చంద్రబాబును కలిసి అభినందించుకోవాలని ఉన్నతాధికారులు అభిలషించడంలో అర్థం ఉంది?.. కానీ ఏ కొద్ది మంది మినహా అధికారులందరూ  హైదరాబాద్‌లోనే ఉన్నారు. సిఎం విజయవాడలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఐపిఎస్‌ అధికారులు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో విజయవాడకు తరలి వెళ్లి సిఎంను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అయితే అక్కడ ఐఎఎస్‌ అధికారులు వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో ఉండటంతో అది ముఖ్యమంత్రి గుర్తించారు. ఐఎఎస్‌ అధికారులు విజయవాడకు రావడం లేదా అంటూ చంద్రబాబు నాయుడు నేరుగా ప్రశ్నించడంతో అక్కడ ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కొంత ఇరుకున పడ్డారు. ఇది ఉదయం పదకొండు గంటల తర్వాత జరిగింది. దీంతో ఆ అధికారి ఏమిచేయాలో ఆలోచించారు. జిఎడి పొలిటికల్‌ కార్యదర్శికి సమాచారం ఇచ్చి హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది ఐఎఎస్‌లు విజయవాడకు వస్తే సమంజసంగా ఉంటుందని సూచించారు. దీంతో ఐఎఎస్‌లందరికీ హైదరాబాద్‌లో సెల్‌ఫోన్స్‌లకు మెసేజీ వచ్చింది. దీని సారాంశం ఏమిటంటే ముఖ్యమంత్రిని అభినందిందుకు సచివాలయం నుంచి బస్సు బయలు దేరుతున్నది. అందరూ రండి అని.. అప్పటికే మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. దీంతో ఎక్కువ మంది దీనికి స్పందించకపోయినా కేవలం అయిదుగురు ఐఎఎస్‌ ఉన్నతాధికారులు మాత్రమే గరుడ బస్సు ఎక్కి వెళ్లగా అప్పటికే కొందరు విమానంలో విజయవాడకు బయలు దేరారు. అయినప్పటికీ ఐపిఎస్‌లతో పోల్చితే ఐఎఎస్‌ల సంఖ్య  తక్కువగా నే ఉంది.  ఏదీఏమైనా ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రజాధనం మాత్రం అధికంగానే వృధా అయింది. బస్సులో వెళ్లిన వారు ఆ రాత్రికి అక్కడే ప్రభుత్వ ఖర్చుతో బసచేసి రావాల్సి వచ్చింది. ఈ బస్సుకూడా తగిన సౌకర్యంగా లేకపోవడంతో ఎందుకు వచ్చామా అని వెళ్లిన సీనియర్‌ అధికారులు బాధపడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే రాబడులు తగ్గిపోయి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధుల కొరతతో నీరసిస్తున్నప్పటికీ వృధా వ్యయాన్ని అరికట్టలేకపోతున్నది. విదేశీ పర్యటనలు కూడా అంతగా అవసరం లేకపోయినా పలువురు అధికారులు అధ్యయనం పేరుతో వెళ్లివస్తున్నారు. హంగులు-ఆర్భాటాలు కూడా ఎక్కువగానే చేస్తున్నందున అనవసర వ్యయం దాదాపుగా ఎక్కువగా జరుగుతున్నది. ఒకవైపు ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాకు ఆశించిన మేరకు నిధులు జమకావడం లేదని చెబుతున్నా, ప్రభుత్వ పరంగా దుబారా వ్యయాన్ని తగ్గించి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన భాద్యతను ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి.

తెలంగాణలోనూ అనుత్పాదక వ్యయం అధికమే
తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న సందర్భాలు తక్కువేమీ కాదు. అనుత్పాధక వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగానికి కేవలం 11 వేల కోట్ల వరకు కేటాయింపులు జరిగినా అందులో మార్చి నెలాఖరుకు కూడా ఏడెనిమిది వేల కోట్లను కూడా ఖర్చు చేసే పరిస్థితి కనిపించడం లేదు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత తక్కువ వ్యయంచేస్తున్న ఇరిగేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో మాత్రం 25 వేల కోట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదాయం బడ్జెట్‌ అంచనాల మేరకు వసూలు కాకపోవడంతో అధికంగా అప్పులపై ఆధారపడుతున్నారు. పైగా మరింత రుణం తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మిషన్‌ కాకతీయ, ఇంటింటికి మంచినీటి సరఫరా కోసం ప్రారంభించిన వాటర్‌ గ్రిడ్‌ పథకాలకు హడ్కో ద్వారా రుణం తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఖజానాకు వచ్చేరెవెన్యూ ఆయా పథకాలకు సరిపోనందున అదనపు రుణం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే బ్యాంకుల ద్వారా కూడా మరో 25 వేల కోట్లవరకు రుణం తీసుకోవాలనేప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. పాలకులు ప్రజాధనానికి దర్మకర్తలుగా వ్యవహరించాలనే లక్ష్మణరేఖను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడో విస్మరించినందున ఈ దుస్థితి ఏర్పడుతున్నది.