అన్ని రుగ్మతలకు మనసే కారణమా?

SADNESS
SADNESS

అన్ని రుగ్మతలకు మనసే కారణమా?

మనుష్యులు సాధారణంగా ఏవేవో సమస్యలతో, భయాలతో, తమను అర్థం చేసుకునే ఆప్తులు కరువై బాధపడుతుంటారు. ఇది నా బాధ అని చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. ఎవరికైనా చెప్పుకుందామన్నా, వారు ఏదో ఒక రకమైన హేళనతో, విమర్శలతో, ఉచిత సలహాలతో మరింత బాధపెడతారు. మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలు సాధారణంగా ఈ కింది విధంగా ఉంటాయి.

వీటిలో ఎవరో తమ నెత్తిన రుద్దినవి కొన్నైతే, స్వయంకృతాపరాధాలు మరికొన్ని. కృతఘ్నతతో కూడిన బంధుత్వాలు, కుటుంబ కలహాలు, ఏరుదాటి తెప్ప తగ లేసే విధంగా ఉండే స్వార్థపరత్వం, కక్షలు మొదలైనవి. వివాహంతో ముడిపడిన సమస్యలు అనేకం. వీటిలో వివాహానికి ముందు ఉండేవి కొన్ని, తరువాత వచ్చేవి మరికొన్ని. ఏం చేయాలో పాలుపోని సందిగ్ధ స్థితి, నిరుద్యోగం, రుణ బాధలు మొదలైనవి. మనస్సుతో ముడిపడి ఉన్న జీవితాలు కావడంతో పైన పేర్కొన్న జాబితాకు అంతం ఉండదు.

మనస్సు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెడుతుంది. మనసుకు రూపం లేదు. ఇది పాదరసంలాగా పట్టు చిక్కకుండా పారిపోతుంటుంది. చిత్తవృత్తి, తెలివి, బుద్ధి, అహంకారం – ఇవన్నీ కలిసి అంతఃకరణ లేదా మనస్సు అవుతాయి. ఇవి మనిషిని అనేక భ్రమలకు లోనుచేసి తీవ్రమైన అశాంతికి గురి చేస్తాయి. దీని గురించి ఆలోచిస్తే మనం మనసు గుప్పిటలో ఉన్నామని, అది ఆడించినట్లు ఆడుతున్నామని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.