అధికారం మాదేనంటున్న టిఆర్‌ఎస్‌ !

TRS
TRS

ఎగ్జిట్‌పోల్స్‌ అన్ని టిఆర్‌ఎస్‌కే మెజారిటీ సీట్లు అంటున్న వైనం..!!
హైదరాబాద్‌: ఈసారి కూడా తమదే అధికారమని టిఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అన్ని టిఆర్‌ఎస్‌వే మెజారిటీ సీట్లు అని చెప్పడాన్ని వారు పేర్కొంటున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ ఎవరు చేసినా..దాని ఫలితం ఒక్కటేనని…తెలంగాణ రథసారధి కేసిఆర్‌నే రెండవ సారి సిఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన అందిస్తున్న కేసిఆర్‌ను మళ్లీ మనస్ఫూర్తిగా ప్రజలు దీవించినట్లు సర్వేలన్నీ ఒకే గొంతుకగా చెప్పటాన్ని వారు స్వాగతిస్తున్నారు..ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాఫ్రంట్‌ పేరుతో దుష్టశక్తులు ఏకమైనా..ఆ కూటమికి ప్రజలు ఆదరించలేదని వారు పేర్కొంటున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన కేసిఆర్‌ను ప్రజలు మళ్లీ ఎన్నుకోనున్నట్లు ప్రతి సర్వే ఏజెన్సీ తమ నివేదికలో తేల్చాయని వారు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణలో మళ్లీ కేసిఆర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని పోలింగ్‌ సందర్బంగా మంత్రి కేటిఆర్‌ వెల్లడించారు. కేసిఆర్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీకి మళ్లీ అధికారాన్ని అందిస్తాయని అన్ని సర్వేలు పేర్కొంటున్నాయని వారు చెబుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 46 శాతం ఓటు షేర్‌ దక్కినట్లు పార్టీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ స్కీమ్‌లు ఓటర్లను చాలా ఆకర్షించాయని పలువురు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముస్లిం, హిందూ ఓటర్లు కేసిఆర్‌వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవడం..ఆద్బుతమైన పథకాలతో ప్రజలను ఓట్ల వైపు కేసిఆర్‌ ఆకర్షించారని..తద్వారా పార్టీని ఈఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి తీసుకొస్తున్నారని పలువురు టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతోన్నారు.