అదుపు తప్పుతున్న అవినీతి

                                    అదుపు తప్పుతున్న అవినీతి

CORRUPTION
CORRUPTION

అక్రమ సంపాదనలో అటెండరయినా, ఆఫీసరయినా ఒకరే. కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆస్తులు పెంచుకుంటున్నారు. ఈ శాఖ ఆశాఖ అనీకాదు. ఏ శాఖ చూసినా ఇలాంటి ప్రబుద్ధులకు కొదువ లేదు. ఇదివరకు ఏవో కొన్ని విభాగాల్లోనే లంచాలు గుంజుతున్నారని జనం గగ్గోలు పెడుతుండే వారు. ఇప్పుడు లంచం బల్ల కిందకాదు బల్లపై నుంచి దర్జాగా ఒక ఆనవాయితీగా సాగుతోంది. ఏదైనా పనికాలేదంటే ఆ డిపార్టుమెంటుకు ఎంతో కొంత ఇచ్చేయలేక పోయావా అని అను భవమున్న వారు మనకు హితవ్ఞ పలకడం పరిపాటి అయింది. అలాగే అక్కడ ఉన్న బంట్రోతుకు లేదా అటెండరుకు కూడా ఇస్తేనే ఫైలు వేగంగా ఆఫీసరు దగ్గరకు వెళ్తుందన్నది అలవాటుగా మారిం ది.ఇటువంటి వాతావరణం దాదాపుప్రతి విభాగంలో కనిపిస్తోంది. అందులో ప్రజలకు కొన్ని విభాగాలతో నిత్యం ఏదోఒక సంబంధం ఉంటుంది. అటువంటి విభాగాల్లో రవాణా విభాగం ఒకటి. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో ఒక అటెండరు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వడ్డీకి రుణాలిచ్చే స్థాయికి ఎదిగాడంటే అతడు ఎంత అక్రమంగా సంపాదిస్తున్నారో తెలుస్తుంది. అవినీతి నిరోధకశాఖ అంచనాల ప్రకారం అతని సంపాదన ప్రస్తుతానికి 80 కోట్లుగా తేలింది. ఇంకా అనేక చోట్ల వేరే బినామీ పేరున ఉన్న ఆస్తుల్ని ఆరా తీస్తున్నారు. భార్య పేరునే భారీస్థాయిలో ఆస్తులు ఉండడం విశేషం. మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూములు, 18 నివాస స్థలా లు, ఒక భవనంతోపాటు కిలోల కొద్దీ బంగారం, బ్యాంకులో, ఇంటి లో కూడా నగదు నిల్వలు, కోట్ల విలువైన ఎల్‌ఐసి డిపాజిట్లు ఇవన్నీ బయటపడ్డాయి. అవినీతి శాఖ ఎన్నిదాడులు చేసినా, దోషులుగా పట్టుబడిన వారిని కోర్టుల కెక్కించి శిక్షలు పడేట్టు చేసినా అవినీతి ఆగడం లేదు.అలాగే లంచాల విలువ కూడా లక్షలు దాటి కోట్లకు చేరుతోంది.

ఇప్పుడు ఎక్కడ ఎసిబి దాడులు జరిగినా కొన్ని కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మరి ఇన్ని కోట్లు లంచాలు ఏ విధంగా సమకూరుతున్నాయో నిందితులకే తెలియాలి. నిందితులు ఒకవైపు కేసులకు చిక్కుతున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఎటొచ్చే కేసుల విచారణ ఎంతవరకు ఎలా సాగుతుంది? ఎంతమం దికి శిక్షలు పడుతున్నాయి? అన్నవే ఇప్పుడు సమాధానాలు దొరకని ప్రశ్నలు.2016లో 60వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. 2013లో 35,332 ఫిర్యాదులు వస్తే అప్పటితో ఇప్పటి పరిస్థితులు పోలిస్తే 32 శాతం ఈ కేసులు పెరిగాయని చెప్పవచ్చు. 2014లో రైల్వేపై 12వేలకుపైగా ఫిర్యాదులురాగా బ్యాంకు అధికారులపై 3572, ఆదా యం పన్ను అధికారులపై 3465 ఫిర్యాదులు వచ్చాయి. 2016లో మొదటి ఆరు నెలల్లోనే తెలంగాణాలోని ప్రభుత్వ శాఖల్లో వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ విభాగానిదే పైచేయి అయింది. మొత్తం వచ్చి న ఫిర్యాదులను బట్టి 5519 ఫిర్యాదుల్లో 3365 కేసుల వరకు ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవారే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య1.87 కోట్లు. వీరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 33.01 లక్షల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని ప్రభుత్వ శాఖల్లో ఏటా చేతులు మారుతున్న లంచాల సొమ్ము వేల కోట్లకుపైగా ఉంటుందని అనధికారికంగా తేలింది. ఈ లెక్కలను బట్టి చూస్తే దేశమంతా ప్రభుత్వ శాఖల్లో చేతులు మారుతున్న లంచాల సొమ్ము 1,00,000 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా తెలుస్తోంది. ఇక రవాణా శాఖలో మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి మామూలు బంట్రోతు వరకు చేతులు తడిపితేనే కాని ‘బండి కదలదు అన్న అపవాదు ఎక్కువగా ఉంటోంది.

ఈ రవాణా శాఖలో ఏటా 100కోట్ల నుంచి 200కోట్ల వరకు లంచాలు వసూలవ్ఞతుం టాయన్న విమర్శ ఉంది. పోలీసు శాఖలో ఏటా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు లంచాలు పంచుకుంటున్నారని అంచనాగా తెలు స్తోంది. స్టాంప్స్‌ అండ్‌రిజిస్ట్రేషన్‌ శాఖలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవ్ఞతుంటాయి. ఒక్కో డాక్యుమెంటుకు వెయ్యి రూపాయలైనా ఇవ్వ వలసి వస్తుందన్న ఆరోపణ చోటు చేసుకుంటోంది. దాంతో ఏటా 200 కోట్ల నుంచి 600కోట్ల వరకు వసూళ్లు ఉంటాయన్న అంచనా ఉంది.పోలీసు శాఖలోఏటా రూ.180 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ముడుపులు సులువ్ఞగా అందుతుంటాయన్న ఆరోపణ వినిపిస్తోంది. విద్యుత్‌ శాఖలో కొత్తగా కనెక్షన్‌ ఇవ్వాలనుకుంటే చేతులు తడపనిది కనెక్షన్‌ రాదన్న వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం రైతుల నుంచి పదివేల రూపాయల వరకు గుంజుతుంటారు. ఏటా కనీసం ఒక్కో రాష్ట్రంలో 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు లంచాల రాబడి రావడం పరిపాటి. పౌరసరఫరా శాఖలో డీలర్ల నుంచి అధికారుల వరకు లంచాల వ్యవహారం చాప కిందనీరులా సాగుతుంది. ఆన్‌లైన్‌ అమలులోకి వచ్చినా చాటుమా టు బాగోతాలు తగ్గడంలేదు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, కూడా లంచాల బాగోతాలకు తెరతీస్తున్నాయి. రెండేళ్ల క్రితం నిజాం పేట శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవ్ఞట్ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇందులో అధికారుల నుంచి సర్పంచ్‌ల వరకుకొన్ని వం దల కోట్ల లాభాల వాటా ఉన్నట్టు బయటపడింది. టౌన్‌ప్లానింగ్‌లో అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బందివరకు లక్షలరూపాయలు ముడు పులుగా పుచ్చుకుంటున్న నిర్వాకాలు సాగుతుంటాయి.

ఈ మేరకు ఒక టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఇంటిపై ఎసిబి దాడి చేయగా 70 లక్షల వరకు బయటపడింది. ఇక ఎక్సయిజ్‌సిబ్బంది నిర్వాకం పరిశీలిస్తే షాపుల నుంచి నెలనెలా ఇంత అని చెప్పి కొన్ని లక్షలు దండుకో వడం బహిరంగ రహస్యం. లిక్కర్‌ షాపులు వేలం వేసేటప్పుడు షాపుకు ఇంత అని కొంత మొత్తం చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.తెలంగాణాలో 800బార్లు, 1240 వైన్‌షాపులు ఉన్నాయి. ఈ లెక్కన అంచనాగా ఏటా వంద కోట్లయినా అమ్యామ్యా రాబడి రావచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 4500 వరకు లిక్కర్‌ షాపు లు, 770 బార్లుఉన్నాయి. వాటి నుంచి నెలవారీగా ఏటా వసూల య్యే మామూళ్లే ఏడాదికి 170 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటాయని అంచనాగా తెలుస్తోంది. 2015లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సివిసి) గణాంకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల సిబ్బంది 10వేల మందికి అవినీతి కేసుల్లో శిక్షలు పడ్డాయి. వీరిలో 60శాతం మంది బ్యాంకర్లే ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి లో 60 శాతం మంది వీరే. దేశంలో ప్రతి 100 అవినీతి కేసుల్లో సగటున కేవలం 10శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. 2015 లో దేశవ్యాప్తంగా 5867 కేసులు ప్రభుత్వ ఉద్యోగులపై నమోదు కాగా,ఏడాది చివరినాటికి మొత్తంఅవినీతి కేసుల సంఖ్య 13,587కు చేరుకుంది.ఇందులో లంచాలుతీసుకున్న కేసులే ఎక్కువగా ఉన్నా యి. 29,206 కేసులు విచారణలో అప్పటికి ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి పథకాలను ఎన్ని అమలు చేసినా సిబ్బందిలో చిత్తశుద్ధి అవసరం. లంచాలకు ప్రలోభాలకు లోబడితే అనుకున్న లక్ష్యాలు నెరవేరవ్ఞ.

ఆన్‌లైన్‌ విధానాలు అమలులోకి వచ్చినా ఆ విధానాలను సరిగ్గా అమలు చేయాలంటే సిబ్బందిలో నిజాయితీ పారదర్శకత చాలా అవసరం. నేరాలు దర్జాగా సాగుతున్నా నమోదుకావడమే ఒక ప్రహసనం. ఒకవేళ నమోదయినా చాలా స్వల్పంగా మొక్కుబడిగా ఉంటున్నాయి.రాష్ట్రాలవారీగా చూస్తే గతపదిహేనేళ్లలో పశ్చిమబెంగా ల్‌లో అవినీతి కేసులు ఎన్ని నమోదయ్యాయి? ఎందరికి శిక్షలు పడ్డా యని పరిశీలిస్తే స్పష్టమయిన సమాధానం చెప్పడం కష్టం.గోవా తోపాటు మరోమూడు రాష్ట్రాల్లో నమోదయిన కేసులు విచారణ దశలోనే కొట్టివేయడమయింది. ఫిర్యాదుదారులపై, సాక్ష్యాలు చెప్పే వారిపై అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడడం, వివిధరకాల ఒత్తిళ్లు తీసుకురావడంలో ఈ కేసు చివరి వరకు విచారణకు నిల బడలేదని ఒక అధ్యయనంలో తేలింది. 2001-18 మధ్య కాలంలో దేశంలోని29రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 9.11కోట్ల కేసు లు నేరాలకు సంబంధించి దాఖలు కాగా వీటిలో అవినీతి కేసులు 54,139 మాత్రమేనని కామన్‌వెల్త్‌ హ్యూమన్‌రైట్స్‌ ఇన్షియేటివ్‌ అధ్యయనంలో బయటపడింది. ప్రభుత్వశాఖల్లో అవినీతికి సంబం ధించిన ఫిర్యాదులు 1,16,010 వరకు ఉండగా కేసులు మాత్రం 50 శాతానికి మించి నమోదు కాకపోవడం గమనార్హం.

– ఎం.రామకృష్ణ