అత్యవసర పరిస్థితి దిశగా ఫ్రాన్స్!

పారిస్: అల్లర్లతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ అత్యవసర పరిస్థితి విధించే దిశగా అడుగులు వేస్తుంది. చమురు సుంకం పెంపుపను నిరసిస్తూ రెండు వారాలుగా దేశంలో చెలరేగిన నిరసన జ్వాలలు శనివారం నుంచి హింసాత్మక రూపును సంతరించుకున్నాయి. అల్లరిమూకల ఆందోళనలతో ఫ్రాన్స్ హోరెత్తింది. ఈ నేపథ్యంలో అల్లర్ల కట్టడికి ఎమర్జెన్సీ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ అధికార వర్గాలు ప్రకటించాయి. చమురు సుంకం పెంపుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాడ్లు, గొడ్డళ్లు పట్టుకుని వీధుల్లో స్వైరవిహారం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, వాటర్కేనన్లు ప్రయోగించారు. దాదాపు 400 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో హింసను సహించేది లేదని అధ్యక్షుడు మాక్రాన్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రఖ్యాత యుద్ధ స్మారకంపై దాడికి పాల్పడినందుకు ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఇంత జరుగుతున్నా చమురు సుంకం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని బెంజిమన్ పేర్కోన్నారు.