అతివ‌ల‌పై అత్యాచార అదుపులో పోలీసులు విఫ‌లంః రేఖా

Rekha sharma
Rekha sharma

న్యూఢిల్లీ : మహిళలతో ఎలా ప్రవర్తించాలో హర్యానా పోలీసులు నేర్చుకోలేదని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్ర విమర్శలు చేశారు. గత వారాంతం నుంచి రాష్ట్రంలో అనేక అత్యాచారం, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రేఖా శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.’పోలీసులపై నాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళలతో ఎలా ప్రవర్తించాలో వారు శిక్షణ తీసుకోలేదు’ అని ఆమె తెలిపారు. తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి హర్యానా పోలీసు శాఖ అంగీకరించదని కూడా ఆమె తెలిపారు.అలాగే జింద్‌ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై డిజిపి అందచేసిన నివేదికపై రేఖా శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిజిపికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.జింద్‌ జిల్లాలో ఒక కాలువ సమీపంలో 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆమె సామూహిక అత్యాచారానికి గురైనట్లు వెల్లడయింది. ఈ ఘటనను మంగళవారం సుమోటోగా మహిళా కమిషన్‌ స్వీకరించింది. బుధవారం రాష్ట్రంలో మరొక అత్యాచార ఘటన జరిగింది. మూడు సంవత్సరాల బాలికపై 14 ఏళ్ళ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఈ నెల 15న పిన్‌జోర్‌ పట్టణంలో 10 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు రోజున పానిపట్‌ జిల్లాలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నెల 13న ఫరిదాబాద్‌లో 23 ఏళ్ల మహిళ కదులుతున్న కారులోనే అత్యాచారానికి గురయింది. కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం బుధవారం గవర్నర్‌ కప్తాన్‌ సింగ్‌ సోలంకినీ కలుసుకొని.. రాష్ట్రంలో నేరాల అదుపులో విఫలమైన ఖత్తార్‌ ప్రభుతాన్ని బర్తరఫ్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది.