అతిలోక‌సుంద‌రి అంత్య‌క్రియ‌ల‌కు స‌న్నాహాలు

SRIDEVI 33
SRIDEVI

దివి నుండి భువికి దిగివ‌చ్చిన అతిలోక‌సుంద‌రి శ్రీదేవి. ఆమె అందాన్ని వ‌ర్ణించ‌డానికి ప‌దాలు కూడా సరిపోవు. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోయిన్‌ల‌కి పోటీ ఇచ్చిన శ్రీదేవి గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆమె మ‌ర‌ణ వార్త అభిమానుల మ‌న‌సుల‌ని ఎంత‌గానో గాయ‌ప‌రిచింది. శ్రీదేవిని క‌డ‌సారి చూసేందుకు ముంబైలోని ఆమె ఇంటికి అభిమానులు భారీ ఎత్తున త‌రలి వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో అంధేరిలోని శ్రీదేవి నివాసం వ‌ద్ద ముంబై పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు. మ‌రోవైపు యూఏఈలోని భారత రాయబారి నవదీప్‌ సింగ్ శ్రీదేవి భౌతిక దేహాన్ని ముంబైకి త‌ర‌లించే విష‌యంలో అన్ని ర‌కాలుగా స‌హాయ‌ప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు అన్ని పూర్తైన త‌ర్వాత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో శ్రీదేవి భౌతిక కాయం దుబాయ్ నుండి ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్‌లో చేరుకోనుంద‌ని స‌మాచారం. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రంలోగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారట‌.