అణ్వాయుధ నిర్మూల‌న‌కు నోబెల్ శాంతి పుర‌స్కారం

ICAN
ICAN

స్టాక్‌హోమ్ః అణ్వాయుధాల నిర్మూలన కోసం పోరాటం చేస్తున్న ఇంటర్నేషనల్‌ క్యాంపేన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ (ఐసీఏఎన్‌) సంస్థకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. అణు ఆయుధాలు వాడటం వల్ల మానవ జాతికి ప్రమాదం ఉందన్న ఉద్దేశాన్ని వివరిస్తూ ఐసీఏఎన్‌ సంస్థ ప్రచారం నిర్వహిస్తున్నది. మానవ హనన అయుధాలను నిషేధించాలని ఆ సంస్థ ప్రపంచ దేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఐసీఏఎన్‌ అనేక సంఘాలతో కూడిన ఓ ఎన్జీవో కూటమి. సుమారు వంద దేశాలకు చెందిన సంస్థలు ఈ గ్రూపులో ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే న్యూక్లియర్‌ వెపన్స్‌ను అదుపు చేయాలన్న సిద్దాంతాలతో ఐసీఏఎన్‌ ఉద్యమం చేపడుతున్నది. నోబెల్‌ కమిటీ అణ్యాయుధ రహిత సమాజ స్థాపనకు చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఐసీఏఎన్‌కు శాంతి బహుమతిని ప్రకటించింది. అణ్యాయుధ దేశాలన్నీ నిరాయుధీకరణకు సహకరించాలని ఈ సందర్భంగా నోబెల్‌ కమిటీ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 వేల న్యూక్లియర్‌ వెపన్స్‌ ఉండగా, ఆ ఆయుధాలను నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని నోబెల్‌ కమిటీ సూచించింది.