అగ్రస్థానంలో స్మిత్‌

SMITH-
SMITH-

అగ్రస్థానంలో స్మిత్‌

దుబాయి: బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. ఐసిసి విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 929 పాయింట్లతో స్మిత్‌ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా….820 పాయింట్లతో డేవిడ్‌ వార్నర్‌ ఐదో స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి (912 పాయింట్లతో) రెండో స్థానం, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (867), న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (847)లకి ఆ తర్వాత స్థానాలు దక్కాయి. బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా పేసర్‌ కాగిసో రబాడ 897 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా…తర్వాత ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (891), దక్షిణాఫ్రికా బౌలర్‌ ఫిలాండర్‌ (845), భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (844), భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (844), రవిచంద్రన్‌ అశ్విన్‌ (803) టాప్‌-5లో నిలిచారు. ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ 420 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా…తర్వాత భారత స్పిన్నర్‌ జడేజా (390), ఫిలాండర్‌ (371), అశ్విన్‌ (367), బెన్‌స్టోక్స్‌ (328) టాప్‌-5లో నిలిచారు. శనివారం నుంచి ఐపిఎల్‌ ప్రారంభంకాబోతుండటంతో…దాదాపు రెండు నెలల పాటు ఇవే ర్యాంక్‌లు కొనసాగనున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మార్‌క్రమ్‌ కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. కెరీర్‌లో 10 టెస్టులు మాత్రమే ఆడిన మార్‌క్రమ్‌ 4శతకాలు, మూడు అర్థశతకాల సాయంతో మొత్తం వెయ్యి పరుగులు చేశాడు. దీంతో…తొలి 10 టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన అరుదైన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మార్‌క్రమ్‌ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.