అగ్రరాజ్య అభియోగాలను క్యూబా ఖండన

CUBA
CUBA

హవానా: తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిపై దాడులను ప్రొత్సాహిస్తున్నట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా తీవ్రంగా ఖండించింది. క్యూబాలో దౌత్య సిబ్బందిలో మరొకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీని లక్షణాలను గుర్తించి వ్యాధి నివారణ చర్యలు తీసుకునేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ దౌత్య సిబ్బందిపై దాడులు జరిపిన విషయాన్ని క్యూబా ప్రభుత్వానికి తెలియజేశామని అమెరికా విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి హెదర్‌ న్యూయెర్డ్‌ చెప్పారు. అమెరికా దౌత్యసిబ్బందిపై దాడులు జరిగినట్లు వచ్చిన వారత్లను క్యూబా విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. క్యూబా విదేశాంగశాఖలో అమెరికా వ్యవహారాల విభాగం డైరక్టర్‌ కార్టోస్‌ ఫెర్నాండెజ్‌ డికాసియో మాట్లాడుతూ అమెరికా ఉపయోగిస్తున్న దాడులు అన్న పదం దాని రాజకీయ అవకాశవాదాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు అమెరికా యత్నిస్తోందన్నారు. అమెరికా దౌత్య సిబ్బంది భద్రత,ఆరోగ్యంపై ఆ దేశం వ్యక్తం చేస్తున్న అందోళన కేవలం రాజకీయ అవకాశవాదమేనని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికాతో పాటు తమ దేశంలో విదేశీ దౌత్యవేత్తలందరికీ తమ ప్రభుత్వ పూర్తి భద్రతను హామీ ఇస్తోందని, అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలను గుర్తించే విషయంలో వారికి సహాకరిస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి అనారోగ్య లక్షణాలే చైనాలోని అమెరికా దౌత్య సిబ్బందికి కన్పించడంతో వారిని స్వదేశానికి పంపివేశారని ఆయన స్పష్టం చేశారు.