అక్షరకోటి గాయత్రీ పీఠం

             అక్షరకోటి గాయత్రీ పీఠం

gayatri peetam
gayatri peetam

ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని భావన. అలాగే వాల్మీకి రామాయణానికీ మూలాధారం గాయత్రీ మంత్రమేనని పేర్కొంటారు. ఈ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో రామాయణ మహాకావ్య రచన జరిగిందంటారు. అటువంటి వేద స్వరూపిణికి నెలవైన ఆలయం అక్షరకోటి గాయత్రీ పీఠం రాజమండ్రిలో ఉంది. అఖండ గోదావరీ తీరంలో కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రం ఎత్తయిన గాయత్రీ పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆకాశాన్ని తాకేలా ఉండే ఆలయం గోపురం ఎంతో ప్రత్యేకతలతో సంతరించుకుంటుంది.

షడ్చక్ర ఆకారంలో మొదటి ఆరు అంతస్తులూ, వాల్మీకి రామాయణంలోని ఆరు కాండలకు ప్రతీకలు మిగిలిన ఆరు అంతస్తులను నిర్మించారు. ఆలయం కింద భాగంలో వెయ్యి శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మేరువును ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలోనే నవగ్రహాలూ, సహస్రలింగేశ్వరుడి విగ్రహాలూ ఉన్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న ఇరవైనాలుగు అడుగుల కార్తికేయుడు, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

మొదటి అంతుస్తుని మూలాధార చక్రంగా, రెండో అంతస్తులో అయిదు ముఖాలతో బ్రాహ్మి అవతారంలో గాయత్రీదేవి దర్శనమిస్తుంది. మూడో అంతస్తులో మణిపురగా పిలుస్తారు. ఇక్కడ గాయత్రీ మంత్రంలోని మొదటి పాదంలో ఉన్న ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా అష్టలక్ష్ముల రూపాలను ప్రతిష్టించారు. దాని పై అంతస్తులో గాయత్రీ మంత్రంలోని రెండో పాదంలో ఉండే ఎనిమిది అక్షరాలను ప్రతీకలుగా మరో ఎనిమిది శక్తిస్వరూపాలను ఏర్పాటు చేశారు. ఆరో అంతస్తులో తుర్య గాయత్రీ మంత్రం ప్రకారంగా ఆజ్ఞాచక్రంలో చతుర్వేద మాతలను ప్రతిష్టించారు.

వాల్మీకి రామాయణంలోని ఆరుకాండలకు సంకేతంగా ఆలయంలోని మొదటి ఆరు అంతస్తులనూ తీర్చిదిద్దారు. ఏడు, ఎనిమిది అంతస్తుల్లో అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్టించారు. తొమ్మిదో అంతస్తులో నవ దుర్గలు, పదిలో దశ మహావిద్యలు, 11లో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలు, 12వ అంతస్తులో ధ్యానమందిరాన్ని నిర్మించారు. 144 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆలయ శిఖరాన్ని సుందరంగా నిర్మించారు. వాల్మీకి రచించిన రామాయణం గాయత్రీ మంత్రంతో ముడిపడి ఉంటుంది. రామాయణ మహాకావ్యంలో ఇరవై నాలుగువేల శ్లోకాలున్నాయి.

గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరంతో రామాయణంలోని మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. అంతేకాదు ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక్కో అక్షరం చొప్పున ఇరవైనాలుగు వేల శ్లోకాల్లో గాయత్రీ మంత్రంలోని ఇరవైనాలుగు అక్షరాలు పొందుపరిచి ఉంటాయి. అందుకే అమ్మవారి ఆలయ శిఖరాన్ని రామాయణ శిఖరంగా తీర్చిదిద్దారు. రామాయణ శ్లోకాలను ఆలయం గోడలమీద ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి తీరంలో నిర్మించిన గాయత్రీ పీఠాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమానమార్గాలు అందుబాటులో ఉన్నాయి.