అందుకే నా సినిమాలో పాటలు కూడా డిఫెరెంట్‌

Jai Simha Pre release
Jai Simha Pre release

నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘జైసింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, కె.ఎస్‌.రవికుమార్‌, వి.ఆనంద్‌ ప్రసాద్‌, ఆదిశేషగిరిరావు, జెమినికిరణ్‌, అశోక్‌కుమార్‌, ఫైనాన్సియర్‌ సత్తె రంగయ్య, వీరినాయుడు, ముత్యాల రాందాస్‌, ప్రసన్నకుమార్‌, ఎన్‌.వి.రెడ్డి, బోస్‌, సాగర్‌, రామసత్యనారాయణ, రాంప్రసాద్‌, సత్యనారాయణరెడ్డి, భాస్కరభట్ల, ఫైనాన్సియర్‌ ప్రసాద్‌, జయప్రకాష్‌ రెడ్డి, వి.వి.వినాయక్‌, బోయపాటి శ్రీను, నటాషా దోషి, ఎం.రత్నం, సి.రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. యూనిట్ స‌భ్యుల‌కు ప్లాటిన‌మ్ డిస్క్‌ల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా..

 

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – ”జై సింహా’ నవరసాలున్న సినిమా. నేను, కె.ఎస్‌.రవికుమార్‌గారు కలిసి ఓ సినిమా చేద్దామని ఎనిమిదేళ్లుగా అనుకుంటున్నాం. ఆ కల ఇలాంటి ‘జై సింహా’ అనే టైటిల్‌తో పూర్తి కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ‘జై సింహా’ సాధారణ టైటిల్‌ కాదు. నాన్నగారికి నిర్మాతగా మూడో సినిమాకు అదే టైటిల్‌. అఖండ విజయాన్ని సాధించిన సినిమా అది. అదే టైటిల్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. కె.ఎస్‌.రవికుమార్‌గారి గురించి తమిళ ప్రేక్షకులకే కాదు..తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అద్భుతమైన సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో చేయాలనే కోరిక ఇప్పుడు తీరింది. నటీనటుల నుండి చక్కటి హావభావాలను రాబట్టగల గొప్ప దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీశారు. రత్నంగారు అద్భుతమైన కథను అందించారు. ఆయన చెప్పిన కథ వినగానే వెంటనే నచ్చి చేసిన సినిమా. అప్పుడే సినిమా అయిపోయిందా? అనిపిస్తుంది. అ

భిమానులు, తెలుగు ప్రేక్షకుల నాడి తెలుసుకుని కథ, డైలాగ్స్‌ను రత్నంగారు రాశారు. చిరంతన్‌ భట్‌గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా చూశాక..అందులో రీరికార్డింగ్‌ ఎంతగానో నచ్చింది. యావత్‌ భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి శాతకర్ణి అయితే, యావత్‌ భారతదేశంలోనే కొత్త బాణీలను ఆ సమకూర్చిన ఘనత చిరంతన్‌భట్‌ది. ఈ సినిమాకు కూడా చిరంతన్‌ భట్‌ అయితే కసిగా చేస్తాడనిపించింది. ఈ సినిమాకు పాటలకు చక్కటి బాణీలను, అద్భుతంగా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

నా సినిమాలన్నీ లార్జర్‌ దేన్‌ లైఫ్‌గా ఉంటాయి. నటుడిగా మంచి కథలనే ఎంచుకుంటాను. అందుకే నా సినిమాలో పాటలు కూడా డిఫెరెంట్‌గా ఉంటాయి. నేను ఎప్పుడూ కుర్రాడినే. నాకు వయసుతో సంబంధం లేదు. అందుకనే జానీ అద్భుతంగా డాన్స్‌ కంపోజ్‌ చేశాడు. అలాగే బృందగారు కూడా మంచి డాన్సులు కంపోజ్‌ చేశారు. సంక్రాంతి పండక్కి సకుంటుం సపరివార సమేతంగాచూడదగ్గ సినిమా ‘జైసింహా’. విఎస్‌ఆర్‌స్వామిగారి శిష్యుడైన రాంప్రసాద్‌గారు ఈ సినిమాకు బ్యూటీఫుల్‌ విజువల్స్‌ అందించారు. సాహసానికి మారుపేరు నందమూరి తారక రామారావు. ఆయన అనుకున్నది చేసేవారు. ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఇక నటుడిగా నేను న‌టుడిగా `ఆదిత్య 369. భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, శ్రీరామరాజ్యం, గౌతమిపుశ్రాతకర్ణి, పైసా వసూల్‌` ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సినిమాలో రాని ట్విస్ట్‌ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా అద్భుతంగా ఉంటుంది” అన్నారు.

వి.ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ – ”నా అభిమాన హీరో బాలకృష్ణగారు నటించిన 102వ చిత్రం. ఆయనతో పాటు, కె.ఎస్‌.రవికుమార్‌గారు స‌హా యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ – ”బాలయ్యబాబు సినిమా పండుగకి వస్తుందంటే..దాన్ని బీట్‌ చేసే మరో సినిమా ఉండదు. `జై సింహా`లో యాక్షనే కాదు, సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ అన్ని ఉన్న సినిమా” అన్నారు.

అదిశేషగిరి రావు మాట్లాడుతూ – ”60 సంవత్సరాలు ముందు ఎన్టీఆర్‌గారు చేసిన సినిమా `జయసింహ`ను నేను థియేటర్‌లో చూసి ఆనందించాను. ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమా వస్తుంది. సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలు ఎక్కువగా విజయాలు సాధించాయి. ట్రైలర్స్‌ చూస్తుంటే పాత `జయసింహ` కంటే రాబోతున్న `జైసింహా` బ్లాక్‌బస్టర్‌ అవుతుందనిపిస్తుంది. కె.ఎస్‌.రవికుమార్‌గారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కల్యాణ్‌కు మంచి హిట్‌ చిత్రంగా, బాలయ్య కెరీర్‌లో ట్రెండ్‌ సెట్‌ మూవీ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ – ”బాలయ్య ఈ సినిమా ద్వారా సంక్రాంతికి మరోసారి గర్జిస్తారని భావిస్తున్నాను” అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ – ”నందమూరి బాలకృష్ణగారి నట విశ్వరూపం ఈ సినిమాలో మనకు కనపడుతుంది. కుంభకోణంలో బాలయ్యగారితో 14 రోజుల క్యారెక్టర్‌ను చేశాను. మాస్‌ సినిమాలు చేయాలంటే బాలయ్యే చేయాలి. కె.ఎస్‌.రవికుమార్‌, బాలయ్యను పూర్తి స్థాయి మాస్‌ పాత్రలో చూపించాడు. అలాగే బాలయ్యలోని ఎమోషనల్‌ యాంగిల్‌ను కూడా ఈ సినిమాలో చూస్తారు. అత్యద్భుతమైన డ్యూయల్‌రోల్‌లో బాలయ్య కనపడతారు” అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో జానీ కంపోజ్‌ చేసిన సాంగ్‌ చూశాను. బాలయ్య బాబు సాంగ్‌లో డాన్స్‌ను అదరగొట్టారు. సెట్‌లో బాలయ్య అందరితో ఎంతో ప్రేమగా ఉంటారు. నరసింహనాయుడు సినిమా తర్వాత ఒక బిడ్డ సెంటిమెంట్‌తో బాలకృష్ణ చేసిన సినిమా ‘జైసింహా’. యాక్షన్‌తో పాటు మంచి సెంటిమెంట్‌ ఉన్న సినిమా ఇది. నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన రవికుమార్‌గారు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సి.కల్యాణ్‌ అన్నయ్య ఈ సినిమాను ఎంతగానో ప్రేమించి చేశారు. కాబట్టి ఈ సినిమా ఆయన అనుకున్న దానికంటే పెద్ద హిట్‌ సాధిస్తుందని భావిస్తున్నాను” అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ – ”చిరంతన్‌ భట్‌గారు బాలయ్యబాబుతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే హిస్టారికల్‌ సినిమా తర్వాత మరోసారి చేసిన సినిమా ఇది. చిరంత‌న్ త‌న గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఈ కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన సంగీతంతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించారు. ‘నరసింహ’ సినిమా చేసిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌గారు..ఇప్పుడు ‘జైసింహా’ చేశారు. ‘నరసింహ’ ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ఈ ‘జైసింహా’ అంతే పెద్ద హిట్‌ను సాధించాలి. మంచి కథను సమకూర్చి కల్యాణ్‌గారు ఎంతో ప్రేమించి సినిమా చేశారు. సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఇక బాలయ్యబాబు గురించి నేను చెప్పేదొక్కటే..ఏ సినిమాలోనైనా ఆయన కసితో నిలబడతారు. సినిమాను నిలబెడతారు. వందశాతం అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లి ఉంటారు. ట్రైలర్స్‌, సాంగ్స్‌లో చూసింది తక్కువే. సినిమాలో ఇంకా ఎక్కువగా చూస్తారు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమా బావుండాలి. అన్నింటితో పాటు మన సినిమా కూడా బావుండాలి. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

చిరంతన్‌ భట్‌ మాట్లాడుతూ – ”మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌గారికి, సి.కల్యాణ్‌గారికి థాంక్స్‌. బాలయ్యగారితో నేను చేసిన రెండో సినిమా ఇది. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అందరికీ ఎంతో గౌరవం ఇస్తారు. ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటాను. రవికుమార్‌గారు నా తండ్రిలా ప్రొఫెషనల్‌గానే కాదు..వ్యక్తిగతంగా కూడా మంచి విషయాలను చెప్పారు. మంచి టీమ్‌తో పనిచేశాను. అన్ని అంశాలున్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది” అన్నారు.

కె.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ – ”నిర్మాత కల్యాణ్‌గారికి, బాలకృష్ణగారు నాకు మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రత్నంగారు మంచి కథను ఇస్తే, రాంప్రసాద్‌గారు మంచి విజువల్స్‌, చిరంతన్‌ భట్‌ మంచి మ్యూజిక్‌ను ఇచ్చారు. కల్యాణ్‌గారు మంచి నటీనటులతో పాటు మంచి టెక్నికల్‌ టీంను కూడా ఇచ్చారు. అందరూ ఎంతో బాగా సపోర్ట్‌ చేశారు. బాలకృష్ణగారికి చాలా కోపం వస్తుందని నేను సినిమా చేయడానికి ముందు చాలా మంది నాకు చెప్పారు. అయితే షూటింగ్‌ చేసేటప్పుడు ఆయనలో ఒక్కరోజు కూడా కోపాన్ని చూడలేదు. దాదాపు 47 సినిమాలు చేశాను. కథ విన్న తర్వాత హీరోలు సినిమాలో ఇన్‌వాల్వ్‌ అవుతారు. అలా ఇన్‌వాల్వ్‌ కావడం..వారి ఇమేజ్‌కు తగ్గట్టు తప్పేం కాదు కూడా. కానీ నాతో చేసిన ఇద్దరు హీరోలు మాత్రమే ఏం అడగకుండా సినిమా చేశారు. వారిద్దరెవరో కాదు..తమిళంలో అజిత్‌ అయితే..తెలుగులో బాలకృష్ణగారు. బాలయ్య గురించి మరో విషయం చెప్పాలి. ఆయన తండ్రిపై ఆయనకెంతో ప్రేమ ఉంది. ఇలాంటి కొడుకునే నేను ఇంత వరకు చూడలేదు. షూటింగ్‌ గ్యాప్‌లో ఎన్టీఆర్‌గారి సినిమాలు చూస్తారు..లేదా ఆయన నటించిన సినిమాల్లోని పాటలు వింటుంటారు. వృత్తిలో క్రమశిక్షణ, బాధ్యత ఉన్న నటుడు బాలకృష్ణ. ఎంతగానో సపోర్ట్‌ అందించారు. అందరికీ థాంక్స్‌” అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ – ”’జైసింహా’ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ మూవీ అవుతుందనేది కన్‌ఫర్మ్‌. పదిహేనేళ్ల క్రితం బాలయ్యబాబు ఎలాంటి డాన్సులతో మెప్పించారో తెలిసిందే. మళ్లీ నేనెంటోప్రూవ్‌ చేస్తాని బాలయ్యబాబుగారు వేసిన చిందులే రేపు అభిమానులు సంక్రాంతికి వేయబోయే చిందులు. డాన్సులు, యాక్షనే కాదు..ప్రేమ, అభిమానంతో ఎలా ఉండాలి. ఎదుటివారిని ఎలా గౌరవించాలని చెప్పేదే ఈ సినిమా. చిరంతన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అందరూ ఎంతో కష్టపడ్డారు కాబట్టే సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. సినిమా స్టార్టింగ్‌ రోజునే సంక్రాంతికి జనవరి 12న సినిమా రిలీజ్‌ చేయాలనుకున్నాం. అనుకున్నట్లుగానే పూర్తి చేశాం. కంటెంట్‌ను ఓవర్‌సీస్‌కు కూడా పంపించాం. మూడు సినిమాలు సెట్‌లో ఉన్నా నిర్మాతగా ఈ సినిమాను ఎంతో ప్రేమించి చేశాను. కారణం బాలయ్యబాబుగారు పిలిచి డేట్స్‌ ఇచ్చి సినిమా చేయమన్నారు. బాల‌య్య హీరోగా నా గురువు దాసరిగారి 150వ సినిమా `ప‌ర‌మ‌వీర చ‌క్ర‌`కు నేనే ప్రొడ్యూసర్‌ని. ఆయన పై లోకాల నుండి నేను బావుండాలని ఆశీర్వదిస్తుంటారు. అలాంటి గురువు దాసరి నారాయణరావుగారికి ఈ సినిమా అంకితం.` పరమవీర చక్ర` తర్వాత గురువుగారితో ఓ సినిమా చేయాలయ్యా అని బాలయ్యగారు అనేవారు. దాసరిగారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా ‘మీరు రాగానే మరోసినిమా చేద్దామ’ని కూడా అన్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ విష‌యానికి వస్తే.. వచ్చినా నాదే..పోయినా నాదే అని ఈ సినిమాను విడుదల చేస్తున్నాను. 12వ తేదీ తర్వాత పెద్ద ఫంక్షన్‌ను ఓపెన్‌ గ్రౌండ్‌లోనే చేస్తాను. ప్లాటినమ్‌ డిస్క్‌లోని 102 కాస్త 203 డెఫనెట్‌గా అవుతుందని భావిస్తున్నాను”అన్నారు.