అందరినీ ఆదుకుంటాం: చంద్రబాబు

AP CM Reviw meeting in Guntur Collectorate
AP CM Reviw meeting in Guntur Collectorate

అందరినీ ఆదుకుంటాం: చంద్రబాబు

గుంటూరు సిటీ: గత4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతమైందని సిఎంచంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం రాత్రి ఆయన సమీక్ష జరిపారు. కలెక్టర్‌రేట్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని గత రెండేళ్లుగా వర్షాభావలేమితో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. జిలా వ్యాప్తంగా 16 నుంచి 28 సెం.మీ వర్షం కురిసిందని 36,497 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని ఆన్నారు. రైతులను అందరినీ ఆదుకునేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సిఎం తెలిపారు. ఇందులో ప్యాడీ 8,400, పత్తి 22,485, సోయాబిన్‌ 46, రెడ్‌గ్రామ్‌ 4,204, మినుములు 477 హెక్టార్లలో నష్టపోయాయమన్నారు. అదేమాదరిగా పండ్లతోటలకు తీవ్రనష్టం జరిగిందని ఫసల్‌ బీమా యోజన కింద రైతులను ఆదుకుంటామని చెప్పారు. జిల్లాలో రైల్వేట్రాక్‌ 11 చోట్ల దెబ్బతిందని ఈనెల 30 నుంచి రైళ్లు ఆయా మార్గాల్లో నడపబడతాయని సిఎం తెలిపారు. రోడ్లు భవనాల శాఖకు 406.45 కిమీ. చొప్పున దెబ్బతినగా, అందులో రూ.120 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పంచాయతీరాజ్‌ రోడ్లు 360 కిమీ మేర దెబ్బతిన్నాయని, 82 రీచ్‌లు దెబ్బతిన్నాయని దీని ద్వారా రూ.79 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ 28 స్కీంలకు నష్టం వాటిల్లిందని, ట్రాన్స్‌కోకు జరిగిన నష్టంలో 82 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందన్నారు. 900 పంపుసెట్లు, ఒక సబ్‌స్టేషన పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు.
ఎన్నడూలేనివిధంగా పులిచింత ప్రాజెక్టులో లక్షక్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కింద ఉందన్నారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించటం వల్ల అపారమైన ప్రాణ ఆస్తినష్టాన్ని అరికట్టగలిగామని,అయినప్పటికీ ఏడుగురు మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియో కింద అందిస్తున్నామని , వివిధ స్వచ్చంధ సంస్థలు, సామాజికసేవా సంస్థలు ఫలక్‌నామా, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉన్న ప్రయాణిలను ఆదుకుని వారికి సేవలు అందించటం అభినందనీయమని అన్నారు. రెస్క్యూఆపరేషన్‌ను సకాలంలో నిర్వహించటం వలన ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు.
నస్టపోయినవారందరికీ శాశ్వత ప్రాతిపదికన సహాయం అందిస్తామని ఇందుకోసం ఆదివారం నుంచి 40 మండలాల్లో 40మంది ఆర్డీఒలను నియమించటమే కాక, 12 మంది ఐఎఎస్‌ అధికారులను సహాయక చర్యలకు పంపుతున్నట్టు సిఎం తెలిపారు.
అన్నివిభాగాల అధిపతులకు బాధ్యతలు అప్పగించటం జరిగిందన్నారు. రానున్న మూడు రోజుల్లో అందరికీ ఉపశమనం కలిగేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. 20 కిలోల బియ్యంతోపాటు , ఒక కిలో కందిపప్పు, పంచదార, కిలో పామాయిల్‌ అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5,200, కచ్చాఇళ్లకు రూ.3,200 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఇళ్లల్లోకి నీరువచ్చి సర్వం కోల్పోయినవారికి రూ.3,800 అందిస్తున్నట్టు తెలిపారు. పాడిపశువులకురూ. 30వేలు, గొర్రెలకు రూ.3000, పందులకు రూ.3000, కోళ్లకు రూ.50 తక్షణసాయంకింద అందిస్తామని అన్నారు. చేపలుపట్టే మత్య్సకార్మికులకు రూ.9,600, పుట్టీలు కోల్పోయినవారికి రూ.6వేలు, వలలు కోల్పోయినవారికి రూ.2,600 చొప్పునసోమవారం సాయంత్రానికి కల్లా చెల్లిస్తామన్నారు. రుణాలు తీసుకున్నవారికి వెసులుబాటు కల్పిస్తామని ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎకరాకు రూ.6వేలు, హెక్టారుకు రూ.10 వేలు చెల్లిస్తామన్నారు. అక్టోబర్‌ ఒకటి వరకు మిరపసాగు చేసుకునే అవకాశం ఉన్నందున ఆ రైతులకు రూ.2,500 చొప్పున సబ్సిడీ ఇస్తామని, ఇతర రైతులకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు.
ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ రహదారులను 15రోజుల్లోగా పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తామన్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, మునిసిపాలిటీలకు తక్షణ సాయం కింద రూ.5కోట్లు కేటాయిస్తామని, శాశ్వత పనులకు రూ.12కోట్లను చెల్లిస్తామన్నారు.
82 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం నిలిచిపోయిందని, వారంలోగా పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంటువ్యాధులు ప్రభలకుండా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని అక్టోబర్‌ 2వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. వైద్యపరంగా అన్నిరకాల మందులను సిద్ధం చేస్తున్నామని సిఎం తెలిపారు.
జిల్లాకు ఎప్పటి నుంచో ప్రధాన మైన సమస్యలు రెండని,,అవి నల్లమల , కొండవీడు వాగుముంపు నష్టాన్ని నివారించేందుకు అన్నిరకాల చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నానానికి కేంద్రప్రభుత్వానికి నష్టం నివేదిక వివరిస్తామని వారిచ్చే సహాయం కోసం ఎదురుచూడకుండా మన వద్ద ఉన్న డబ్బుతో బాధితులను ఆదుకుంటామన్నారు. ఇంతజరిగినప్పటికీ జిల్లా ప్రజలకుశుభవార్త ఏమిటంటే భూగర్భజలాల శాతం 5.16 పెరిగిందని, ఇదంతా తమ ప్రభుత్వం తీసుకున్న పాంపాండ్ల నిర్మాణం, ఈ వర్షాలవ్లే సంభవించిందన్నారు. రాష్ట్రంలోనే గుంటూరుజిల్లా నాల్గవ జిల్లాగా భూగర్భజలాల పెంపులో ఉందన్నారు. బ్రిటీషువారు నిర్మించిన రైలు మార్గాలు ఎక్కడా చెక్కుచెదరలేదని, మనం నిర్మించిన ట్రాక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని దీన్నిబట్టి నేర్చుకోవాల్సింది చాలా ఉందని సిఎం అన్నారు.
నష్టాల్లోఉన్నవారిని ఆదుకోవటం మానవత్వం అని దానికై యంత్రాంగం అప్రమత్తమై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా ఎప్పటికపుడు పరిస్థితులను గమనిస్తూ సూచనలు జారీ చేయటం వల్లే నష్టం తగ్గిందన్నారు. రేపుజిల్లాలో ఆకస్మిక తనిఖీ చేసి అన్ని పరిస్థితులను సమీక్ష చేస్తానని ప్రజల ఈతిబాధలను తగ్గింటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హదూద్‌ తుఫాన్‌ తర్వాత విశాఖ ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని, అక్రమ డ్రెయిన్లపై నిర్మించిన కట్టడాలను తొలగించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, మహిళా చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఆలపాటిరాజా, కొమ్మాలపాటి శ్రీధర్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌, వ్యవసాయ సంచాలకులు మల్లికార్జునరావు, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఉన్నారు.