అంతుబట్టని ట్రంప్‌-పుతిన్‌ భేటీ!

               అంతుబట్టని ట్రంప్‌-పుతిన్‌ భేటీ!

TRUMP, PUTIN
TRUMP, PUTIN

ఉత్తరకొరియా అధ్యక్షునితో స్నేహహస్తం తర్వాత అమెరికా అధ్యక్షుడు తన చిరకాలప్రత్యర్ధి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమగ్రచర్చలకు సిద్ధం అవుతున్నారు.ఇందుకోసం అతిచిన్న దేశం అయిన ఫిన్‌ల్యాండ్‌ రాజధాని హెల్సింకిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో కీలక అంశాలేమిటి? ఉత్తరకొరియా భేటీ తర్వాత ఆకస్మాత్తుగా రష్యా అధ్యక్షునితో భేటీ అయ్యేంతగా ఎదురయిన పరిణామాలేమిటి? ఇందుకు దారితీసిన పరిస్థితులు వాటి పూర్వాపరాలు ఎవ్వరికీ అంతుబట్టకపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మాత్రం అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదు. ఇటీవలే యూరోపియన్‌ కూటమి దేశాలతోపాటు తనకు మిత్రులుగా ఉన్న దేశాలపై కూడా వాణిజ్యసుంకాలపేరిట వసూళ్లకు ఉపక్రమించి పక్కా బిజినెస్‌మ్యాన్‌ అనిపించుకున్న ట్రంప్‌ విదేశాంగ విధానంపై దృష్టిసారించినట్లు ఈపర్యటనలు రుజువుచేస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు అక్కడి క్వీన్‌ ఎలిజబెత్‌ రాణిని కూడా కలిసారు.

బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలపై బ్రిటన్‌ రాణి, ప్రధాని థెరిస్సామేలతో చర్చలుజరిపారు. ఈపరిణామాలు అలా ఉంచితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపడమేమిటన్నదే ప్రపంచదేశాల్లో ఏదేశానికి అంతుబట్టకుండా ఉంది. పుతిన్‌ చర్చల్లో సిరియాలో అంతర్‌కల్లోలం, ఇరాన్‌ అణుడీల్‌, వంటి వాటితోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం, అలాగే బ్రిటన్‌లో గూఢచారిపై విషప్రయోగం వంటి అంశాలే చర్చకు రానున్నాయని చెప్పవచ్చు. సోమవారం ఈచర్చలకు నాందిపలుకుతున్నది. ఇరుదేశాలు ఇప్పటివరకూ ఉప్పునిప్పుగా కొనసాగాయి. అమెరికా పక్క ఉంటే రష్యా మరోపక్క దేశాలకు మద్దతుగా నిలిచి సైనికసాయం అందిస్తూ వచ్చాయి. సిరియాలో అంతర్‌కల్లోలం అంశాలు చర్చకురానున్నాయి. ఇక ఉక్రెయిన్‌పరంగా కూడా రెండుదేశాలమధ్య చర్చకురానున్నాయి. ఉక్రెయిన్‌ తమదేనని రష్యాచెపుతుంటే ఉక్రెయిన్‌ మాత్రం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆకాంక్షిస్తోంది. ఇక ఈ చర్చల్లో భాగంగానే అమెరికా రష్యాపై విధించిన ఆంక్షలు కూడా ప్రస్తావనకు రావచ్చన్నది అంచనా.

గత ఏడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్‌కు ఇష్టంలేకపోయినా కొన్ని ఆంక్షలపై సంతకాలుచేసారు. ట్రంప్‌ అధ్యక్షభవనంలోనికి ప్రవేశించినప్పటినుంచి రెండుదేశాలమధ్య సంబంధాలపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లో బిలియనీర్‌బిజినెస్‌మ్యాన్‌ ఎన్నికకోసం రష్యా ఒత్తిడితెచ్చిందన్నది ప్రధాన ఆరోపణ. వీటిపై అమెరికా నిఘా వర్గాలుసైతం సమగ్ర విచారణజరిపి ట్రంప్‌కు నివేదిక అందించాయి. అయితే వీటిని రష్యా నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే అమెరికా హోం మంత్రి మైక్‌ పాంపియో కూడా పుతిన్‌తో జరిగే సమావేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాప్రమేయం లేదన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తన పాశ్చాత్య మిత్రదేశాలతోపాటు అమెరికా కూడా ఉక్రెయిన్‌పోరాటంలో రష్యా తన సానుకూల వేర్పాటువాదులకు సైనిక మద్దతునిస్తున్నదని అమెరికా ఆరోపిస్తూ వచ్చింది. తూర్పుఉక్రెయిన్‌ప్రాంతంలో రష్యా మద్దతిస్తున్నదన్న అమెరికా విమర్శలను రష్యా తోసిపుచ్చినా ఇప్పటికీ ఈ అంతఃకలహంకొనసాగుతూనే ఉంది.

ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక మారణాయుధాలను ఆయుధసంపత్తిని అందచేస్తోంది. ఉక్రెయిన్‌కు ప్రత్యేక క్షిపణులను సరఫరాచేసే డీల్‌ను అమెరికా ఆమోదించడంపై రష్యాకు ఆగ్రహం కలిగించింది. ఇక ్తౖక్రిమియా,ఉక్రెయిన్‌ దేశాలపరంగా ఎలాంటి నిర్ణయాలుంటాయన్నదే ప్రధాన చర్చనీయాంశంగా నడుస్తోంది. ఇక సిరియాలో అమెరికా మిత్రదేశాల దాడులు 2017 ఏప్రిల్‌నుంచి కొనసాగుతున్నాయి. 2018 ఏప్రిల్‌లో రసాయన దాడులకు స్పందనగా అధ్యక్షుడు బషర్‌ ఆల్‌ అసద్‌ రష్యాతీరుపై ఆగ్రహం వ్యక్తంచేసారు.ఇక నిరాయుధీకరణపై రెండుదేశాలు సైతంఅంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయనిఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. గడచిన మార్చిలోనే రష్యా కొత్తగా గుప్తఆయుధాలు, హైపర్‌షోనిక్‌ జలాంతర్గాములనుసైతం రూపొందించింది. అలాగే అమెరికా కూడా తక్కువ స్థాయి అణు ఆయుధాలను వృద్ధిచేసేదిశగా అడుగులువేస్తోంది. దీనిపై మాస్కోసైతం మండిపడుతోంది. అన్ని దేశాలను అణునిరాయుధీకరణవైపు ఒత్తిడిచేస్తూ తాను స్వయంగా అణ్వాయుధ సామగ్రిని సమకూర్చుకోవడం అమెరికా జగడాలమారిగా తయారవుతోందని ఎండగడుతోంది.

ఈ విధానం రష్యావ్యతిరేక విధానమేనని మండిపడుతోంది. అలాగే నాటోదేశాలపరంగా అమెరికా వ్యూహంపై కూడా రష్యా దృష్టిపెట్టింది. తూర్పుప్రాంత రక్షణ శక్తులతో రష్యాను చుట్టుముట్టేవ్యూహంతో ఉన్నట్లు సందేహిస్తోంది. రొమేనియా, పోలండ్‌ దేశాల్లో నాటో ప్రణాళికలను అనుసరించి యూరోపియన్‌ క్షిపణి కవచాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం నాటోదేశాలు రక్షణరంగంపై ఎక్కువ ఖర్చుచేయాలనిసైతం అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇక ఇరాన్‌ అణు డీల్‌సైతం చర్చలకు రానున్నది. ఇరాన్‌ డీల్‌నుంచి బైటకురావాలని ట్రంప్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని రష్యా భావిస్తోంది. సుదీర్ఘకాలంపాటు జరిగినచర్చల తర్వాత అమెరికా ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించింది. దీనితో రష్యాకు ఎటూతోచనిస్థితి ఎదురయింది.

అలాగే రష్యా మాజీ గూఢచారిపై బ్రిటన్‌లో విషప్రయోగం చేసారన్న ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను అనేక దేశాలు బహిష్కరించాయి. దేశం వీడి వెళ్లాలని ఆదేశించాయి. ప్రస్తుత చర్చల్లో ఇదొక కీలక అంశంగా రావచ్చన్నది అంచనా. అలాగే అమెరికానుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై రష్యా ఈనెల్లోనే సుంకాలను పెంచింది. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధించిన సుంకాలకు ధీటుగా రష్యా సుంకాలను పెంచింది. ఇదంతా గ్లోబల్‌ ట్రేడ్‌వార్‌లో భాగమే అయినా ఇరుదేశాల అధ్యక్షుల భేటీ ఇపుడు ప్రపంచ దేశాల్లో మరో చర్చనీయాంశంగా మారింది.
– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌