ప్రకృతి పరంగా ఏర్పడే సుందర దృశ్యాలు మన చుట్టూనే తారసపడ్తుంటాయి.ఎటొచ్చీ మనమా దృక్పథంతో వాటిని పరిశీలించము అంతే.చిత్రాలలో అందమైన దృశ్యాలను చూచి ఎంత చక్కగా చిత్రీకరించినారో అని మురిసిపోవడమే కాని అవి సహజత్వానికి ఎంత దూరమో మనం గమనించటం లేదు. అనుదినం పరిసరాలలో గోచ రించే దృశ్యాలను మనము జారవిడుచుకుంటూ న్నామోమో. అలాకాక వాటిని కనులారా కాంచి ఆస్వాదిస్తే ఆహ్లాదాన్ని అందిస్తుందనుటలో సందేహం లేదు.గగనతలంలో నిత్యం జరిగే సూర్యోదయ ప్రక్రియ మనకందరకూ విదితమే. కానీ ఎంతమంది ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారు. ఆ ఓషఃకాంతి, సువర్ణ రంగులో ఉన్నా బాలభానుని కిరణాలు ఆ వాతా వరణం వర్ణనాతీతం.
సందె వేళలోని సంధ్యా కాంతులు, అమావాస్య నిశిలో, వినీలాకాశంలో తళతళ మెరిసే తారకలు, సున్నితంగా దర్శనమిచ్చే నెలవంక, పున్నమి జాబిలి, పుచ్చపువ్వులాంటి వెన్నెల, వర్షాకాలంలో అలరారే అరుదైన, వింతైన ఇంద్రచాపము ఇలా ఎన్నో, ఎన్నెన్నో గగనవీధిలో మనకు ద్యోతకమవుతుంటాయి. అరవిచ్చిన అనేకరకాల పుష్పాలు ఎంత మనో హరమో, ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయా అన్నట్లు ఏపుగా పెరిగిన వృక్షాలు, వసంతకాలంలో నిండా పూలను సింగారించుకొని ఉంటే ఎంత కమ నీయమో.
మామిడి చిగుళ్లు తిని మత్తుగా తీయగా ఆలపించే కోయిలగానం ప్రాతఃకాలంలో పక్షులు చేసే కలకలరావాలు, సాయం సమయమున సమూ హాలుగా ఆకాశవీధిలో సాగే పక్షులు, సెలయేళ్లు, పచ్చికబయళ్లు ఎంత ఆకర్షణీయమో. ఆరుబయట, డాబా మీద వీచే చల్లని, పిల్ల తెమ్మెరలు అవి మోసుకుని వచ్చే పారిజాత పరిమళాలు, వేసవిలలో విరబూచిన మల్లెల సౌరభాలు. ఎంత హాయిని చేకూర్చుతాయో. ఇలా ఎన్నో పరిసరాలలోని సౌందర్య మూలికలు.పచ్చని మొక్కలు, పూలమొక్కలు ఇంట్లో ఉంటే అదో అందం. వీలుకానపుడు కనీసం కుండీ లలోనైనా పెట్టుకుని ఆ లోటు తీర్చుకోవచ్చు. అలాగే ఇంటి బయట ప్రహరీగోడ వద్ద కూడా చెట్లను పెంచితే ఎంతో అలంకారం.
పోటీ ప్రపం చంలో పరుగులెత్తే ఆబాలగోపాలము ఒత్తిడికి, అలసటకు లోనవుతున్నారు. శ్రమలేకుండ, ఖర్చు లేకుండ పరిసరాలలోనే లభించే సుందర దృశ్యాలను వీక్షించి కాస్త సేదతీరటం ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలకి కూడ బాల్యం నుండే ప్రకృతిని ప్రేమించడం, పరిసరాలను పరికించి ఆనందాన్ని పొందడం అలవాటుచేస్తే అది వాళ్ల మనోల్లాసానికి దోహదమవుతుంది. సౌందర్యానికి నిలయమైన ప్రకృతిలో నిబిడీకృతమై ఉన్న అతీత, అదృశ్య శక్తి అదే దివ్యశక్తి మన మనోనేత్రానికి మెదిలి ఆరాధనాభావం నెలకొల్పుతుంది.