గర్జించిన విద్యార్థి లోకం ఇది తెలంగాణ సాధన సంవత్సరం పరీక్షలు ఉండవు ఇక పోరాటాలే కిక్కిరిసిపోయిన ఒయు ప్రాంగణం 5నుంచి యుద్ధమే తెలంగాణ ప్రక్రియ మొదలైనా పోరాటాలు ఆగవు వినిపించిన ప్రజల గుండెచప్పుడు ఎవరి ధనబలం, ఎవరి కండబలం మా ఉద్యమాలను ఆపలేవ్ఞ: కోదండరామ్ హైదరాబాద్,జనవరి3 ప్రభాతవార్త,సిటీబ్యూరో: ఈనెల 5న కేంద్రప్రభుత్వ హోంశాఖ సమావేశానికి ముందే రాజ కీయ పక్షాల నేతలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్ల డించాలని రాజకీయ జెఏసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేసారు. మోసం చేస్తే హైదరాబాద్‌లో గాంధీభ వన్, ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ మిగలవని ఓయు విద్యార్థి జెఏసి నేతలు హెచ్చరించారు. 2010 తెలంగాణ సాధన సంవత్సరమని విద్యార్థులకు పరీక్షలు ఉండవని ఇక పోరా టాలేనని అన్నారు. తెలంగాణకు మోసం చేస్తే సోనియా కొడుకు రాహుల్ భారత ప్రధాన మంత్రి కాడని తెలంగాణ వాదులు అడుడకుంటారని అన్నారు.
ఆదివారం ఆర్ట్స్ కళాశాల ప్రాంగంణంలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వారు ప్రసంగించారు. అమరుల త్యాగాల ముందు రాజకీ యపార్టీల నేతలు పదవులు తృణప్రాయమని వారు తాము ఎటువైపో తేల్చుకోవాలని తెలంగాణలోని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఓయు జెఏసి అల్టిమేటం జారీ చేసిం ది..ఓయు విద్యార్థి సంఘాల సంయుక్త కార్యచరణ కమిటీ నిర్వహించిన విద్యార్థి గర్జనతో ఓయులోని మూల మూల విద్యార్థులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, తెలం గాణ ఉద్యమాభినులు అంచనాలకు మించి తరలివచ్చారు
ఎటువైపో తేల్చుకోండి: ప్రొఫెసర్ కోదండరాం 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రగల తెలం గాణ ఉద్యమంలో ఓయు విద్యార్థులు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ఆత్మఘోషను వినిపిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా సాగుతున్న విద్యా ర్థుల ఉద్యమానికి అడ్డంకులు కల్పిస్తున్నది ఎవరో అందరికి తెలుసని రోశయ్య, లగడపాటి రాజగోపాల్ చర్యలవల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తాము ఎటు వైపు ఉన్నామో తేల్చుకోవాలని హెచ్చరిం చారు.ప్రజల ఆకాంక్షల వైపు ఉన్నాయా?పెట్టుబడిదారుల కాసులకు అమ్ముడుపోతాయా తేల్చుకోవలన్నారు.
తెలం గాణ ఉద్యమంలో రాజకీయపక్షాల పాత్ర ఒకటవుతే విద్యా ర్థులు కొనసాగిస్తున్న ఉద్యమాలు మరొక ఎత్తని పోలీసులు ఎంత కవ్వించి రెచ్చగొట్టినా ముఖ్యమంత్రి రోశయ్య సిగ్గుపడేలా శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నా రు.లగడపాటి ధనబలం, జగన్ కండబలం తెలంగాణ ఉద్యమాలను అడ్డుకోలేవని విద్యార్థుల ఉద్యమానికి తలవంచే కేంద్ర ప్రభుత్వం ఓయు ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ ప్రకటనచేసే పరిస్థితి వస్తుందన్నారు.
ఓయు జెఏసి నేత పిడమర్తి రవి మాట్లాడుతూ 34 రోజులుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని కెసిఆర్ దీక్షను భగ్నంచేస్తే ఓయు విద్యార్థులం దీక్షలను ప్రారం భించి ఉద్యమాన్నీ చేపట్టామన్నారు. తమపై కేసులు పెట్టి జైళ్ళలో వేసిన,లాఠీచార్జిలు చేసినా,రబ్బర్ బులెట్లు కురి పించినా దీక్షలను కొనసాగించామే తప్ప కేసులను ఎత్తివే యమని అడుక్కోలేదన్నారు. 5న ఢిల్లీ సమావేశంలో తెలం గాణకు వ్యతిరేకంగా మాట్లాడితే నేతలు శంషాబాద్ విమానాశ్రయంలో కాలుకూడ మోపలేరని హెచ్చరిం చారు.సమావేశానికి ముందే పార్టీలు తమ అభిప్రాయాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయు డు, రామోజీరావు, జయప్రకాశ్ నారాయణ్ డ్రామాలు కట్టిపెట్టకపోతే హైదరాబాద్‌లో ఉండలేరని హెచ్చరించా రు.
50 సంవత్సరాల తెలంగాణ పోరాటాలు, ఉద్య మాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కోరారు. జనవరి 5న తెలంగాణపై ప్రకటన వెలువడకపోతే సంక్రాతికి ఆంధ్రాకు వెళ్ళేవారు తిరిగి రావాల్సిన అవసరం ఉండదన్నారు.తమ బాధలు,కష్టాలు ఢిల్లీలో చెప్పాలని నేతలను కోరారు. పార్లమెంట్ శీతకాల సమావేశాలలో తాము ఛలో పార్లమెంట్ నిర్వహిస్తామని అన్నారు. ఈనెల 5న జాతీయ రహదారుల దిగ్బందం, రైల్ రోకో నిర్వహించాలని పిలుపు నిచ్చారు. సీమాంధ్ర ప్రాంతాలనుంచి ఒక్క వాహనాన్నీ తెలంగాణ ప్రాంతంలోకి రానివ్వమని అన్నారు. జనవరి 5వ తేదీన ఒక రకంగా యుద్దానికి సిద్దమవుతున్నామని హెచ్చరించారు.తెలంగాణ ప్రజలు రాజకీయనేతలు విశ్వ సించడం లేదని, అందుకే తాము తెలంగాణ ప్రాంతంలోని పల్లెపల్లెలో తెలంగాణ వాదాన్నీ వినిపిస్తామన్నారు. కెసిఆర్ దీక్ష విరమిస్తే తాము ముందుకొచ్చామని, నాగం జనార్దన్ రెడ్డి సీమాంధ్ర ప్రతినిధి చంద్రబాబు నాయుడుని నాయకు డని పొగిడితే ఎత్తికుదేసామని గుర్తుచేసారు.పిడిఎస్‌యు రాష్ట్ర అద్యక్షుడు అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీ య పార్టీల నిజస్వరూపం బయటపడు తోందని అన్నారు.
5న కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తెలంగా ణలో ఎవరిని తిరగనీయమని హెచ్చరించారు. విద్యార్ధి జెఏసి నేత శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాద నకై విద్యార్థులు నిర్వహిస్తున్న ఉద్యమం రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తున్నామని, సంఘీభావం ప్రకటిస్తున్న వారిని కలుపుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పటు అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వ మెడలు వంచైనా తెలంగాణ సాధించుకుంటామని అన్నారు. ఈ ఉద్యమాలను అడ్డు కుంటే జైళ్ళలో ఉద్యమాలు, దీక్షలు చేపట్టడానికి వెను కాడేది లేదని అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంత ర్బాగమని దీన్ని ఎవరు విడదీయలేరని అన్నారు.
తెలంగాణ పోరాటయోధుడు, స్వాతంత్య్ర సమరయోధు డు కొండా లక్ష్మణ్ బాపూజీ మాట్లాడుతూ తరతరాల తెలంగాణ వెనుకబాటు తనానికి ఇకనైనా చరమగీతం పాడాలని కోరారు. కుట్రలు,కుతంత్రాల మూలంగా తెలం గాణ మనకు దూరమైందని దాన్ని విద్యార్థులు గుర్తుంచు కోవాలన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ పోరాటాల ద్వారనే తెలంగాణ సాధించుకోగలమని ఇది నాలుగుకోట్ల ప్రజల సుదీర్ఘ కోరిక అన్నారు. విద్యార్థుల పోరాటాలు,త్యాగాలు వెలకట్టలేనివని లక్షసాధన దిశగా పోరు సాగించాలని పిలుపునిచ్చారు.
విరసం నాయకుడు వరవరరావు మాట్లాడుతూ ప్రజా పోరాటాల ద్వార తెలంగాణ సాధ్యమన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత అల్లం నారాయణ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల అగ్గిపుల్లగా మారి మోదుగుపూల రంగైందని తెలంగాణ సమక్క, సారక్క జాతరలు జరుపుకుందా మన్నారు. న్యాయవాదుల జెఏసి కన్వీనర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా తాము వారి పక్షాన పోరాడుతామని తెలం గాణ సాధన తమ అంతిమ లక్ష్యమన్నారు.ప్రొఫెసర్ కాసీం, రసమయి బాలకిషన్, విమల తదితరులు మాట్లా డారు. జాతీయ చానళ్ళ ద్వారా తెలంగాణ ఉద్యమనాదం, విద్యార్థి గర్జన సారాంశాన్నీ జెఏసి నాయకుడు కుమార స్వామి ఇంగ్లీష్ చదివి వినిపించారు. విద్యార్థి జెఏసి తీర్మానాలను జాతీయ మీడియాకు వివరించారు.
విద్యార్థి జెఏసి తీర్మానాలు విద్యార్థి గర్జనలో ఓయు విద్యార్థి జెఏసి నేతలు తెలం గాణ జిల్లాలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి జెఏసి నేతలతో కలిసి తీర్మానాలను ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుం బాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం, అక్రమంగా బనాయించిన కేసుల ఎత్తివేత, 5నాటి సమావే శానికి ముందే రాజకీయ పక్షాల అబిప్రాయాల స్పష్టీకరణ, 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విధి విధా నాలపై విస్పష్టమైన ప్రకటనే చేయాలని తీర్మానించారు. అప్పటివరకు ఉద్యమాన్నీ కొనసాగిస్తామన్నారు.