న్యూఢిల్లీ జనవరి 3:- అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తట్టుకోవడానికి భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు 2010 సంవత్సరంలో కూడా కొనసాగాలని కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్నాయి. అయితే సాధ్యం కాదని 2010-11 కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశాలు ఉన్నాయని ఈ కార్పొరేట్ సంస్థలకు బాగా తెలుసు. ఉద్దీపన ప్యాకేజీ వల్ల ఆటోమొబైల్ పరిశ్రమ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌రంగం, రీటైల్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాలు బాగా లబ్దిపొందాయి. తమ ఉత్పత్తులకు గిరాకీ కొనసాగాలంటే ఉద్దీపన ప్యాకేజీ కొనసాగాలని అవి కోరుతున్నాయి.
వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని కమోడిటీ ధరలు కూడా పెరగకుండా స్థిరంగా ఉండాలని, ఉద్దీపన ప్యాకేజీ కొనసాగాలని తాము కోరుతున్నట్లు సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అధ్యక్షుడు పవన్‌గోయంక చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా పురోభివృద్ధిపథంలో నడవాలంటే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపన కలిగించింది. తగ్గించిన ఎక్సైజ్ సుంకాన్ని మళ్ళీ పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసు.ఎక్సైజ్ సుంకం పెంచితే తమ అమ్మకాలు తగ్గుతాయని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా సేల్స్ హెడ్ అమితాబ్ తివారీ అంటున్నారు.భారతీయ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సెన్‌వ్యాట్‌ను నాలుగు శాతం తగ్గించింది.
ఎఫ్‌ఎమ్‌సిజి అమ్మకాలు ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయని మొత్తం కన్జ్యూమర్ మార్కెట్లో గ్రామీణ ప్రాంతాలు కూడా భాగం కావాలంటే సుంకాలు తక్కువగా ఉండాలని పారిశ్రామికులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వస్తువులకు, సర్వీసులకు గిరాకీ పెరుగుతుందని డాబర్ ఇండియా లిమిటెడ్ సిఇఓ సునీల్ దుగ్గల్ అంటున్నారు. వ్యవస్థీకృత రీటైలింగ్ 2010లో ప్రభుత్వం తనను పరిశ్రమగా గుర్తిస్తుందన్న విశ్వాసంతో ఉంది. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉన్నదని, కౌటన్ రీటైల్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ దల్వేర్‌సింగ్ అహ్లువాలియా అంటున్నారు.
వినియోగదారుల చేతిలో నగదు ఎక్కువగా ఉండేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఆ విధంగా అమ్మకాలు పెరుగుతాయని దల్వేర్‌సింగ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సూచనలు కన్పిస్తున్నాయని, అయినా కంపెనీలు మార్కెట్లోకి విస్తరించాలంటే ఇంకా కొన్ని ప్రోత్సాహకాలు కావాలని పారిశ్రామి కులు అంటున్నారు. దేశంలో ఫార్మస్యూటికల్ పరిశ్రమ 2009లో లక్ష కోట్ల రూపాయల పరిశ్రమగా రూపొందనున్నది. ఫార్మ స్యూటికల్ రంగంలో జరుగుతున్న పరిశోధనకు నిధులు అవసరం ఎక్కువగా ఉన్నదని, ఈ నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని ఇండియన్ ఫార్మ ఎలయన్స్ జనరల్ సెక్రటరీ డిజి షా పేర్కొన్నారు.