'నన్ను ఎత్తుకోవా' అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు చాచింది ఓ చిన్నారిపాప. ఆమె కళ్లలో తనకోసమే ఒకరొచ్చారన్న సంతోషం. ముద్దుగా తనను ఎత్తుకుని, ముద్దిమ్మని అడగాలనే ఆశ. ఆ పాప పేరు సంధ్య. కంటిపాపలా చూసుకునే తల్లి మరణించింది. తోడుండి పెంచాల్సిన తండ్రి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. బంధువులున్నా ఆత్మబంధువులు లేని ఈ పాపను ఇక్కడకు తెచ్చారు. కళ్లుచెమర్చే బాధ ఇదని ఆ చిన్ని గుండెకు తెలియదు. హాయిగా ఆడుకోవడం, స్కూలుకెళ్లి రావడం ఇవే తెలుసు. ఏడోతరగతి చదివే దీక్ష ఇక్కడకి చేరి నాలుగేళ్లయ్యింది. జైల్లో ఉన్న తండ్రిని చూసేందుకు ఒకసారి వెళ్లింది. తన చేతులు పట్టుకుని క్షమించమని తండ్రి కోరినప్పుడు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కన్నీటితోనే బదులిచ్చానంది. ఇలా ఇంకెందరో. కోటమ్మ, కవిత, శిరీష, అనూష, లావణ్య అందరి వెనుకా ఒకటే కథ. చెప్పుకోలేని వ్యధ. కంచెలా కాపుకాయాల్సిన వయసులో పిల్లలకు దూరంగా జైల్లో మగ్గిపోతూ, చేసిన పనులకు కుమిలిపోతూ బతుకీడుస్తున్న ఖైదీల పిల్లలు వీరంతా. వీరందరికీ చేయూతనిచ్చి, చదువు, సంస్కారాలను అందించి, భవిష్యత్తులో తమ కాళ్లమీద నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో నడుస్తోంది 'సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఫర్ చిల్డ్రన్.
క్షణికావేశంలోనో, పగతోనో మరేవో కారణాలవల్ల జైల్లో ఉన్న ఖైదీల మనోభావాలు ఎలా ఉంటాయి? చేసిన పనులకు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారా? బయటకి వచ్చాక ఎలా బ్రతకాలో అని భయపడుతుంటారా? వీటన్ని టికంటే ముందు తమ కుటుంబం, పిల్లలు ఎలా ఉన్నారో, ఏంచేస్తున్నారో అని మదనపడుతుంటా రని చెప్పారు వారిని స్వయంగా కలిసిన సిస్టర్ రోజీ. డిగ్రీ చదివి 1992లో నన్‌గా మారిన రోజీ సిస్టర్స్‌ఆఫ్ ఛారిటీస్ సంస్థ సేవల్లో భాగంగా మూసీ చుట్టూ ఉన్న మురికివాడల్లో ప్రజల జీవనస్థాయిని మెరుగుపరిచేందుకు ప్రయ త్నించారు. వైద్య సదుపాయాలందించడం, ఆ ప్రాంతంలోని పిల్లల కోసం ప్రత్యేకమైన స్కూలు నడపడం, మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం వంటివి చేసారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా జైల్లోని ఖైదీలను కలిసి వారి సమస్యలను తెలు సుకోవాలనుకున్నారు. అలా వెళ్లినప్పుడు ఖైదీల గుండెల్లో వ్యధేమిటోఅర్థమయ్యిందంటారు రోజీ.
'మా పిల్లలు ఏమైపోయారో, ఎలా బతుకు తున్నారో, వాళ్లని చూసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామంటూ వారు ఏడుస్తుంటే చూడలేక, వీరి పిల్లలికోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. ఖైదీల ఆవేదనంతా వారి పిల్లల భవిష్యత్తు గురించే కనుక వారి పిల్లలకి సహాయం చేస్తే జైల్లో ఉన్నా ఎంతో భరోసాతో ఉంటారనిపించిది. జైల్లో వాళ్లి చ్చిన అడ్రస్‌లు తీసుకుని వాళ్లిళ్లకు వెళ్లాను. అందరూ నిరుపేద కుటుంబాల వారే. సంపాదించి ఇల్లు గడిపే ఆధారం లేక పిల్లలను పోషించలేక కష్టాలు పడుతున్న ఆ కుటుంబాలను చూస్తే కడుపు తరుక్కుపోయింది. మీ పిల్లలను చూసు కుంటామని చెప్పినప్పుడు వాళ్లెంతో కంగారు పడ్డారు. అసలే కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు, కేసులు గొడవలతో భయపడుతున్న వారికి నా మాటలు భయాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదు. మా పిల్లలను తీసుకెళ్లి అమ్మేస్తారా? అని కూడా అడి గారు నన్ను.
అందర్నీ క్రిస్టియన్స్‌గా మార్చే స్తారేమో అనే సందేహాలు వెలిబుచ్చారు. ఏదైనా సరే వారికి నాపై నమ్మకం కలిగేలా చేసుకోవడానికి ఒక సంవత్సరం సమయం పట్టింది. 2005లో విక్రమ్‌పురిలో ఓ అద్దె ఇంట్లో ఆరుగురు పిల్లలతో ప్రారంభం అయ్యింది మా సంస్థ. ఇవాళ 40మంది పిల్లలు ఎల్‌కెజి నుంచీ పదోతరగతి వరకూ చదువు కుంటున్నారు. అమ్మా, నాన్న లేని లోటు వారికి తెలియకుండా చూసుకోవడానికి మా ముగ్గురు సిస్టర్స్ సాయశక్తులా ప్రయత్నిస్తుంటాం. మా పిల్లలంతా స్కూల్లో టాపర్స్. నాకు మొదటిసారి ఓ దాత ఇచ్చిన మొత్తాన్ని నేను మదర్ థెరిస్సా పుస్తకంలో ఉంచి ప్రార్థన చేసాను. ఆమె నిస్వార్థంగా, నిగర్విగా ప్రపంచానికి ఎలా సహాయం చేసిందో అదే బాటలో నడుస్తున్న నాకూ అంతటి శక్తిని ఇవ్వమని, అహంకారాన్ని, స్వార్థాన్నీ దరిచేరనీకుండా చూడమని వేడుకున్నాను. మా అదృష్టం ఈ రోజు వరకూ మా సంస్థకు ఎలాంటి ఒడిదుడుకులూ ఎదురు కాలేదు. సిస్టర్ రోజీ
నాలుగేళ్ల జోత్స్న, ఆరేళ్ల హేమలతా అక్కాచెల్లెళ్లు. జోత్స్న అల్లరిపిడుగైతే, హేమలత కుదురైన కుందనపు బొమ్మ. వీళ్లది విశాఖపట్నం. తండ్రి జైల్లో ఉంటాడన్న సంగతి కూడా పిల్లలకు తెలియదు. కాని జోత్స్న చేతికి కాగితం, పెన్ను ఇస్తే ముందు వాళ్ల నాన్న పేరే రాసి చూపిస్తుంది. ఇళ్లలో పనిచేసుకునే తల్లికి ఇద్దరు ఆడపిల్లల్ని పోషించే శక్తి లేదు. ఎవరో ఈ సంస్థ గురించి చెప్పడంతో వీళ్లని ఇక్కడ చేర్చివెళ్లింది. అప్పు డప్పుడూ వచ్చి చూసిపోతుంటుంది. ఎంతో ముచ్చ టగా పిల్లలిద్దరూ చదువుకుంటుంటే చూసి మురిసిపోతుంది. ఐదేళ్ల సమీర, అమీరలు కవలలు. ఊరు కరీంనగర్. తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోగా తల్లి వీరిని ఇక్కడ వదిలి వెళ్లింది. ఇద్దరూ యుకేజి చదువు తున్నారు. ఎప్పుడూ అమ్మ కావాలని అడగరు. స్కూలు అస్సలు డుమ్మా కొట్టరు. ఇద్దరికీ రోజీ మిస్ అంటే ప్రాణం.
మహబూబ్‌నగర్‌కి చెందిన మమత ఈ సంవ త్సరమే ఇక్కడికి వచ్చింది. తండ్రి మరణించాడు. కూలి చేసుకునే తల్లి 'నాకన్నా వీళ్లునిన్ను బాగా చూసుకుంటారు వెళ్లమని పంపింది. బాగా చదు వుకుని, ఉద్యోగం సంపాదించి అమ్మను బాగా చూసుకోవాలనుంది అంటుంది మమత. అంతే కాదు మూడో తరగతి చదివే అర్చనను తనతో తీసుకెళ్లి చూసుకుంటుందట. అర్చన చదువ్ఞకుని టీచర్ అవ్ఞతానంది.
ఇక్కడున్న చాలామంది పిల్లలకు తల్లి లేదా తండ్రి లేక ఇతర బంధువులు అప్పుడప్పుడూ కలి సేందుకు ఊరికి వెళ్లివస్తుంటారు. ఒక్కోసారి వాళ్లే వచ్చి చూసిపోతుంటారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, విశాఖపట్నం, రంగారెడ్డి జిల్లాలనుంచి వచ్చిన వీరంతా ఒకే కుటుంబంలా ఉండటం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. మంచి అలవాట్లు, చక్కని సంస్కారం, వికసిస్తున్న విద్య ఈ పిల్లల ఆభరణాలు. వీళ్ల పుట్టినరోజులే కాకుండా, స్థానికుల పిల్లలు కూడా వీరితో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఇక్కడే అందరి మధ్య జరుపుకుంటుంటారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు అందిస్తున్న సహకారంతోపాటు వీరి ఆత్మవిశ్వాసం కొండంత బలంగా వీరికి తోడుంది.
1832లో బర్తలోమియా అనే క్రైస్తవ సన్యాసిని 'సిస్టర్స్ ఆఫ్ ఛారిటీస్‌ను స్థాపించారు. ఆమెతో కలిసిన మరికొందరు ఈ సంస్థ సేవలను దేశ వ్యాప్తం చేసేందుకు సహాయపడ్డారు. ఆవిడ తన 36వ ఏటే మరణించగా, మిగిలిన వారు సంస్థను ఆమె అడుగుజాడల్లో నడిపేందుకు కృషి చేస్తు న్నారు.