Home » వాణిజ్యం » జీతాలు తగ్గిస్తున్న ఐటి కంపెనీలు
జీతాలు తగ్గిస్తున్న ఐటి కంపెనీలు
గురు వారం, నవంబర్ 05, 2009 , 12:04 [IST]
ముంబయి నవంబర్ 4:- ఇండియాలో ప్రస్తుతం దాదాపు ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇన్ఫోసిస్, టిసిఎస్,విప్రో లాంటి కంపెనీల్లో పనిచేయడానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే వీరికి సంవత్సరంలో వచ్చే ఆదాయం క్రమంగా తగ్గుకుంటూ వచ్చి ప్రస్తుతం 1.7 లక్షలకు చేరుకున్నది. రెండు సంవత్సరాల క్రితం ఇది 3.5 లక్షల దగ్గర ఉండేది. ఏటా తయారవుతున్న మూడు లక్షల మంది ఇంజనీరింగ్‌లలో దాదాపు సగం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు తమ వద్ద ఉన్న సిబ్బందిని బెంచ్ మీద వృధాగా కూర్చోబెట్టడం మీద పునరాలోచనలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడటం వల్ల చాలా మంది నైపుణ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ సిబ్బంది నిరుద్యోగులుగా మారారు.
దానితో కంపెనీలు ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీత భత్యాలను బాగా తగ్గించివేసాయి. వీరి జీతభత్యాలు దాదాపు 20 శాతం తగ్గినట్లు అంచనా. రెండు సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలు 10 నుంచి 16 శాతం తగ్గినట్లు స్టాంటన్ చేజ్ ఇంటర్‌నేషనల్ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. రెండుసంవత్సరాల క్రితం వరకు ఇంజనీరింగ్ కళాశాల్లో తయారీ అయిన ప్రతి విద్యార్థికి అవుట్ సోర్సింగ్ పరిశ్రమలో ఉపాధి లభించేది.అయితే అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గిపోవడంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను తగ్గించి వేసాయి. గత సంవత్సరం కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ రిక్రూట్‌మెంట్ చేసుకోలేదని తెలుస్తున్నది. వీరికి త్వరలో రిక్రూట్‌మెంట్ కాల్ వెళ్లుతుందని కంపెనీలు చెబుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎంట్రీ లెవల్‌లో సిబ్బందికి సంవత్సరానికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల జీతం ఉండేది. ఇప్పుడు అది రూ. 1.75 లక్షల నుంచి రూ. 3.5 లక్షల మధ్యకు చేరుకున్నాయి.
చాలా కంపెనీలు ఇప్పుడు క్యాంపెస్ రిక్రూట్‌మెంట్ల కోసం కళాశాలలకు వెళ్లడం లేదు. అందువల్లనే విద్యార్థులే ప్లేస్‌మెంట్ల కోసం కంపెనీల వద్దకు వెళ్ళాల్సి వస్తున్నది. నిరుద్యోగులుగా ఉండేకంటే ఎంతోకొంత జీతంతో పనిచేయడం మేలు అని విద్యార్థులు భావిస్తున్నారు. గతంలో కంపెనీలు పెద్ద పెద్ద ఆర్డర్లు హఠాత్తుగా వస్తే ఇబ్బంది పడకుండా ఉండేందుకు బెంచ్‌మీద కొందరిని పోషిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజా గ్రాడ్యుయేట్లకు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల నుంచి ఆఫర్లు ఉండేవి. సాధారణ సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు 3.5 నుంచి ఐదు లక్షల వరకు జీతాల ఆఫర్లు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి 1.7 లక్షల నుంచి 3.5 లక్షలకు దిగజారింది.
కంపెనీలు కూడా చౌకగా వస్తున్న సిబ్బందిని వినియోగించుకొని తమ పనులు చేయించుకుంటున్నాయి. గత కొద్ది నెలలుగా ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి కంపెనీలు ఎంట్రీ లెవల్ జీతాలు ఇస్తున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అనుభవం ఉన్న సిబ్బందిని రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. వారు ఇప్పటికే శిక్షణ పొంది ఉండటం, కష్టనష్టాలు రుచిచూచి ఉండటం వల్ల ఇటువంటి వారు బాధ్యతతో పనిచేస్తారన్న అభిప్రాయం పెద్ద పెద్ద కంపెనీలకు ఉన్నది. 2010 జనవరి నెలలో టిసిఎస్ మళ్ళీ క్యాంపస్ ఇంటర్‌వ్యూలు ప్రారంభించనున్నది. 2008-09 సంవత్సరానికి ఇచ్చిన 24వేల ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవించనున్నది.