న్యూఢిల్లీ నవంబర్ 4:- చెరకు రైతుల ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ప్రభావం చూపకపోయి నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం అనేక ప్రకంపనలు సృష్టిస్తున్నది. హర్యానా ప్రభుత్వం చెరకు రైతుల ఉద్యమాలకు భయపడి రాష్ట్ర సలహాధరను 2009-10 క్రషింగ్ సీజన్‌కు రూ.185లుగా నిర్ణయించింది. మొదట్లో క్రషింగ్‌కు వచ్చే చెరకు రకాలకు ఈ ధర వర్తిస్తుంది. కొంత కాలం తర్వాత క్రషింగ్‌కు వచ్చే చెరకుకు రూ. 180 నిర్ణయించారు.
ఆలస్యంగా క్రషింగ్ వచ్చే చెరకుకు రూ. 175గా ధర నిర్ణయించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వన్నంత ధరను క్వింటాలుకు చెరకు రైతులకు హర్యానా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వం కూడా రూ. 200 ధరను నిర్ణయించవచ్చునన్న వార్తలు వస్తున్నాయి. చట్టబద్ధ కనీస ధరను నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో 'సరసమైన గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి) అంటూ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ఈఎఫ్‌ఆర్‌పి ధరను క్వింటాలుకు రూ. 129.50 వద్ద నిర్ణయించవచ్చునని తెలుస్తున్నది. గతంలో ఎస్‌ఎమ్‌పి కంటే ఎస్‌ఎపి ఎక్కువగా ఉన్నప్పటికీ రెండు ధరల మధ్య తేడాను చక్కెర మిల్లులు భరించేవి. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎఫ్‌ఆర్‌ఫి ప్రతిపాదన వల్ల ఎఫ్‌ఆర్‌పి కంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌ఎపిని అధికంగా నిర్ణయిస్తే ఈ రెండింటి మధ్య తేడాను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు సంతృప్తికరంగా లేనందున రాష్ట్రాలు ఎస్‌ఎపిని ఎక్కువగా లేకుండా చూసుకుంటాయన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌పి అనే కొత్త ప్రతిపాదనతో రావడాన్ని చెరకు రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాదిన ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమ ప్రభావం ఇప్పటికే హర్యానా ప్రభుత్వం మీద పడింది. 2010-11 సంవత్సరంలో చెరకు సలహాధర క్వింటాలుకు రూ.200 నుంచి రూ.210 వరకు ఉంటుందని హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ధరను ముందుగానే ప్రకటించడం వల్ల వచ్చే సంవత్సరం రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన అన్నారు. హర్యానాలో నవంబరు 25 నుంచి క్రషింగ్ సీజన్ ప్రారంభం కానున్నది. యుపిలో ఆందోళన ఇది ఇలావుండగా ఉత్తరప్రదేశ్ రైతులు ముడి చక్కెర దిగుమతిపై తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వీరు శాంత్రిభద్రతల పరిస్థితిని సృష్టిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో దిగుమతి చేసిన చక్కెర పంపిణీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రైల్వే వేగన్ల నుంచి ముడిచక్కెరను దిగుమతి చేయకుండా నిలిపి ఉంచారు. ఉత్తరప్రదేశ్ చెరకు కమిషనర్ మీరట్ చెరకుని రైతులతో, మిల్లు యజమానులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి చూస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న రైతులు శనివారం నాడు బజాజ్ హిందుస్తాన్‌కు చెందిన తానాభవన్ షుగర్ మిల్లు అవసరాల కోసం బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను రవాణా చేస్తున్న గూడ్స్ రైలును నిలిపివేసారు.
కొందరు రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చెరకు తోటలను తగలబెడుతున్నారు. చెరకు రైతుల ఉద్యమం తీవ్రతరం చేయడానికి రాష్ట్రీయాలోక్‌దత్ నవంబరు ఐదో తేదీన మహాపంచాయిత్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుముకోకుండా ముడి చక్కెర సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసింది. చెరకు కమిషనర్ మహా పంచాయత్ ముగిసే వరకు మీరట్‌లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. చర్చల ద్వారా చెరకు రైతులు, మిల్లు యజమానుల డిమాండ్లలో మధ్యమార్గాన్ని కనుగొనాలని ఆయనకు ప్రభుత్వం సూచించింది. ఇది ఇలావుండగా ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి శాంతియుతంగా మారేవరకు చక్కెర మిల్లులు, రైల్వేలు దిగుమతి అయిన ముడి చక్కెర రవాణాకు ప్రయత్నించరాదని ఉత్తరప్రదేశ్ చక్కెర కమిషనర్ సుధీర్ కోరారు.
చక్కెర మిల్లుల ఆందోళన ఇది ఇలావుండగా దిగుమతి అయిన ముడి చక్కెర ఫ్యాక్టరీలకు చేరకుండా చేస్తే చక్కెర పరిశ్రమకు సమస్యలు ఏర్పడతాయని చక్కెర మిల్లుల యజమానులు అంటున్నారు.ఇండియా చక్కెర అవసరాలు 23.5 మిలియన్ టన్నుల మేర ఉన్నా యి. ప్రస్తుతం ఇండియా 16 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఉత్పత్తి చేసింది. మిగిలిన అవసరాలను తీర్చుకోవడానికి ఐదు మిలియన్ టన్నుల ముడి చక్కెర దిగుమతికి బ్రెజిల్‌తో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ముడి చక్కెరను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ముడి చక్కెర రవాణాపై యుపి ప్రభుత్వం విధించిన ఆంక్షలు తాత్కాలికమని చక్కెర మిల్లులు భావిస్తున్నాయి. లేకపోతే జాతి ప్రయోజనాలు దెబ్బతింటాయని యజ మానులు అంటున్నారు. బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే చక్కెరలో పది లక్షల టన్నులు శ్రీ రేణుకా షుగర్స్‌కు చేరితే ఐదు లక్షల టన్నులు బజాజ్ హిందుస్తాన్‌కు చేరాల్సి ఉంది.
చక్కెర రంగంలో ప్రస్తుత సంక్షోభం ఏర్పడి ధరలు పెరగడానికి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవారే కారణమని మహారాష్ట్ర ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులతో సహా పలువురు ఆరోపించారు. కాని రెండు సంవత్సరాల క్రితం చక్కెర ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గినప్పుడు చక్కెర మిల్లులు రైతులకు తాము కొనుగోలుచేసిన చెరకుకు చెల్లింపులు చేయకుండా రైతులను కోర్టుల చుట్టూ తిప్పినందుకే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ పంటల వల్ల మంచి ధర లభించడం కూడా చెరకు రైతులను ఇతర పంటలవైపు మళ్లిస్తున్నది. సమీప భవిష్యత్తులో చక్కెర ధర పెరిగే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు.