Home » వాణిజ్యం » బెంచ్ నుంచి తప్పుకున్న రవీంద్రన్
బెంచ్ నుంచి తప్పుకున్న రవీంద్రన్
గురు వారం, నవంబర్ 05, 2009 , 11:53 [IST]
కుమార్తె పనిచేసే కంపెనీకి ముఖేష్ సంస్థలతో సంబంధాలు న్యూఢిల్లీ నవంబర్ 4:- కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్ ధర,పంపిణీపై అంబానీ సోదరుల మధ్య చెలరేగుతున్న వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్‌వి రవీంద్రన్ బెంచ్ నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులపై ముఖేష్ అంబానీ గ్రూపుకు సలహాలు ఇచ్చే న్యాయవాదుల సంస్థతో తన కుమార్తెకు సంబంధం ఉన్నందున ఈ కేసును విచారించే న్యాయమూర్తుల బెంచ్‌నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆర్‌వి రవీంద్రన్ పేర్కొన్నారు. ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి. ఆయనకు ముఖేష్ అంబానీ గ్రూపు కంపెనీల్లోనూ, అనిల్ అంబానీ గ్రూపు కంపెనీల్లో సమానంగా వాటాలు ఉన్నాయి.
ఈకేసు విచారణ బాధ్యతల నుంచి తనను తప్పించాల్సిందిగా ఇంతకుముందే రవీంద్రన్ కోరిన విషయం తెలిసిందే. కేజీ బేసిన్‌లో లభించిన గ్యాస్ ముఖేష్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు ఏ ధరకు విక్రయించాలన్న విషయాన్ని విచారించేందుకు కొత్త సుప్రీం కోర్టు బెంచ్‌ను రేపు పునర్‌నిర్మిస్తారు. ముఖేష్ అంబానీ గ్రూపుతో సంబంధం ఉన్న సొలిసిటర్స్ సంస్థతో తన కుమార్తెకు సంబంధం ఉన్నట్లు మంగళవారం నాడే తనకు తెలిసిందని రవీంద్రన్ పేర్కొన్నారు. ఎజెడ్‌బి పార్టనర్స్ అనే బెంగుళూరు సంస్థలో రవీంద్రన్ కుమార్తె పనిచేస్తున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆమె ఈ పనిలో చేరారు. బుధవారం నాడు ఈ కేసు విచారణ ప్రారంభం కాగానే రవీంద్రన్ కోర్టులో ఈ ప్రకటన చేసారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేసి రేపు కేసు విచారణ తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
2005లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వం నిర్ణయించిన గ్యాస్ ధర కంటే 44 శాతం తక్కువ ధరకు గ్యాస్‌ను విక్రయించాలని ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ పట్టుబడుతున్నది. అయితే ప్రభుత్వమే గ్యాస్ కేటాయింపు విధానాన్ని నిర్ణయిస్తుందని, అలాగే ధర కూడా నిర్ణయిస్తుందని అందువల్ల తాను ఈ అంశంలో జోక్యం చేసుకోలేనని ముఖేష్ అంబానీ స్పష్టం చేస్తున్నారు. 'తన అంతరాత్మఈ కేసులో చాలా స్పష్టంగా ఉన్నదని, ఈ కేసులో న్యాయం జరగడమేకాకుండా న్యాయం జరిగినట్లు కన్పించాలని, అది సుప్రీం కోర్టు సాంప్రదాయమని రవీంద్రన్ పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు సుప్రీం కోర్టు సమయం తనవల్ల వృధా అయినందుకు ఆయన విచారణ వ్యక్తంచేసారు.
తన కుమార్తె ముఖేష్ అంబానీకి సలహా చెప్పే సొలిసిటర్ సంస్థతో సంబంధం ఉందన్న విషయాన్ని ఎవ్వరో ఒకరు తన దృష్టికి తెచ్చి ఉండాల్సిందని రవీంద్రన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే తన వాదనలను వినిపించిందని, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ వాదనలు ఇంకా ప్రారంభం కాలేదని, అందువల్ల తాను బెంచ్ నుంచి తప్పుకోవడం వల్ల పెద్ద నష్టం జరగదని రవీంద్రన్ అన్నారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున న్యాయవాది హరీష్‌సాల్వే,అనిల్ అంబానీ గ్రూపు తరపు న్యాయవాది రామ్‌జీఠ్మాలాని, ఇద్దరు కూడా రవీంద్రన్ సుప్రీం కోర్టు బెంచ్‌లో కొనసాగాలని కోరడం విశేషం. అయితే రవీంద్రన్ దానికి తిరస్క రించారు. అలాగే ప్రధాన న్యాయమూర్తి కెజి బాల కృష్ణన్, మరో న్యాయమూర్తి పి సదాశివంతో కలిసి విచారణ కొనసాగించాల్సిదిగా అంబానీ సోదరుల తరపు న్యాయవాదులు ఇద్దరు కోరారు.
అయితే తాను మొదటి నుంచి ముగ్గురు న్యాయ మూర్తులు ఈ కేసు విచారణ జరపాలని కోరుతున్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేసారు. రేపు కొత్తగా బెంచ్‌ను తిరిగి ఏర్పాటు చేస్తారు. నవంబరు 12వ తేదీలోగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వాదనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 20న ఈ కేసు విచారణ ప్రారంభం అయినప్పుడే న్యాయమూర్తి రవీంద్రన్ బెంచ్ నుంచి తప్పుకోవ డానికి ఆసక్తిని ప్రదర్శించారు. తనకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోనూ, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో సమానంగా వాటాలు ఉన్నాయని అప్పట్లో రవీంద్రన్ ప్రకటిం చారు. ఇద్దరు సోదరుల న్యాయవాదులు రవీంద్రన్ బెంచ్‌లో ఉండటాన్ని అప్పుడు గట్టిగా మద్దతు ఇచ్చారు. షేర్ మార్కెట్‌లో జడ్జీలు న్యాయమూర్తులు పలువురు స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అంబానీ సోదరుల మధ్య ఏర్పడిన గ్యాస్ వివాదం కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్‌కు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి చెందిన రెండు కంపెనీల్లోనూ షేర్లు ఉన్నాయి. ఎంత విలువైన షేర్లు ఈ రెండు కంపెనీల్లో ఉందీ ఆయన వెల్లడించలేదు. రవీంద్రన్‌కు 57 కంపెనీల్లో మొత్తం 19,773 షేర్లు ఉన్నాయి. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తులు షేర్లు కలిగి ఉన్నారు. న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడి యాకు 20 లక్షల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయి. న్యాయమూర్తులే కాదు వారి భార్యల పేరున కూడా పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయి.
న్యాయమూర్తి కపాడియా భార్య పేరు 19 లక్షల విలువైన షేర్లు ఉన్నాయి.జస్టీస్ రవీంద్రన్ భార్య పేరుతో 43 కంపెనీల్లో 10,616 పేర్లు ఉన్నాయి. ఆర్‌ఐఎల్-ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ వివాదం కేసు నుంచి తప్పుకున్న జస్టీస్ రవీంద్రన్‌కు ఉన్న 19,773 షేర్లలో ముఖేష్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్‌లో 772 షేర్లు, అనిల్ అంబానీకి చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో 783 షేర్లు ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో 783 షేర్లు, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్‌లలో 840 షేర్ల చొప్పున, రిలయన్స్ క్యాపిటల్‌లో 821 షేర్లు కలిగి ఉన్నారు. రవీంద్రన్ భార్యకు ఆర్‌ఐఎల్, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో 314 చొప్పున షేర్లు ఉన్నాయి.
ఆమెకు రిలయన్స్ క్యాపిటల్‌లో 15, రిలయన్స్ ఎనర్జీలో 22, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో 314 షేర్లు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి కె.జీ బాలకష్ణన్, జస్టీస్ బి.సుదర్శన్ రెడ్డి, జస్టీస్ సైరిక్ జోసెఫ్, జస్టీస్ హెచ్.ఎల్.దత్తు షేర్లలో పెట్టుబడులు పెట్టలేదు. మిలిగిన న్యాయమూర్తులు అందరూ షేర్లలో పెట్టు బడులు పెట్టారు. న్యాయమూర్తులుగా నియమితు లైన తరువాత వీరంతా తమ షేర్ల వివరాలను వెల్లడించారు.