నేడు ఉప్పల్‌లో ఐదో వన్డే హైదరాబాద్, నవంబర్ 3: రసవత్తర క్రికెట్ పోరుకు రాజధానిలోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక 7 వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచుల్లో 2-2తో సిరీస్ సమం చేసుకున్న భారత్ కీలకమైన మూడో వన్డే కోసం హైదరాబాద్‌లో పోటీకి సిద్ధమైంది. మొహాలీలో వరుసగా మూడో సారి పరాజయం పాలైన భారత్ ఉప్పల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ కొట్టి సిరీస్‌లో పటిష్ట స్థితికి చేరాలనుకున్న భారత్‌కు మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఎదురు దెబ్బ తగిలింది. మొహాలీలో భారత్ ఆడిన చివరి రెండు మ్యాచుల్లో పరాజయం పాలై నాలుగో వన్డేతో పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఇంతకు ముందు మొహాలీలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచుల్లో భారత్ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో భారత్ దూకుడుకు ఆసీస్ నాలుగో వన్డేలో గండి కొట్టింది. గత రెండు మ్యాచుల్లో టాస్ గెలిచి మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు నాలుగో వన్డేలో టాస్ ఓడటం కలిసివచ్చింది. దీంతో నాగ్‌పూర్, ఢిల్లీ వన్డేల్లో చెలరేగిన భారత్‌కు మొహాలీలో చుక్కెదురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అర్దశతకం సాధించలేని దశలో భారత్ మొహాలీలో ఆసీస్‌కు 24 పరుగుల తేడాతో తలొగ్గి సిరీస్‌లో 2-2తో వారికి సమతూకంగా నిలిచింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో తాము సమతూకంగా ఉన్నా బ్యాటింగ్ వైఫల్యం వల్లే మ్యాచ్‌ను చేజార్చుకున్నామని భారత్ కెప్టెన్ ధోని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో జరగనున్న అయిదో వన్డే ఈ సిరీస్‌లో కీలకంగా మారడంతో టికెట్ల కోసం అభిమానులు తొక్కిసలాడుకునే పరిస్థితి నెలకొంది.
ఆసీస్‌కు గాయాల బెడద.. బౌలర్ హెన్రిక్వెస్ తాజాగా గాయపడటంతో ఆసీస్ జట్టులో గాయాల బారిన పడి ప్రస్తుత సిరీస్‌కు దూరమైన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. మొహాలీలో నాలుగో వన్డే సందర్భంగా హెన్రిక్వెస్ కండరాలు పట్టేయడంతో స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు. ఇప్పటికే మరో బౌలర్ సిడిల్ కూడా జట్టుకి అందుబాటులో లేకపోవడంతో విక్టోరియా క్లబ్ ఆల్‌రౌండర్ ఆండ్రూమెక్‌డొనాల్డ్, న్యూసౌత్ వేల్స్ పేసర్ బర్ట్‌కోక్లీలను మిగిలి ఉన్న ఈ సిరీస్‌లో జట్టుకి అందుబాటులో ఉంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన బౌలర్లు బ్రెట్‌లీ, జేమ్స్‌హోప్స్, టిమ్‌పైనీల సేవలను కోల్పోయిన ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం బలహీన పడింది. హోప్స్ స్థానాన్ని భర్తీ చేయడానికి సిరీస్ మధ్యలో భారత్‌కు చేరిన హెన్రిక్వెస్ ఇప్పుడు దూరమవ్వడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీపాంటింగ్ తలపట్టుకుంటున్నాడు.
ఇప్పటికే నాలుగు వన్డేలు పూర్తైన సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. దాంతో కీలకంగా మారిన ఆయిదో వన్డేకు ఆస్ట్రేలియా జట్టుకి 13 మంది సభ్యులు మాత్రమే అందుబాటులో ఉండటం భారత్ శిబిరానికి కలిసి వచ్చే అంశం. ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం తమకు తీరని లోటుగా మారుతోందని పాంటింగ్ పేర్కొంటున్నాడు. కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో తుది జట్టు ఎంపిక తమకు పరీక్షగా మారిందని ఆస్ట్రేలియా కోచ్ టిమ్‌నిల్సన్ అంటున్నాడు. ఏడో స్థానంలో బ్యాట్‌తో రాణించే హోప్స్‌తో పాటు ఇప్పుడు హెన్రిక్వెస్ కూడా గాయం కారణంగా దూరమవ్వడంతో తాము ప్రత్యామ్నాయాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. బ్రెట్‌లీతో పాటు వారు దూరమవ్వడంతో ఆ ప్రభావం బౌలింగ్ విభాగంపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉదని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో రికీపాంటింగ్, మైక్‌హసీలు రాణిస్తుండటం వారికి అనుకూలించే అంశం. పాంటింగ్ ఈ సిరీస్‌లో 49.25 సగటుతో ఇప్పటి వరకూ 197 పరుగులు చేయగా,హసి 82.33 సగటుతో 247 పరుగులు చేశాడు.
మరోవైపు గాయం కారణంగా పేసర్ జహీర్‌ఖాన్ అందుబాటులో లేకుండా పోయిన భారత్‌కు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన గౌతంగంభీర్ నాలుగో వన్డేలో గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో వరసగా అర్థశతకాలు సాధించి ఫాంను చాటుకున్న అతను లేని లోటు స్పష్టంగా కనపడిన నాలుగో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. సిరీస్‌లో ఆధిపత్యం సాధించాలంటే తప్పక గెలుపొందాల్సిన హైదరాబాద్ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారత్ రికార్డు చూస్తే మాత్రం భారత్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకూ ఇక్కడ ఆడిన రెండు వన్డేలో భారత్ పరాజయం పాలైంది.
2005-06లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ, 2007-08లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. అయితే ఆ రెండు మ్యాచుల్లోనూ యువరాజ్‌సింగ్ శతకాలు నమోదు చేయడం ఒక్కటే భారత్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుత సిరీస్‌లో ఇంకా సత్తాచాటుకోని యువరాజ్ హైదరాబాద్ మ్యాచ్‌లో చెలరేగుతాడని భారత్ కెప్టెన్ ధోని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అతనితో పాటు సచిన్, సెహ్వాగ్, గంభీర్‌లు బ్యాట్‌తో రాణిస్తే తమ విజయం తధ్యమని ఈ సిరీస్‌లో అద్భుత ఫాం కనబరుస్తున్న ధోని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో ధోని 85 పరుగుల సగటుతో 255 పరుగులు చేశాడు.
అందులో ఒక శతకం కూడా ఉంది. బ్యాటింగ్ బలమే ఉప్పల్‌లో పోరుకు సిద్ధమవుతున్న భారత్ సమష్టిగా రాణించి 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని సగటు అభిమాని అభిలాషిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్, నెహ్రా, హర్భజన్‌సింగ్, రవీంద్రజడేజాలతో బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గా రాణిస్తుండటం భారత్‌కు కలిసి వచ్చే అంశం. తామాడిన ఆఖరి అయిదు వన్డేల్లో చెరో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్, ఆస్ట్రేలియాలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్ మైదానంలో ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. జట్ల వివరాలు భారత్: వీరేంద్రసెహ్వాగ్, సచిన్‌టెండూల్కర్, గౌతంగంభీర్, యువరాజ్‌సింగ్, మహేంద్రసింగ్‌ధోని (కెప్టెన్), సురేష్‌రైనా, రవీంద్రజడేజా, హర్భజన్‌సింగ్, ప్రవీణ్‌కుమార్, ఇషాంత్‌శర్మ, ఆశిష్‌నెహ్రా