మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
సంవత్సరాది కనుక ఉగాది
గురు వారం, మార్చి 11, 2010 , 1:56 [IST]
షడ్ధర్శనం విజయలక్ష్మి

ugadhiసంవత్సరాది అంటే సంవత్సరానికి ఆరంభ దినం అని అర్థం. ఆంధ్రులు చాంద్రమానం ప్రకారం సంవత్సరాదిని నిర్ణయిస్తారు. బ్రహ్మపురాణం చైత్యశుక్ల పాడ్యమి ఉగాది అని తెలుపుతుంది. పార్సీలు కూడా ఈ రోజునే నౌరోజ్‌ పేరుతో ఉగాదిని జరుపుకుంటారు. మహారాష్ట్రులు కూడా ఈరోజునే ఉగాదిని జరుపుతారు. కొత్తగా ఏపనైనా మొదలు పెట్టడానికి ఇది మంచిదినమని వారి నమ్మిక.

ఆదిలో ఈ రోజే బ్రహ్మసృష్టిని ప్రారంభించాడు. బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు నియోగించాడు. నాటినుంచి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాం డపురాణం చెబుతుంది. ఉగాది రోజే వనవాసా నంతరం శ్రీరాముడు సీతా సహితుడుగా అయోధ్య కు తిరుగుప్రయాణం ప్రారంభించాడని వాల్మీకి రామాయణంలో ఉంది. మన పంచాగకర్తలు ఈనాడు చేయవలసిన పనులను ఇలా చెబుతున్నారు. తైలాభ్యంగనం, నూతన వస్త్రాభరణ ధారణం, నింబకుసుమ భక్షణం, పంచాగశ్రవణం, ప్రసాదదానం, రాజ దర్శనం. వ్రతగ్రంథాలు ఈ రోజున బ్రహ్మపూజ, దమనకపూజ, ఉమామహే శ్వర పూజలు చేయాలని చెబుతున్నాయి.

ఆనాడు బ్రహ్మకు పూజచేయాలని స్మృతి కౌస్తుభం, పురుషార్థచింతామణి ద్వారా తెలుస్తుంది. బ్రహ్మకు జరిగే ఈ పూజ దమనముతో చేసే పూజగా ఉండాలని హేమాద్రివ్రతఖండంలో ఉంది. చైత్రశుక్ల పక్షంలో దేవతలకు చేసే పూజలు దమనముతో సాగాలని చతుర్వర్గ చింతామణి సూచిస్తోంది. ఈ పక్షంలోని పదిహేరు రోజులు ఏయే దేవతలను దమనంతో పూజించాలో సూచించారు. అందులో చైత్రశుక్ల పాడ్యమి బ్రహ్మను పూజించాలి. ఉగాదినాడు విఘ్నేశ్వరు డిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది.

శ్లోII యద్వర్షాద్‌ నింబసుమం
      శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
      భక్షితం పూర్వయామేస్యా
      త్తద్వర్షం సౌఖ్యదాయకమ్‌

ఉగాది పర్వదినాన వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాదిపచ్చడిని చేస్తారు. ఇది ఒక ఔషధి. కొత్త చింతపండుతెచ్చి నీటిలో పిసికి కొత్తంబెల్లం వేసి వేపపూవులను వేసి కలియబెట్టి పచ్చడి తయారుచేస్తారు. ఉదయం లేవగానే ఈ పచ్చడిని తినాలి. తరువాతనే మిగతాపనులకు ఉపక్రమిం చాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉగాది సంవత్సరాది కనుక ఈరోజు పంచాగ పూజ చేసి మద్యాహ్నం పంచాంగ శ్రవణం చేయడం ఆచారంగా ఉంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే అయిదు అంగములు గలది పంచాగము. సంపదకోరేవాడు తిథి విషయమై జాగ్రత్త వహించాలి. దీర్ఘాయువును కోరేవారు వారం విషయంలో మెలకువ వహించాలి. పాపం నుంచి విముక్తికోరువాడు నక్షత్ర విషయం గమనించాలి. రోగాలనుంచి రక్షణ కోరేవాడు యోగవిషయంపై శ్రద్ధపెట్టాలి. తానుచేసే పనులలో విజయం కోరేవారు కరణం విషయంలో జాగ్రత్తపడాలి. ఈ విషయాలను పంచాగశ్రవణం ద్వారా పురోహితులు తెలియజేస్తారు.

ఉగాదినాడు చేయాల్సిన మరొక పని ప్రపాదాన ప్రారంభం. ప్రప అంటే చలిపందిరి. ప్రపాదాన మనగా చలివేంద్రం పెట్టి దాహతీర్థ ములు ఇవ్వడం. దీన్ని సంవత్సరాదినుంచే ప్రారం భం చేస్తారు.

సంవత్సరాది వసంతఋతువుకు మొదటిదినం. వసంతఋతువులో రోజులు గడిచేకొద్దీ ఎండలు పెరిగి గ్రీష్మఋతువులో భరింపరానివిగా ఉంటాయి. కనుక ఈ రోజుల్లో దప్పికతో ఉన్నవారి దాహాన్ని తీర్చడం పుణ్యకార్యం.
కృష్ణా గోదావరి ప్రాంతపు రైతులు ఉగాదినాడు ఏరువాక సాగుతారు. ఎద్దులను కట్టిదున్నుటకు సిద్దపరిచిన నాగలిని ఏరు అంటారు. ఏరువాక అంటే దున్నుటను ఆరంభించుట అని అర్థం. ఈనాడు రైతులు తలంటుపోసుకొని బొట్టుపెట్టుకొని కొత్తబట్టలు కట్టుకుంటారు. నాగలికి పాతతాళ్లను తీసేసి పసుపుతాళ్లను కడతారు. నాగలికి కాడికి రావిమండలు కడతారు. ఎడ్లకు పసుపురాసి కుంకుమబొట్టు పెట్టి పూజిస్తారు. నాగలిలేని రైతులు గడ్డపార రాతిదానికే కొబ్బరికాయ కొడతారు.

ఏరువాక సాగిన తరువాత మూడురోజులు ఎడ్లతో ఏపని చేయించరు. నాలుగోరోజు నాగలిని విప్పి జాగ్రత్తచేస్తారు. ఏరువాక సాగనిదే ఆ సంవత్సరంలో ఎడ్లచేత ఏపనిని చేయించరు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు సాయంత్రం ఊర్లోని బండ్లను అలంకరించి మంచి ఎద్దులను కట్టి కొంతదూరం వాటిని పరిగెత్తిస్తారు.

చైత్రవైశాఖ మాసాలు వసంతఋతువు. కాలం వసంతకాలం. ఈ కాలంలో వసంతనవరాత్రులు ప్రారంభమవుతాయి. ఏడాదినాడు కలశస్థాపనం చేసి నాటి నుంచి తొమ్మిదిరోజులు వసంతనవరాత్రి పూజచేస్తే అపమృత్యుభయం ఉండదని ధర్మ సింధువులో ఉంది. ఈ తొమ్మిదిరోజులకు వసంత నవరాత్రులని పేరు. ఈ నవరాత్రుల ఉత్సవం ఆంధ్రనాట అతి ప్రాచీనకాలం నుంచి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ ఉత్సవానికి అధిదేవత వసంతుడు. ఋతు రాజైన వసంతుని పూజించుటచేత కలాత్ముకుడైన పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. ఈ ఉత్సవ సందర్భాన ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెడ్డిరాజులు, విజయ నగరరాజుల కాలంలో ఈ వసంతోత్సవాలు చాలా గొప్పగా జరిగేవి.

మామిడిచెట్టుకింద కలశం ఏర్పాటుచేసి దాని మీద పూర్ణకలశం ఉంచేవారు. కస్తూరి, కర్పూరం, సువాసన ద్రవ్యాలు, మరువం, దమనం పత్రాలు కూర్చేవారు. పూజలో లక్ష్మీనారాయణులను, గౌరీశంకరులను, శచీపురందరులను ఉంచి పూజించేవారు. ఇలా తొమ్మిదిరోజులు నవరాత్రులు జరిపిన పిమ్మట పదవరోజు అన్నసంతర్పణతో వత్రసమాప్తిని గావించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వసంత నవరాత్రులు జరుపు కుంటున్నారు.

పండుగ వెనుక ప్రచారంలో ఉన్న గాథలు
మహారాష్ట్రలో ఒక గాథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండే వాడు. అతడు చాలా ధనవంతుడు. నలుగురు కొడుకులు ఉన్నారు. చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు సీళ్లువేసిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవవద్దని అతడు కొడుకులను ఆదేశించాడు.

అలాగే తండ్రి మరణించినతరువాత వారు సీళ్లను తెరిచారు. మొదటిపాత్రలో మట్టి, రెండవ పాత్రలో బొగ్గులు, మూడవదానిలో ఎముకలు, నాలుగవ దానిలో తవుడు ఉన్నాయి. దీనికి అర్థం ఏమిటని ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ సమయంలో విక్రమార్కుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ  సెట్టి కొడుకులు నలుగురు రాజుదగ్గరకు వెళ్లి దీనికి అర్థం తెలియజెప్పమని ప్రార్థించారు. విక్రమార్కుడికి కూడా దాని అర్థం తెలియలేదు.

ఆ నలుగురు ప్రతిష్ఠానపురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజుగాని, మరెవ్వరూ అర్థాన్ని చెప్పలేక పోయారు. ఆవూరిలోని ఒక బాలుడు ఆ సమస్యను విడమరిచి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆమె చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగకుమారుడైన తక్షకుని మూలంగా ఆమె గర్భం ధరించింది. దీంతో కోపించి ఆమె సోదరులు ఇళ్లువిడిచి దేశాంతరాలకు వెళ్లిపోయారు.

దిక్కులేని ఆ వితంతువుకి ఒక కుమ్మరి ఆశ్రయ మిచ్చాడు. ఆ కుమ్మరి ఇంట్లోనే ఆమె ఒక బాలుడిని ప్రసవించింది. ఆ బాలునికి ఆమె శాలివాహనుడు అని పేరుపెట్టింది. ఇతనే ఆ బాలుడు. అతడు వారి సమస్యను విని రాజుదగ్గరకు వెళ్లి సమస్యను తాను పరిష్కరిస్తానని చెప్పాడు. మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్ర వచ్చిన పుత్రుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువులని, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన పుత్రుడు ధాన్యాన్నీ పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు చెప్పాడు.

శాలివాహనుడు సమస్యను పరిష్కరించిన తీరును విని విక్రమార్కుడు అతడిని చూడాలని కబురుచేశాడు. అయితే శాలివాహనుడు పోలేదు. నేను పోయేది లేదని చెప్పాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చేరోజు వస్తుందని చెప్పాడు. దీనికి విక్రమార్కునికి కోపం వచ్చింది. శాతవాహను డిని చంపడానికి అపార సైన్యంతో వచ్చాడు. ఇదివిని శాలివాహనుడు మట్టితో బొమ్మలను చేసి వాటికి ప్రాణంపోసి విక్రమార్కుని సేనలమీదికి పంపాడు. పోరు ఘోరంగా జరుగుతోంది.

శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుని సేనలు నిద్రపోయేట్లు చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన సేనల్ని తిరిగి తేర్చుకున్నాడు. అప్పుడు ఇద్దరరికీ రాజీ కుదిరింది. ఇంతలో ఆకాశవాణి ఆ ఇద్దరిని ఉద్దేశించి నర్మదానదికి ఉత్తరాన్ని విక్రమార్కుడిని, దక్షిణాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పింది.
శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటిదినం చైత్రశుక్ల పాడ్యమి. ఆరోజు పండగను జరుపుకున్నారు. ఆ పండుగే ఉగాదిగా ప్రసిద్థి పొందింది.

ఈనాడు మహారాష్ట్ర స్త్రీలు తమ ఇంటి ముంగిళ్ల ముందు పేడనీళ్లు చిల్లి ముగ్గులు పెడతారు. ఆ ముగ్గల మీద మధ్యన చౌరంగం అనే కర్రపీటను ఉంచుతారు. ఆ పీట మధ్యలో నీళ్లతో నింపిన పాత్రను ఉంచి అందులో ఒక రూపాయి వేస్తారు. ఆపాత్రమీద టెంకాయ పెట్టి పూజచేస్తారు. ఇంటిముందు కూడా ఒక ధ్వజాన్ని నెలకొల్పుతారు. దానిపై వెండి, రాగి, ఇత్తడితో తయారైన ఏదో ఒక పాత్రను ఉంచి బంగారు జరీపోగులు ఉన్న పట్టు పీతాంబరాలను ఆ ధ్వజానికి చుడతారు. ఆ ధ్వజానికి జెండాలు, పూలగుత్తులు కూడా అమరుస్తారు.
ఇంద్రలోకంలో ఇంద్రుడు ఈనాడు ఇట్టి ధ్వజస్తంభాలను నెలకొల్పుతాడనీ, తాము ఇక్కడ నెలకొల్పే ఈ ధ్వజాలు వాటికి అనుకరణాలనీ మహారాష్ట్రుల విశ్వాసం.

ఉగాదినాడు మనం పచ్చడిలో ఉపయోగించే వేపకు సంబంధించి పెద్దలు ఒక కథను చెబుతారు.
ఒక ఊర్లో భార్యభర్తలు అన్యోన్యంగా ఉండే వారు. అందులో భర్త పనినిమిత్తం దూరప్రాంతానికి ప్రయాణం పెట్టుకున్నాడు. భర్త తర్వగా ఇంటికి తిరిగి వచ్చేలా ఉపాయం ఏదైనా చెప్పమని భార్య ఓషధి పరిజ్ఞానం ఉన్న ఓ వృద్ధురాలిని ప్రాధేయ పడింది. ఆ వృద్ధురాలు భర్త వెళ్లేటప్పుడు ప్రతిరాత్రి చింతచెట్టు కింద పడుకుంటూ వెళ్లేట్లు, తిరుగు ప్రయాణంలో ప్రతిరాత్రి వేపచెట్టు కింద పడుకుంటూ వచ్చేటట్లు కోరమంది. భార్య భర్తను ఆవిధంగానే కోరింది. భర్త అందుకు ఒప్పుకున్నాడు. 

చింతచెట్టుగాలి చాలా జబ్బుగాలి. అందుకే అతనికి ప్రయాణం మధ్యలోనే జబ్బుచేసింది. అతను ఎలాగో వెళ్లి పనిముగించుకుని తిరుగు ప్రాయణం అయ్యాడు. వచ్చేటపుడు వేపచెట్టు కిందపడుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. వేపచెట్టుగాలి ఒంటికి మంచిదికావడం చేత ఇంటికి వచ్చేసరికి అతని ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. దీనిలోని ఔషధీగుణాలు రక్తాన్ని శుద్ధిచేసి ఆరోగ్యాన్ని రక్షిస్తుందని ఈ కథ ద్వారా పెద్దలు తెలియజేశారు.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 అందమైన పక్షుల్లో అందని భావాలెన్నో
 ప్రణవనాదం అర్థం చెప్పిన..
 ఆధ్యాత్మిక కాంతుల అరుణాచలం!
 విమర్శించేవారిపై పగవద్దు
 మహిమాన్వితమైన నాభిగయ
 ఉత్తమ నైతికత్వం
 హరినామ స్మరణే ఉపదేశం
 కాశీకన్నా పురాతన గ్రామం 'బనవాసి
 తప్పులను ఎత్తిచూపవద్దు
 రాగ ద్వేషాలను తొలగిస్తే మనస్సు..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com