న్యూఢిల్లీ మార్చి 10:- ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లు వాటాలను విక్రయించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని పెట్రో లియం శాఖ కార్యదర్శి ఎస్ సుందరేషన్ బుధవారం నాడు పత్రికలవారికి చెప్పారు.ఇంధ నాల ధర నిర్ణయంలో ప్రభుత్వ అస్పష్టవైఖరి వల్ల తమ కంపెనీ విలువపై ప్రభావం పడుతుందని ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భావిస్తున్నది. అందువల్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్‌ను ఇది గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించడం లేదని సుందరేషన్ అన్నారు. ఈ రెండు కంపెనీల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌పై అభిప్రా యాలు తెలియచేయాల్సిందిగా 2009 డిసెంబ రులో డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ పెట్రోలియం శాఖ అభిప్రాయాలను కోరింది.
అయితే చమురు శాఖ ఇంధనం ధరలు, సబ్సిడీలపై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకునేవరకు పబ్లిక్ ఇష్యూ గురించి ఆలోచించరాదని అభిప్రాయ పడింది. అలాగే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కూడా ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్‌కు అనుకూలంగా లేవని సుందరేషన్ భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ కంపెనీలు తాము విక్రయించే పెట్రోలు, డీజిల్, ఎల్‌పిజి, కిరోసిన్‌లను మార్కెట్ ధరలకు కాకుండా సబ్సిడీ ధరలకు విక్రయించేలా ప్రభుత్వం చేస్తున్నది.
ఈ కంపెనీలకు వచ్చే నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం లేదు. క్రూడాయిల్ విక్రయించడం ద్వారా తనకు లభించే నికరధరపై ఒఎన్‌జిసి ఆందోళన చెందుతున్నది. చమురు రీటైల్ కంపెనీలకు వచ్చే నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి క్రూడాయిల్‌ను రీటైల్ కంపెనీలకు తక్కువ ధరకు లభించేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. అలాగే సహజవాయువు ధరపై కూడా తుది నిర్ణయం జరగలేదు. అందువల్ల ప్రస్తుతం తమకు అవసరమైన నిధులను రుణసేకరణ ద్వారా తీర్చుకోవాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.