Home » వాణిజ్యం » రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
గురు వారం, మార్చి 11, 2010 , 1:08 [IST]
న్యూఢిల్లీ మార్చి 10:- తాము రైతుల పక్షాన ఉన్నామన్న భావన కలిగించడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట రుణాలు చాలా తక్కువ వడ్డీకే ఇస్తున్నాయి. కొన్నిరాష్ట్రాలు అయితే వడ్డీ లేకుండానే ఈ రుణాలు ఇస్తు న్నాయి. సకాలంలో సహకార పంట రుణాలు చెల్లించిన రైతుల వద్ద నుంచి వడ్డీ వసూలు చేయరాదని తమిళనాడులోని డిఎమ్‌కె ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభు త్వం కూడా ఏప్రిల్ నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన విషయం తెలిసినదే. ఈ రాష్ట్రంలో 25వేల వరకు సహకార పంట రుణాల మీద వడ్డీ వసూలు చేయరాదని నిర్ణయం జరిగింది.
ఒరిస్సాలో కేవలం మూడు శాతం వడ్డీని మాత్రమే వసూ లు చేస్తున్నారు.కర్నాటకలోని బిజెపి ప్రభు త్వం కూడా సన్న,చిన్నకారు రైతులకు మూడు శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నది. ఈ రుణా లను జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. వడ్డీ రేట్ల మీద సబ్సిడీ ఇచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూ.200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. ఈ వడ్డీ రేట్లు కేంద్ర ఆర్థిక మంత్రి 2010-11 బడ్జెట్‌లో ప్రకటించిన సబ్సిడీ వడ్డీ రేట్లు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నాయి. రైతులకు కొన్ని సందర్భాల్లో మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను ఏడు శాతం వడ్డీకి సహకార సంస్థలు ఇస్తున్నాయి.
ఐదు శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లకు సహకార రుణాలు ఇవ్వాలన్న నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. సహకార రుణాలను సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యూహంతో ముందకు వెళుతున్నట్లు నాబార్డ్ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ సబ్సిడీ కోసం రూ.140 కోట్లు కేటాయించింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.1500 కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. మహారాష్ట్రలో రూ.25వేల వరకుపంట రుణానికి వడ్డీ వసూలు చేయరు. మూడు లక్షల వరకు రెండు శాతం వడ్డీని వసూలు చేస్తారు. 2009-10 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 13వేల కోట్ల పంట రుణాలను పంపిణీ చేసినట్లు అంచనా.
2010-11 సంవత్సరంలో దీనిని రూ.15వేల కోట్లకు పెంచనున్నారు. 2009-10 సంవత్సరంలో రాష్ట్రంలో వ్యవసాయపరపతి కింద రూ.28వేల కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010-11 సంవత్సరంలో దానిని రూ.35వేల కోట్లకు పెంచుతారు.