| ధరలపై మాటల సర్కస్ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:13 [IST] |
 |
|
ధరల పెరుగుదలతో ఒకవైపు సామాన్య ప్రజలు కుంగి పోతుంటే మరొకవైపు ప్రభుత్వ పెద్దలు మాటల సర్కస్ సాగిస్తున్నారు. ఈ సమస్యపై అగ్రస్థాయి ప్రభుత్వ బాధ్యులు ఇటీవల తరచు మాట్లాడుతున్నారు. కేంద్ర స్థాయిలోనూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ కార్య దర్శులతోనూ సమావేశం నిర్వహిస్తున్నారు.
కాని వీట న్నింటిలో కనిపిస్తున్నవి ఒకరి నొకరు దోషులుగా చూపు కోవటం,ధరల పెరుగుదలకు కారణాలుగా కల్లబొల్లి మాటలు చెప్పటం మాత్రమే. చివరకు ఇపుడు కొత్త పంటలు మార్కెట్లోకి వస్తూ కొన్ని ధరలు కొంత తగ్గు తుంటే, అది పంటలు వచ్చిన ప్రతిసారీ సహజంగా జరిగేదన్న విషయాన్ని విస్మరించి తమ ఘనత అయినట్లు చూపే ప్రయత్నం జరుగుతున్నది.
ధరల పెరుగుదలకు వీరు చెప్తున్న కారణాలను, అవి ఏ విధంగా తగ్గగలవో చేస్తున్న సూచనలను గమనించండి. వర్షాభావంవల్ల, ఆర్థికమాంద్యంవల్ల ధరలు పెరుగుతు న్నట్లు ఒకసారి చెప్తారు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధాన్యం కొరతలు ఏర్పడ్డాయని, దిగుమతి చేసుకోవాలన్నా అందుబాటులో లేవని అంటారు. ఇతర దేశాల మాట ఎట్లున్నా,ఇక్కడ పంటలు తగ్గలేదని మరొకసారి అంటారు. ఒకవేళ తగ్గినా ధాన్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కోటాలను తరలించుకుపోవటం లేదని చెప్తారు. కొరతలేమీ లేవుగాని వ్యాపారుల అక్రమ నిల్వల వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని, కొరతలు ఉన్నాయనే పవార్ ప్రకటనల వల్ల వ్యాపారులు అక్రమ నిల్వలు పెంచుతున్నారని ఒకసారి సూచిస్తారు.
పెట్రో లియం ఉత్పత్తుల ధరలు పెరిగినపుడు వ్యవసాయ ఇంజన్ల వ్యయం, రవాణా వ్యయం పెరిగి ధరలపై ప్రభావం ఉంటుందన్నది ఎప్పుడూ ఉన్న అనుభవమే కాగా, అది నిజం కాదని మరొకరు అంటారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే సరకుల ధరలు పడిపోతాయని ఆయన కొత్త థియరీ ప్రతిపాదిస్తున్నారు. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టు బడులను అనుమతిస్తే ధరలు తగ్గితీరుతాయన్నది మరొక బాధ్యుని నమ్మకం. ఇప్పటికే మాల్స్‌లో ధరల రంగుల రాట్నం ఎట్లున్నదీ మన అనుభవలోనిదే. అదిగాక, విదేశీ పెట్టుబడులవల్ల దేశవ్యాప్తంగాగల కోట్లాది మంది చిన్న వర్తకులపై వ్యతిరేక ప్రభావం పడగలదనే ఆందోళన ఉంది. వీటన్నింటిని కాదని, మాయమాటలు చెప్పి విదేశీ పెట్టుబడిదారులకు అవకాశమివ్వాలన్నది వారి తాప త్రయం.
మరొక అసమర్ధపుమాట కొత్తగా వస్తున్నది. ప్రజల చేతిలో డబ్బు పెరిగి, వారు తినటం ఎక్కువై, అందుకు చాలిన సరుకులు లేక ధరలు పెరుగుతున్నా యట. ఉపాదిహామీ పథకంతో గ్రామీణులకు డబ్బు లభి స్తుండటం ఇందుకొక కారణమట. ఇది విన్నపుడు గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ చేసిన ఇదే విధమైన వాదన (ఆసియన్ల గురించి) గుర్తుకు వస్తుంది. వీరందరి మాటల సర్కస్ గురించి ఇదే విధంగా మరెం తైనా చెప్పవచ్చు. దీనంతటిలో కన్పించేది ప్రభుత్వాల వైఫ ల్యాలే. లోగడకూడా పలుమార్లు అనుకున్నట్లు మన ప్రభుత్వనేతలకు దార్శనికత, చిత్తశుద్ధి లేకపోవటమే ధరల పెరుగుదలకుగాని, ఆహారధాన్యాల కొరతకుగాని, పంపిణీ లోపాలకుగాని అసలు కారణం. ఇది అతిపెద్ద జనాభాగల దేశం. వ్యవసాయ ప్రధానమైనది. జనసంఖ్య పెరుగుదల రేటునుబట్టి రానున్న దశాబ్దాలలో జనాభాస్థితి ఏమిటి, ఆహార అవసరాలేమిటి అనే అంచనాలు ఉంటాయి.
దానిని బట్టి ఆహారభద్రతకు ప్రణాళికలు వేసుకోవాలి. అదే విధంగా ఆర్థికాభివృద్ధి జరిగినకొద్దీ కొనుగోలుశక్తి పెరిగి, ఆహార వినియోగం పెరగటం సహజం గనుక, దానిపైనా అంచనాలు ఉంటాయి గనుక, ఆ పరిస్థితి కూడా ఆహార భద్రతాపథకంలో భాగంకావాలి. ఇందుకు సమాంతరంగా ధాన్యం సక్రమ నిల్వలు, వృథాను అరికట్టటం, పంపిణీ వ్యవస్థ, అక్రమవ్యాపారాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీజరిగినపుడు కొరతలు, ధరలు సమస్యలు కాకుండా ఉంటాయి. ఇందులో మొదటినుంచి విఫలమవుతున్న ప్రభుత్వాలతీరు ఇప్పటికీ మారటంలేదు.
ఈ వైఫల్యాన్ని అంగీకరించని ప్రభుత్వాలు వాటిని చక్కదిద్దేదిశలో ఆలో చించటానికిబదులు విదేశీపెట్టుబడులనుఆహ్వానిస్తే సమస్య పరిష్కారమవుతుందని, జనం ఎక్కువ తింటున్నారని వాదించటం, కొత్త పంటలతో ధరలు తగ్గితే అది తమ ప్రయోజకత్వంగా చూపటం చేస్తున్నాయి. ఇదంతా చాలద న్నట్లు మన సంప్రదాయక విత్తనాలను, వైవిధ్యాలను ధ్వంసం చేసే విధంగా వంకాయ విత్తనాలను మల్టీనేషనల్ కంపెనీల ఆధిపత్యంలోకి తేజూస్తున్న ప్రభుత్వం ఆహారభద్రత గురించి ఆలోచిస్తున్నదని నమ్మగలమా?
|
|
|
|
|
|
|