లాస్ఏంజిల్స్ క్యాలెండరు
 న్యూయార్క్ క్యాలెండరు
 చికాగో క్యాలెండరు
 సిడ్నీ క్యాలెండరు
 ప్రాంతీయ వార్తలు
 జాతీయ వార్తలు
 అంతర్జాతియ వార్తలు
 వాణిజ్యం
 క్రీడా వార్తలు
 NRI న్యూస్
 తెర-సినిమా ప్రత్యేకం
 చెలి-మహిళా ప్రత్యేకం
 మొగ్గ-బాలల ప్రత్యేకం
 వృత్తి - పోటి పరిక్షలు
 సంపాదకీయం
 ఆద్యాత్మికం
 ప్రజావాక్కు
 సంపద
 హాయ్
 నాడి
 Quiz
 సైటెక్ - సోమవారం
 ధన - మంగళవారం
 నవ - బుధవారం
 యాత్ర - గురువారం
 దివ్య - శుక్రవారం
 స్వస్థ - శనివారం
 నిఘా- శనివారం
 రచన - ఆదివారం
Weather
Sunny
Temp High: 35°C
Temp Low: 21°C
వీడియోస్
funny Commercial
Sunday Magazine

Page - 1-2

విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్న ‘గేమింగ్‌ సెంటర్లు

March 15th, 2010 by admin
డి. మురళీధర్‌ అమర్‌నాథ్‌
nigaగేమింగ్‌ సెంటర్స్‌్‌. రాష్ట్రంలోని అనేక పట్టణాలలో విద్యార్థులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ గేమింగ్‌ సెంటర్లు వారి జీవితాలతో చెలగాటమాడు తున్నాయి. ఈ కేంద్రాలు యువతను ఆకర్షించడం ఎలావున్నా వారిని నిలువునా పెడదోవ పట్టిస్తున్నది మాత్రం అక్షరాల నిజం. పాఠశాల, కళాశాలలకు వెళ్లే యువతీ యువకులు ఈ గేమింగ్‌ సెంటర్లలో గంటల కొద్దీ కాలం వెళ్లదీస్తూ తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటుండడం అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దశాబ్ధంన్నర కాలం క్రితం రాష్ట్రంలో ఒక మాఫియా తరహాలో కూలీ, నాలీ జనాన్ని కొల్లగొట్టిన సింగల్‌ నంబర్‌ లాటరీ తరహాలో ప్రస్తుతం గేమింగ్‌ సెంటర్లు నడుస్తున్నా యంటే అతిశయోక్తి కాదు. యువతను పాడు చేస్తున్న ఈ కేంద్రాలు నిత్యం కోట్లాది రూపాయ లను అక్రమంగా ఆర్జిస్తుండగా వీటి గురించి పక్కా సమాచారం వున్న పోలీసులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం విశేషం.

రాష్ట్రంలో విద్యార్థుల పాలిట కొత్త తరహా విష సంస్కృతి ప్రబలసాగింది. విద్యార్థులకు కంప్యూట ర్లపై వుండే మక్కువను సాధనంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఇటీవల ప్రారంభించిన గేమింగ్‌ సెంటర్స్‌ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొన్ని కంప్యూటర్లు, కొద్ది మంది సిబ్బందితో ఏర్పాటు చేస్తున్న ఈ గేమింగ్‌ కేంద్రాలలో నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు తమ చదువులను సైతం మరచిపోయి కంప్యూటర్ల తో ఆటలాడుతూ వుండిపోతున్నారంటే వీటికున్న ప్రత్యేకతను ఊహించుకోవచ్చు. కంప్యూటర్లలో పలురకాల వీడియో ఆటలను వుంచి వాటిచే యువతను గంటల తరబడి గేమింగ్‌ కేంద్రాలకే పరిమితం చేయడంలో వీటి నిర్వాహకులు సఫలీకృతులవడం ఎంతో మంది విద్యార్థుల నిండు జీవితాలను పాడు చేస్తున్నాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు.

ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లోని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గేమింగ్‌ కేంద్రాలు నేడు రాష్ట్రం నలుమూలలా పుట్ట గొడుగుల్లా వెలియడం గమనార్హం. హైదరాబాద్‌ వరకు తీసుకుంటే ఈ కేం ద్రాలు వేల సంఖ్యలో వుండడం విశేషం. ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్థరాత్రి దాటే వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు పక్కన లేదా అతి సమీపం లోనే ఈ కేంద్రాలు వుండడం చెప్పుకోదగ్గ అంశం. చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులను గేమింగ్‌ కేం ద్రాల నిర్వాహకులు ఒక పద్దతి ప్రకారం ఆకర్షిస్తుం టారు. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల్లో మొదట కొన్ని రోజులపాటు విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించడం లేదా రాయితీలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షిస్తుంటారు. దీని తరువాత ఎక్కువ మంది విద్యార్థులు చేరగానే గంటకు పది రూపాయల నుంచి 30 రూపాయల వరకు రేటును నిర్ణయిస్తారు. ఒకసారి ఈ గేమింగ్‌ కేంద్రాలకు వెళుతున్న విద్యార్థులు వాటిని వదలలేక పోతున్నా రంటే ఇది వారిపై ఎంతటి వ్యసనంలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

గేమింగ్‌ కేంద్రాలలో బెట్టింగ్‌లు
ఇదిలావుండగా గేమింగ్‌ కేంద్రాలలో మొదట చిన్నా చితక ఆటలకే పరిమితమవుతున్న విద్యార్థులు కొద్ది రోజులు గడిచాక బెట్టింగ్‌ల వరకు వెళుతున్నారు. ఒకసారి బెట్టింగ్‌ వెళ్లే విద్యార్థులు ఎంత డబ్బులైనా వెచ్చించేందుకు వెనుకాడక పోవడం మరో విశేషం. ఇందుకోసం విద్యార్థులు మొదట తమ చదువులకు రాం రాం చెబుతు న్నారు. పాఠశాలలు, కళాశాలకు ఎగనామం పెడుతున్నారు. దీంతోపాటు తమ తల్లిదండ్రుల వద్ద నుంచి విద్యాభ్యాసం, ట్యూషన్ల పేరు చెబుతూ వందలాది రూపాయలను తీసుకుంటున్నారు. తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారనే భావనతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు కోరినంత డబ్బులు ఇస్తూ పోతున్నారు. కానీ తమ పిల్లలు గేమింగ్‌ కేంద్రాలలో బెట్టింగ్‌లకు పాల్పడుతూ, వ్యసనపరులుగా మారుతున్నారని తెలుసుకునే సరికే పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇలా గేమింగ్‌ కేంద్రాలలో కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులు చదు వుల్లో గుండుసున్నా కొడుతూ తమ తల్లిదండ్రుల కలలను కల్లలు చేయడంతోపాటు తమ జీవి తాలను సైతం నాశనం చేసుకుంటున్నారు.

విద్యార్థుల్లో పెరుగుతున్న నేర ప్రవర్తన
మరోవైపు గేమింగ్‌ కేంద్రాలకు వెళుతున్న అనేక మంది విద్యార్థుల్లో నేర ప్రవర్తన ఎక్కువవుతుందని పోలీసుల దృష్టికి వచ్చింది. గేమింగ్‌ కేంద్రాలలో కొనసాగుతున్న బెట్టింగ్‌ల సమయంలో నిర్వాహ కులు విద్యార్థులను బాగా రెచ్చగొడుతుండడంతో వారు ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోనవుతూ నేర స్వభావాన్ని పెంపొందించుకుంటున్నారు. కొన్ని గేమింగ్‌ కేంద్రాల్లో గొడవలు, కొట్లాటలు జరిగినా అవేవి బయటకు పొక్కక పోవడం గమనార్హం. ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్థులు ఇలా గేమింగ్‌ కేంద్రాలకు పరిమితమవుతూ నేర ప్రవర్తనను పెంపొందించుకోవడంపట్ల మేధావి వర్గా లు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. గేమింగ్‌ కేంద్రాలపై మొదటి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మేధావి వర్గాలు ఈ విషయంలో పోలీసు ల తీరును కూడా తప్పుపడుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు విద్యార్థుల నిండు జీవితాలను పాడు చేస్తున్న గేమింగ్‌ సెంటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

కోట్లాది రూపాయల లావాదేవీలు
ఇదంతా ఒక ఎత్తుకాగా గేమింగ్‌ కేంద్రాలలో నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగు తున్నాయని పోలీసులు అంగీకరిస్తున్న నిజం. చిన్నపాటి లైసెన్స్‌ కలిగి వుండే ఈ గేమింగ్‌ కేంద్రాలలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరగడం వెనుక మతలబు అందరికీ తెలిసిందే. సాదాసీదా వీడియో గేమ్స్‌తోపాటు వందల నుంచి వేలాది రూపాయల బెట్టింగ్‌లు నిర్వహించడం విద్యార్థులను వ్యసనపరులుగా మార్చడం వల్లే ఇంతటి భారీ స్థాయిలో లావాదేవీలు జరుగు తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గేమింగ్‌ కేంద్రాల పనితీరును చూస్తుంటే పదిహేనేళ్ల క్రితం రాష్ట్రంలో సింగిల్‌ నంబర్‌ లాటరీ మాఫియాను తలిపిస్తుంది.

అప్పట్లో కూలీ, నాలీ, బీదా, బిక్కి జనానికి లాటరీ ఆశ చూపుతూ వారి కష్టార్జితాన్ని నిలువునా దోచుకున్న సింగిల్‌ నంబర్‌ లాటరీ కారణంగా లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. చివరకు ప్రజా సంఘాల ఆందోళనకు సర్కారు తలొగ్గడంతో ఆ మాఫియా అంతమైంది. కానీ ఇప్పుడు మళ్లీ గేమింగ్‌ సెంటర్ల రూపంలో పుట్టుకొచ్చింది. అప్పట్లో పేద ప్రజలను సింగల్‌ నంబర్‌ లాటరీ కొల్లగొడితే ఇప్పటి గేమింగ్‌ కేంద్రాలు మాత్రం దేశానికి వెన్నెముక అయిన యువతను, ముఖ్యంగా విద్యార్థుల జీవితాలనే నాశనం చేస్తుండడం గమనార్హం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గేమింగ్‌ కేంద్రాలపై పోలీసులు ఇంత వరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం విశేషం. ఆయా ప్రాంతాలలో జరిగే గేమింగ్‌ కేంద్రాల గోల్‌మాల్‌ గురించి పోలీసులకు పక్కా సమాచారం వున్నా వారు చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు నెలసరి మామూళ్లేనని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.

సంఘ విద్రోహకులపై, చట్ట వ్యతిరేకులపై ఉక్కుపాదం మోపుతామని పదే పదే నీతులు చెప్పే పోలీసు బాస్‌లు గేమింగ్‌ కేంద్రాలలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై ఇకనైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. యువత పెడదోవపడితే దాని ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుందన్న మేధావుల వ్యాఖ్యలను పోలీసు బాస్‌లు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది.

విత్తన రంగంలో నియంత్రణ

March 11th, 2010 by admin

పత్తి విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులు, విత్తన క్షేత్రాల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పత్తి విత్తనాల ధరలు పెంచాలంటూ పత్తి విత్తన కంపెనీలు ప్రభుత్వంపై చేసిన లాబీయింగ్‌ విఫలం అయింది.  ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి విత్తనాల ధరలనుపెంచే అవకాశం ఏమాత్రంలేదని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేసారు.బిటి విత్తనాల ధరలను తగ్గించడంలో సుప్రీంకోర్టులో సైతం పోరాడి విజయం సాధించిన నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ప్రస్తుత అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో విత్తనాల ధరలను పెంచితే పార్టీలోనూ, బయటా రోశయ్య రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్లే.

జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించిన తర్వాత పత్తి రైతాంగం బాగా లబ్దిపొందిన మాట నిజమే. ఆ లాభాల్లో కొంతమేర తమకు చెందాలన్న పత్తి కంపెనీల కోరిక కూడా సబబే. కూలీ రేట్లు విపరీ తంగా పెరగడం వల్ల విత్తనాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. అయితే బిటి వంకాయ రాజకీయాలు, బిటి పత్తి విత్తనాల పరిమితులపై గుజరాత్‌లో వెల్లడి అయిన వాస్తవాల నేప థ్యంలో విత్తనాల ధరలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. కాని భవిష్యత్తులో కూడా ఇదే వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, భావించనవసరం లేదు. అత్యాధునిక విత్తనాల వల్ల ప్రయోజనం పొందినవారు తమ లాభాల్లో కొంత భాగాన్ని విత్తన కంపెనీలతో పంచుకోవడం సహజ న్యాయమే.

సొంత పొలాల్లో  విత్తనాలను  ఉపయో గించుకోవడం, తెలిసిన రైతుల నుంచి విత్తనాలను కొను గోలు చేయడం స్థాయి నుంచి భారతీయ రైతాంగం చాలా పురోగతి సాధించింది. ప్రస్తుతం ఇండియాలో దాదాపు ఐదువేల కోట్ల రూపాయల విత్తన వ్యాపారం జరుగుతు న్నది. ఏటా ఇది 12 శాతం మించి వృద్ధి సాధిస్తున్నది. హైబ్రిడ్‌ విత్తనాలు, బిటి విత్తనాలను రైతులు స్వాగతించడ మేకాకుండా దానివల్ల ప్రయోజనాలు పొందారు. అక్కడక్కడ నకిలీ విత్తనాల బెడద ఉన్నప్పటికీ రైతులు, అధికార యంత్రాంగం ఈ పీడను అధిగమించి నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాల వ్యాప్తికి దోహదం చేస్తున్నారు. విత్తన వ్యాపారం లాభసాటిగా ఉన్నప్పుడే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడమేకాకుండా, అత్యుత్తమ సాంకేతిక పరి   జ్ఞానం ఈ రంగంలో ప్రవేశిస్తుంది.

వరి, పత్తి, కూర గాయలు, మొక్కజొన్న విత్తనాలను ఎప్పటికప్పుడు మార్చడానికి రైతులు అలవాటు పడుతున్నారు. అయితే  నకిలీ విత్తన కంపెనీల వల్ల అక్కడక్కడ  రైతులు చేతులు కాల్చుకుంటున్నారు. గోదావరి జిల్లాలో మినపరైతులు రబీ సీజన్‌లో భారీగా నష్టపోవడానికి విత్తన సంస్థలే కారణం. విత్తన కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడమేకాకుండా తమ వ్యాపారంలో అక్రమాలు జరగకుండా చూసుకోవాలి.  2050 నాటికి ఇండియాలో 150 కోట్ల జనాభా ఉంటుంది. దేశ ఆహార అవసరాలు అపారంగా పెరిగిపోతాయి. దేశప్రజ లకు ఆహారభద్రత కల్పించడంకోసం ఇండియా ఇప్పటి నుంచి విత్తనాలతో సహా అనేక ఆధునిక పద్ధతులను వ్యవ సాయరంగంలో ప్రవేశపెట్టడమే కాకుండా ఈ రంగంలో మౌలికసౌకర్యాలను మెరుగుపరిచి, ఉత్పాదకతను పెంచాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇండియాలో పంటలు వేసే విస్తీర్ణం 46 శాతం పెరిగింది.

అలాగే సేద్యపు నీటి విస్తీర్ణం 226 శాతం పెరిగింది. అయితే దేశజనాభా 30 కోట్ల నుంచి 110 కోట్లకు పెరగడంతో ఆహార భదత్రకు ముప్పు ఏర్పడింది.  వ్యవసాయంలో అత్యంత కీలకమైన అంశంగా విత్తనాల సరఫరాను పరిగణించాలి. ఇండియా  విత్తన రంగంలో ప్రయివేటు కంపెనీలు చూపుతున్న చొరవ ప్రభుత్వరంగ సంస్థలు చూపడలేదు.  ఇండియాలో సర ఫరా అవుతున్న విత్తనాల్లో 46 శాతం వ్యవస్థీకృత ప్రయి వేటు కంపెనీల ద్వారానూ, 41 శాతం ప్రభుత్వరంగ సంస్థలు, అవ్యవస్థీకృత ఏజెన్సీల ద్వారానూ, 13 శాతం వ్యాపారుల ద్వారా జరుగుతున్నది.  దేశంలో 500 ప్రయి వేటు విత్తన కంపెనీలు ఉన్నాయి. మూడోవంతు విత్తనాలు బహుళజాతి కంపెనీలకు సంబంధించినవే.

ఈ విత్తన వ్యాపారం నుంచి అవ్యవస్థీకృత రంగంలోని ఏజెన్సీలను, ట్రేడర్లను దశలవారీగా తొలగించాల్సి ఉన్నది. రైతుకు చేరే ప్రతి విత్తనం, నాణ్యతకు ప్రతీకగా ఉండాలి. హైబ్రిడ్‌, బిటి విత్తనాలు ప్రవేశించిన తర్వాత వాటి ఫలితాలను చూసి  ఈ విత్తన వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఈ మోజును ఎవరూ దుర్వినియోగం చేయకుండా గట్టి నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవసాయ విద్యాలయం సహాయంతో స్వతంత్ర విత్తన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి ధరలు, నాణ్యత నిర్ధారణ వంటి బాధ్యతలను దానికి అప్పగించాలి.

శవాలైన వాళ్ళు…

March 11th, 2010 by admin
కె ప్రభాకర్‌, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా
శవాలైనవాళ్ళు…
జీవశ్చవాలైన వాళ్ళను
నిలదీస్తున్నారు!
ప్రాణమివ్వడం
అంటే..
పొద్దుపొడవడం
అన్నంత తేలిగ్గా
తమ దేహాల్ని దహించుకుని
నల్లని జెండాల్లా
శవాలతో..
జీవశ్చవాలైన వాళ్లను
వణికిస్తున్నారు!
తమను తాము
కాల్చుకుని సీమాంధ్ర
దురహంకారంపై
మాడిపోయినా
మహాజ్వల జ్వాలలై
తెలంగాణ
పోరాటాల్ని
రగిలిస్తున్నారు. స
తోటి తమ్ముళ్లూ
చెల్లెళ్ల కోసం
శవాలైన వాళ్ళు..
ఉరితాళ్ళను
ముద్దాడుతూ
జై తెలంగాణ
అనిపిస్తున్నారు!!
తెలంగాణ నా చిరునామాగా
సాగిన బలిదానాల సాక్షిగా
ముక్కోటి జాతులొక్కటై
ననదించినా చలించ్ధని
రాజకీయ ‘రాజీనామాల
విద్రోహానికి, సీమాంధ్ర
అహంకారిన్న ధ్వంసం చేసి
తెలంగాణ బలిదానాలను
నిలుపమంటున్నారు
శవాలైనవాళ్ళు..
బతికుండి..
తెలంగాణ సాధించుకోమంటున్రు..
(సిరిపురం యాదయ్య స్మృతిలో)

అలుపెరగని యోధుడు సచిన్‌

March 2nd, 2010 by admin
బెజుగాం నరేష్‌, కొండపాక, మెదక్‌ జిల్లా
ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యున్నత శిఖరాన్ని అధిరో హించిన వ్యక్తి ‘సచిన్‌ టెండూల్కర్‌ అనడటంలో అతిశయోక్తి లేదేమో! కొన్ని రోజుల కిందట వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసి ఎవరు అందుకోని రికార్డు సాధించాడు. ఇంకా చెప్పాలంటే రికార్డులకు మారుపేరుసచిన్‌. ఇందుకు తార్కాణాలు వడ్డేల్లో, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసి ‘సెంచరీమిషన్‌గా పేరు తెచ్చుకున్నాడు. వడ్డేల్లో 46 సెంచరీలు, టెస్టుల్లో 47 సెంచ రీలు కలిపితే దాదాపుగా సెంచరీల సెంచరీకి చేరువవుతు న్నాడు. అలాగే వన్డేల్లో 17 వేలకు పైచిలుకు పరుగులు, టెస్టుల్లో 13వేలకు పైచిలుకు పరుగులు సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర పుటల్లో ఎక్కాడు. తన కెరిర్‌ 20 ఏళ్లకు పైగా కొనసాగిస్తూ దేశంకోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి కూడా సచినే. అత్యధిక టెస్టులు, వన్డేలకు కూడా సమీ పిస్తున్నాడు.

తన సమఉజ్జీ అయిన స్టీవ్‌వా,లారా, వార్న్‌ వంటి వ్యక్తులతో కూడా ప్రశంస పొందాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 30 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడు కూడా ‘మాస్టరే. తన వ్యక్తిత్వం భారతదేశానికి ఎంతో పేరు తెచ్చింది. 1999 వరల్డ్‌ సందర్భంగా ‘సచిన్‌ తండ్రి హఠా న్మరణం చెందినప్పటికీ 20 రోజులు గడవక ముందే ‘ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. దీనిద్వారా అతని దేశభక్తి ఎంత అమోఘమైందో నిరూపించాడు. ఆ వరల్డ్‌ కప్‌లో బాధనుదిగమింగి ‘భారత జట్టును ‘సూపర్‌సిక్స్‌ చేర్చడంలో ప్రముఖపాత్ర వహించడం తెలిసిందే. తను 200 మంది అనాధపిల్లలను దత్తతతీసుకొని వారి ఆలనాపాలనా కొనసాగి స్తున్న విషయం కూడా విదితమే.

భారత ప్రభుత్వం ఇతని సేవను గుర్తించి గతంలో పద్మశ్రీ, పద్మ విభూషణ్‌, అర్జున్‌ అవార్డులు అందచేసింది. ఇవి సచిన్‌కు సాగిరాలేవు. ఇతని ఘనతకు సరైన పురస్కారం ‘భారతరత్నతో మాత్రమే పూడ్చగలం. ఈ భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం సచిన్‌కు అందించి సన్మానించాలి.

కష్ణాజిల్లాలో 50 వేల ఎకరాల అటవీభూముల కబ్జా!

March 2nd, 2010 by admin
కంచల జయరాజ్‌ బ్యూరో ఇన్‌ఛార్జి, విజయవాడ
nighaభూమి కనిపిస్తే చాలు కబ్జాచేయడమే ఏకైక లక్ష్యంగా కొంతమంది వ్యవహరించడంవల్ల వేలాది ఎకరాల భూమి కష్ణాజిల్లాలో హరించుకుపోతోంది. భూసంస్కరణల పేరిట పలు దఫాలుగా చేసిన భూపంపిణీ కూడా గారడీగానే మిగిలిందనడానికి జిల్లాలో అటవీభూముల్ని కబ్జాచేసిన వైనాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.

అటు అటవీశాఖ, ఇటు రెవిన్యూ యంత్రాంగాన్ని లోబరచుకొని వేలాది ఎకరాల అటవీ భూముల్ని కాజేసిన వైనం తెలిసినా వాటిని నియంత్రించే యంత్రాంగం నిస్సహాయంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రోజురోజుకూ అటవీభూముల ఆక్రమణలు యధేచ్చగా సాగిపోతున్నాయి. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు కూడా వీటిని నిరోధించలేని అసాధారణ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీంతో జిల్లా మొత్తం మీద 1.25 లక్షల ఎకరాల అటవీ విస్తీర్ణం ఇప్పుడు సగానికిపైగా తరిగి పోయింది. దీన్ని నిరోధించే వారు గానీ, నిఘాపెట్టి నియంత్రించే వారు గానీ లేకపోడంతో అటవీ ప్రాంతం మరింత తగ్గిపోయి పర్యావరణానికే ముప్పు ఏర్పడే  ప్రమాదం దగ్గర్లోనే ఉంది.

కృష్ణాజిల్లాలో 1.25 లక్షల ఎకరాల అటవీ భూములు ఉంటే, ఒక్క నూజివీడు రెవిన్యూ డివిజన్‌లో 25 వేల ఎకరాలకు పైగా అటవీభూమిని కబ్జా చేశారు. ఆక్రమించిన భూమిలో కార్పొరేట్‌ వ్యవసాయం చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. మామిడి, మొక్కజొన్న, చెరకు, మిర్చి, పత్తి వంటి పంటలు సాగుచేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు.  దీనికి అధికార పార్టీ నాయకులుతో పాటు, అధికారుల అండదండలు ఉండటంతో యధేచ్చగానే ఆక్రమ ణలు సాగుతున్నాయి. చాట్రాయి, విస్సన్నపేట, ముసునూరు, బాపులపాడు, రెడ్డిగూడెం, తిరు వూరు, గంపలగూడెం, గన్నవరం మండలాల్లో ఆక్రమణలు పాలైన అటవీభూమి ఎక్కువగా ఉంది. ఈ భూములను అటవీభూములుగా 4,5 నోటిఫి కేషన్ల కింద ప్రకటించినప్పటికీ 80 శాతానికిపైగా అటవీ భూములు ఆక్రమణదారుల చేతుల్లోనే ఉన్నాయి.

నూజివీడు రెవిన్యూ డివిజన్‌ చాట్రాయి మండలం ఆరుగొలనుపేటలో సర్వే నెంబరు 294/1లో 1647 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. అటవీభూములకు సరిహద్దులు కూడా లేవు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ భూస్వాములతో కుమ్మక్కయి అటవీశాఖాధికారులు అటవీభూముల ఆక్రమణకు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విస్సన్నపేట, తాత కుంట్ల, ఆరుగొలనుపేట, జనార్థనవరం, చిత్తపూరు వంటి గ్రామాల నుంచి వందలాది మంది పేదలు ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

పైగా వారిపై అధికారులు అక్రమ కేసులు బనాయించి వారిని నిరోధించారు. దీనివల్ల భూస్వాములు ఆక్రమణలు మరింతగా పెరిగాయి. చాట్రాయి మండలంలో మొత్తం 78,400 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంటే వాటిలో దాదాపు కబ్జాపాలయిందే ఎక్కువగా ఉంది. ఆరుగొలనుపేటలో సర్వే నెంబరు 121/1లో 80 ఎకరాలు,294/1 లో 1647 ఎకరాలు కలిపి మొత్తం 1727 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ఇవే కాకుండా మిగిలిన మండలాల్లో కూడా ఇదే తరహాగా వందలాది ఎకరాల అటవీభూమిని కబ్జా చేశారు.

జమిందారీ భూములూ కబ్జా
నూజివీడు రెవిన్యూ డివిజన్‌ పూర్వం జమిం దార్ల పాలనలో ఉంది. ఆ రోజుల్లో జమిందార్లు మిగులు భూముల్ని అటవీశాఖకు అప్పగించారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికీ పాతరికార్డులు సృష్టించి జమిందారీ పట్టాలు పుట్టించి సర్వే సెటిల్‌ మెంటు కోర్టుల ద్వారా స్టేలు పొందుతున్నారు. పేదలు సెంటు భూమి కూడా లేకుండా నిరుపేదలు అవుతుంటే, భూస్వాములు మాత్రం దొంగరికార్డు లతో వందలాది ఎకరాలు ఆక్రమించి మరింత అనుభవిస్తున్నారు.

ఎక్కడైనా ఒకచోట పేదలు అటవీప్రాంతంలో కన్పిస్తే వారిపై కేసులు మోపడం, జైళ్లపాలు చేయడం మినహా అధికారులు అసలైన ఆక్రమణదారుల్ని నిరోధించలేక పోతున్నారు. 1950లో సర్వే జరిగినపుడు సర్వేకు అనుకూలంగా లేని భూములను అరణ్యంగా ప్రకటించడం వల్ల తుమ్మగూడెం, చిత్తపూరు, రమణక్కపేట వంటి గ్రామాల్లో సాగుచేస్తున్న భూములకు పట్టాలు రాక నష్టపోయారు. అటవీ చట్టం 1967 ప్రకారం 4 నోటిఫికేషన్‌ ఇచ్చిన సందర్భంలో ప్రజలకు అటవీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో తాము సాగుచేసుకుంటున్న భూములు 4 నోటిఫికేషన్‌ కింద ప్రకటించరాదని అభ్యంతరం తెలియజేయలేకపోయారు. దీంతో వాటికి పట్టాలు పొందలేక పోయారు.వీటిని కూడా భూమస్వాములు వారికి ఉన్న అన్ని రకాల అండదండలతో ఆక్రమణలు చేస్తున్నారు.

కార్యాచరణ శూన్యం
అటవీభూముల ఆక్రమణలపై ప్రభుత్వం, ప్రజల నుంచి, పత్రికల నుంచి స్పందన రాగానే హడావిడిగా సమీక్షలు నిర్వహించడం, విచారణకు ఆదేశించడం జరిగే ప్రక్రియ. కాలం గడిచే కొద్దీ దీని తీవ్రత తగ్గిపోయి, ఆక్రమణలు యదావిధిగానే సాగుతాయి. గతంలో కూడా అటవీభూముల ఆక్రమణలపై ఇదే విధానం సాగింది. గడచిన రెండేళ్లుగా అధికారులు ఇదే మాట చెపుతున్నా కార్యాచరణలో మాత్రం నిరోధించలేక పోగా, మరింత ఎక్కువవుతున్నాయి. రెండేళ్ల క్రితం అప్పటి ఆర్డీఓ ఎస్‌.వెంకట్రావ్‌ సమక్షంలో రెవిన్యూ, ఫారెస్ట్‌ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్‌ భూముల ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోక పోవడం తమ వైఫల్యమని డిఎఫ్‌ఓ పేర్కొనడం, అటవీభూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయడం, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకోకపోవడం రెవిన్యూ అధికారులుగా తమ వైఫల్యమని పేర్కొన్నారు.

వాటిని సరిదిద్దుకొని భవిష్యత్‌లో ఎలాంటి అక్రమణలు లేకుండా చూద్దామని సమీక్షా సమావేశంలో  నిర్ణయించారు. కానీ ఆక్రమణలకు గురైన ఒక్కఎకరాన్ని కూడా స్వాధీనం చేసుకున్న దాఖలు లేవు. ఈ ఆక్రమణలపై తాజాగా వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్‌ పీయూష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ బి.రామయ్యలు స్పందించారు. ఎమ్వార్వోలు, అటవీశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. కానీ పరిస్థితుల్లో ఏమాత్రం కదలిక లేదు. ఫారెస్టు భూముల్ని ఆక్రమించిన భూస్వాముల పట్టాలు సరైనవో కావో నిర్దారించమని విస్సన్నపేట, చాట్రాయి మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ లేవు. జాయింట్‌ సర్వే జరిపి బౌండరీలు వేసిన తోటల్లో కనీసం ప్రవేశించకుండా నిషేధిత ఉత్తర్వులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఆక్రమిత భూస్వాములు కోట్ల రూపాయల విలువైన ఆటవీభూముల్లో పంటలు పండించుకుంటూ అనుభవిస్తున్నా వారిని నియంత్రించే సాహసం చేయలేకపోతున్నారు.

పేదలపైనే కేసులన్నీ
అటవీభూముల్ని సంరక్షించాలని, పేదలకు అవసరమైన భూముల్ని పంచాలని సి.పి.ఐ (ఎం. ఎల్‌.) లిబరేషన్‌ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కూలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా సాగుతోన్న ఈ పోరాటంలో వారిపై కేసులు పెట్టడం మినహా చేసింది శూన్యం. భూస్వాములకు అండగా, పేదలపై కేసులు పెడుతూ అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి జిల్లా స్థాయి అధికారి వరకూ అందరూ భూకబ్జాదారులకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఫలితంగానే అటవీభూమి 80శాతం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. లిబరేషన్‌ నాయకుడు డి.హరినాథ్‌ ఆధ్వర్యంలో సాగుతోన్న పోరాటాన్ని నిలుపుదల చేయించడం కోసం  చర్చల పేరుతో పిలిచి వంచించిన సందర్భాలే అధికం. జాయింట్‌ సర్వే చేయించడం, అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయడం వంటి హామీలు ఇచ్చినా అవి పెద్దగా కార్యాచరణకు నోచుకోలేదు.

జాయింట్‌ సర్వే చేసే సందర్భంలో కూడా అటవీ సిబ్బందిని భూస్వా ములు అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాన్ని లిబరేషన్‌ యంత్రాంగం నిరోధించింది. ఫారెస్టు సిబ్బందికి అండగా నిలిచి చేసిన జాయింట్‌ సర్వే కూడా ఇపుడు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. జాయింట్‌ సర్వే చేసి వాటికి బౌండరీలు వేశారు తప్ప నేటికీ ఆ భూముల్ని అటవీశాఖ స్వాధీనం చేసుకోలేదు. ఫారెస్టు బౌండరీల్లో తమకు పట్టాలిచ్చారని తాడేపల్లిగూడెం, పొగుమాడు, విజయవాడ తదితర ప్రాంతాల వలస భూస్వాములు వాదిస్తున్నారు. డిఎఫ్‌ఒ జాయింట్‌ సర్వే ద్వారా విడగొట్టిన భూమిని స్వాధీనం చేసుకొని వనసరరక్షణ సమితి ద్వారా పేదలకు ఇవ్వాలని కోరగా రేంజర్‌ నూజివీడు, ఆర్‌డిఒలను విస్సన్నపేట, జనార్థన వరం, ఆరుగొలనుపేట, చిత్తపూరు, గ్రామా ప్రజ లకు విఎస్‌ఎస్‌ ఏర్పాటు చేయ్యాలని ఆదేశించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇదే విధానం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఇపుడు పరిస్థితి యధాస్తితికి వచ్చింది.

తక్షణం తీసుకోవాల్సిన చర్యలివి
జాయింట్‌ సర్వే ద్వారా రెవిన్యూ ఫారెస్టు బౌండరీలు గుర్తించాలి. నిర్దారించిన తర్వాత ఆక్రమిత భూముల్లో  ఎట్టిపరిస్థితుల్లోనూ భూస్వాములు ప్రవేశించకుండా వి.ఎస్‌.ఎస్‌.లు ఏర్పాటు చేసి ఫారెస్టు సిబ్బంది స్థానిక ప్రజలకు అప్పగించాలి.
నిర్ణీత కాల పరిమితి ప్రకటించి, ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలి.
ఫారెస్టు కాల పరిమితిని ప్రకటించి, ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలి.
నోటిఫికేషన్‌లు 4,15 పునఃపరిశీలన జరపాలి. ప్రజల కోరిక మేరకు వాటిని రద్దుకు సిఫారసు చేయాలి.
గ్రామస్థాయిలో ఆక్రమణల నిరోధానికి  అఖిల పక్ష కమిటీలు ఏర్పాటు చేయాలి.
గ్రామాల వారీగా ఫారెస్టు భూముల్లో జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు వివరాలు సేకరించి, తక్షణం రద్దు చేయాలి.
అక్రమ విద్యుత్‌ కలెక్షన్లు తొలగించాలి.
ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ద్వారా కొల్లేరు తరహాలో ఆరుగొలనుపేట ఫారెస్టు బౌండరీల్లోని భూములను ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలి.
ఆక్రమణ రిజిస్ట్రేషన్‌ వివరాలు సేకరించి, వాటిని రద్దు చేయాలి.

ఆసియాలోనే భారత్‌ టాప్‌

February 18th, 2010 by admin

2010వరకు ‘రియల్‌ అద్భుత ప్రగతి
ఇది అశ్చర్యం అనుకుంటున్నారు కదా ! ఈ ఆర్థిక మాంద్యంలో కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం మన దేశంలో పుంజుకుంటుంది. ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌, అర్భన్‌ లాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసియాలోనే రియల్‌ ఎస్టేట్‌ మన దేశంలో శర వేగంగా పుంజుకుంటోందని వెల్లడైం ది. ముఖ్యంగా హైదరాబాద్‌, ముం బాయి, ఢిల్లీ, బెంగుళూరు తదితర మహా నగరాల్లో కొద్దిపాటి వెనుక డుగు తప్ప మొత్తంగా చేస్తే, రియల్‌ ఎస్టేట్‌ ఆసియాలో రివ్వున సాగుతోం దని ఈ సర్వే తెలిపింది.

ఈ సర్వేలో 270 మంది అంతర్జాతీయ స్థాయి రియల్‌ ఎస్టేట్‌ ప్రొఫెషనల్స్‌, ఇన్వెస్టర్లు, డెవలపర్లు, ప్రాపర్టీ కంపెనీల ప్రతినిధులు, లెండర్స్‌, బ్రోకర్స్‌, కన్సెల్టెంట్లు తమ తమ అభి ప్రాయాలను వెల్లడించారు. అమెరికా, యూరఫ్‌లతో పోల్చినా ఆ సియాలోని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. వాస్తవానికి ఆసియా దేశాల్లో ఆర్థిక మాంద్యం ప్రజల్ని నానా ఇబ్బం దులకు గురి చేసింది.

ప్రజల్లో కొనుగోలు శక్తి చాలా పడిపోయింది. ఒక్క భారత్‌లో మాత్రం ప్రజల్లో కొనుగోలు శక్తి నిలకడగా ఉంది. ఈ కొనుగోలు శక్తి వల్లే ఆసియాలో రియల్‌ ఎస్టేట్‌లో ఆశాజనకమైన వాతావరణం నెలకొన్నది. హైదరా బాద్‌లో కూడా ఒక్క మాదాపూ ర్‌లోనే గాక ఇతర ప్రాంతాల్లో కూడా గణనీయంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. హైదరా బాద్‌లో ఐటి కంపెనీల్లో నూటికి 80 శాతం ఆర్థిక మాంద్యంకు తట్టుకుని నిలబడినవే. ఐటి రంగ ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికాలో బ్యాంకులు ఒకవైపు దివాళా తీ స్తున్నాయి.

అయితే ఆసియాలోని బ్యాంకులు పుష్కలమైన పెట్టుబ డులతో కళకళలాడుతున్నాయి. దీని వల్ల రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి రుణాలు అందజేసేందుకు ఆసియా బ్యాంకులు ముందడుగు వేస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో గృహ రుణాలు తీసుకునేవారికి కూ డా ఆసియా బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మొత్తం మీద ఇండియాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రధమ స్థానంలో ఉందని సర్వే జరిపిన సంస్థలు వెల్లడిస్తు న్నాయి. 2010లో రియల్‌ ఎస్టేట్‌ మరింతగా వర్థిల్లుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

రియల్‌లో కొనసాగుతున్న ‘వెయిట్‌ అండ్‌ సీ’

February 18th, 2010 by admin

తాజా పెట్టుబడులకు బ్రేక్‌
ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీంతో  తాజాగా పెట్టుబడులు పెట్టేం దుకు బిల్డర్లు, పెట్టుబడిదారులు జంకుతున్నారు. ప్రాంతీయ ఏర్పాటు ఉద్యమాల వల్ల రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా స్తం భించింది. అయిదారు సంవత్సరా లుగా ఆర్థిక మాంద్యం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం చాలా దెబ్బతిన్నది. కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉన్నం తలో ముందంజ వేసింది. అయితే ప్రాంతీయ ఉద్యమాల వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తాజాగా పెట్టుబడు లు బాగా తగ్గాయి. గత మూడు నెల లుగా ఉద్యమాలు జోరుగా సాగుతు న్నాయి.

బిల్డర్ల ఫోరం కూడా ఉద్య మాల వల్ల నిర్మాణాలు ఆగి పోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, మాదాపూర్‌, సైబరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాల వల్ల ఎక్కడికక్కడ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీని వల్ల ముందుగా అడ్వాన్సులు ఇచ్చిన వినియోగదారులు లబోదిబోమంటు న్నారు. అంతేగాక లక్షలాది రూపా యలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక అనేక సమస్యలకు గురవుతున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఒక్క జంటనగరాల్లోనే గాక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30శాతం వరకు ధరలు పడి పోయాయని బిల్డర్స్‌ ఫోరం ఆందోళన వ్యక్తం చెందు తోంది.

గత అయిదేళ్లుగా ఆర్థిక మాంద్యం, ప్రాంతీయ ఏర్పాటు ఉద్యమాల వల్ల హైదరాబాద్‌ శివా రుల్లో రియల్‌ ఎస్టేట్‌ ధరలు దారు ణంగా పడిపోయాయి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ముందున్న ఆలోచన ఏమంటే… వెయిట్‌ అండ్‌ సీ. మున్ముందు జరగబోయే పరిస్థి తుల ఆధారంగా రియల్‌ ఎస్టేట్‌ ధర లు నిర్ణయమవుతాయి.  ప్రాంతీయ ఏర్పాటు ఉద్యమాలు వెనకడుగు వేస్తే ధరలు మళ్లీ ధరలు సాధారణ స్థితిలోకి వస్తాయని పలువురు పరిశీ లకులు అంటున్నారు. పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్నాయని ఆశిస్తు న్నారు. ప్రశాంతత ఉన్న చోట అ భివృద్ధి ఉంటుందని, అందువల్ల మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఉద్య మాల తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తు న్నారు.

ఆత్మ పరిశీలన చేసుకోవాలి

February 15th, 2010 by admin
ఎస్‌ యాదగిరి, నిజామాబాద్‌
ప్రజాస్వామ్య మనుగడకుఎన్నికలు ఆయువుపట్టు. లోగడ జరిగిన ఉపఎన్నికలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తమ అమూల్యమైన ఓటు ద్వారా తీర్పు చెప్పారు. పొత్తులను చిత్తుచేశారు. ఇది గమనించిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ తీవ్ర నిరాశ నిస్పృ హలకు లోనై తన మాటల తూటాలతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడితే తప్ప ప్రత్యేక రాష్ట్రంరాదని గ్రహించి ప్రశాం తంగా ఉన్న రాష్ట్రంలో ఉద్యమ పంథాను చేపట్టి విద్వేషా లకు, విధ్వంసాలకు శ్రీకారం చుట్టిన తొలి ముద్దాయి. ఎన్ని కల్లో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిసి  ఈ పంధా ఎన్నుకు న్నారు. ప్రజలిచ్చిన తీర్పు మీద ప్రజాస్వామ్యంమీద అతనికే మాత్రం విశ్వాసంలేదని అతని ఉక్రోష ధోరణి, నియంత పోకడను స్పష్టంచేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారతుందనడం అతని సంస్కా రాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తే మిగిలేది బూడిదే. విడిపోవాలనే కాంక్ష ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉందని, కలసి ఉండాలనే అక్కడి ప్రజలకాంక్ష కేవలం కల్పితమని చెప్పడం అవివేకం. ఇన్నేళ్ల నుంచి ప్రజలంతా కష్టసుఖాలను కలిసి మెలసి పంచుకుంటూనే ఉన్నారు. విభజన రేఖలు గీస్తున్నది సంకుచిత, స్వార్ధ పరనేతలే అన్న భావన సహజంగా వచ్చిందే. తత్ఫలితమే సమైక్యాంధ్రకాంక్ష ఉవ్వెత్తున లేచింది.

ఇదెవరూ కాదనలేని సత్యం. భావోద్వే గాలు ఇక్కడి వారికేగాని అక్కడి ప్రజలకు ఉండవా? సమస్య లుంటే విడి పోవడమే పరిష్కారమా? నేతలు, ప్రొఫెసర్లు, మేధావులు, విజ్ఞులు, న్యాయకోవిదులు ఇది గుర్తించి తీరాలి. పెట్టుబడి దారుల్లో మంచివాళ్ళు, స్వార్ధపరులు ఉన్నట్లే, విభజనవాదుల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ పెత్తందార్లులేరని పెట్టుబడిదారులు దోపిడీ చేయరని ప్రజ లకు విభజనవాదులు గ్యారంటీ ఇస్తారా? కనుక ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

విలక్షణ ముఖ్యమంత్రి

January 25th, 2010 by admin
తుర్లపాటి కుటుంబరావ్ఞ
ఆయన అత్యంత వివాదాస్పదుడైన ముఖ్యమంత్రి; వివాదాలను ఆయన కోరి తెచ్చుకుంటారు; వివాదంలేని రోజు ఆయనకు ముద్ద ఎక్కదేమో! అయితే, ఆయన విలక్షణ ముఖ్యమంత్రి. బహుశా ఆయనతో పోల్చదగిన ముఖ్యమంత్రి ఇప్పుడు భారతదేశంలోనే ఎవ్వరూ లేరేమో! గుజరాత్‌ ప్రజలకు ఆయన అత్యంత ప్రేమాస్పదుడు; గౌరవ భాజనుడు. లేకపోతే, ఆయన మూడుసార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరా? ప్రతిసారి ఆయనను ఓడించడానికి అక్కడి కాంగ్రెసు విశ్వ ప్రయత్నం చేస్తూనే వున్నది. అయినా, ఎప్పటి కప్పుడు ‘నరేంద్రుడే రాజేంద్రుడు!

మోడిపై మొన్న ఒక టివి ఛానల్‌లో కొత్త ‘ఆరోపణ వచ్చింది. ఏ సంస్థ ప్రారంభోత్సవం, లేదా దాని ఉత్సవంలోనైనా ఆ ముఖ్యమంత్రిగారు పాల్గొనాలంటే, ఆయన ‘చెయ్యి తడపవలసిందేనట! అదే ఆ టివి ఛానల్‌ తన కథనానికి పెట్టిన శీర్షిక. అలా ఆయన చేసుకున్న సొమ్ము ఇంతవరకు 23 కోట్లు! ఇది చదవగానే ఎంత అవినీతి! ఎంత దుర్మార్గం అనుకోకపోతే, అనుకోని వారిది తప్పు! కాని, ఈ కథనంపైని చమత్కారపు ముసుగు ఇక్కడే పక్కకు తప్పుకుంటుంది! ఆ ‘లంచపు సొమ్మును ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోరట! అణా పైసలతో లెక్కకట్టి, ‘స్వచ్ఛంద సేవా సంస్థలకు, అనాధల సహాయానికి, ఆపన్నులను ఆదుకోడానికి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులకు వెచ్చిస్తున్నారట!

ఇది వినడానికి వింతగా వుంది కదూ? ఇలా ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రీ చేయలేదు. అలా చేయకపోతే, ఆయన నరేంద్ర మోడీయే కాదు-అందుకే ఆయన విలక్షణ ముఖ్యమంత్రి. ఔను, మరి! ఆయన బ్రహ్మచారి ముఖ్యమంత్రి! ఒరిస్సాకు కూడా నవీన్‌ పట్నాయక్‌ మూడవసారి ముఖ్యమంత్రి. ఆయన కూడా బ్రహ్మచారే సుమా! బ్రహ్మచారులకు కోట్ల కొద్దీ ధనార్జన అవసరమేమున్నది? అందువల్లనే కాబోలు, గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే పరిపాలకులు బ్రహ్మచారులైతే మంచిదన్నాడు!

అయితే, మోడికి ఇప్పుడు మంచిపేరు - చాలా మంచిపేరు - వచ్చింది కాని, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిత్వంలో కొంత చెడ్డపేరే తెచ్చుకున్నారని చెప్పాలి. గోధ్రాలో జరిగింది ఘోరమే. ఆ రైలులో కరసేవకులను కొందరు మతోన్మాదులు ఘోరంగా హత్య చేయడం క్షమించరాని నేరమే. అయితే, గోద్రా హత్యాకాండకు ప్రతీకారంగా ఆ తరువాత గుజరాత్‌లో జరిగిన అమాయకుల వధ అన్నింటిని మించిపోయింది.

అంతకంటె ఘోరం -’గోద్రా ఘోరానికి గుండెలు మండుతున్న గుజరాత్‌ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటున్నారని తన రాష్ట్ర ప్రజలందరి రక్షణకు బాధ్యత వహించవలసిన సాక్షాత్తు ముఖ్యమంత్రి అనవలసిన మాటేనాఅది? ఒకవేళ మనస్సులో అనుకున్నా, పైకి అనవలసిన మాటేనా అది? సాక్షాత్తు ప్రధాని వాజ్‌పేయి సైతం ‘గుజరాత్‌ ఘోరాలకు సిగ్గు పడుతున్నానని బాధ పడ్డారు. అంతే కాదు-మోడీని పదవి నుంచి తొలగిస్తామని కూడా ఆయన పార్లమెంట్‌కు హామీఇచ్చారు.వాజ్‌పేయి మోడీని తొలగిస్తామని గోవాలో అని, గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌ వచ్చేసరికి మాట మార్చారు! మరి, మోడీయా? మజాకా? ఆయనను తొలగించడం ఎవరితరం? బిజెపి ‘ఉక్కుమనిషి అద్వాని ఆయనకు వెన్నుదన్ను. అంతకుమించి గుజరాతీల హృదయాధినాధుడు.అందువల్లనే,గోద్రా గోలపై భారతీయ పత్రికలు, అమెరికన్‌ పత్రికలు ఎంత గగ్గోలు పెట్టినా, మోడీ చెక్కు చెదిరితేనా? ఆయన గట్టిగా తలచుకుంటే, కేంద్రంలోని తన పార్టీ అధినేతల పునాదులనే కదిలించగలడు.

జనాకర్షకుడు

మోడీ మంచి వక్త. సంభాషణా చతురుడు. ఏదైనా సమస్య తనను నిలదీయాలనివచ్చిన వుద్దండులనైనా తన వాక్చమత్కృతితో నిరుత్తరులను చేయగల మాటల మాంత్రికుడు. తన ప్రత్యర్థులు తనను ఎంత తీవ్రంగా విమర్శించినా, నిందించినా తాను మాత్రం సహనం కోల్పోని వ్యక్తిత్వాన్ని ఆయన రూపొందించుకున్నాడు.

దాదాపు ఎనిమిది ఏళ్ల క్రితం ఆయనను ఈ ‘వార్తలలోని వ్యక్తి తీవ్రంగా విమర్శించకపోలేదు.అయితే,అప్పటి మోడీ వేరు; ఇప్పటి మోడీ వేరు.అప్పుడాయన మొదటి రాజకీయవేత్త. ఇప్పుడాయన సగటు రాజకీయవేత్తకు చాలా పైమెట్టు ఎక్కి కూర్చున్నారు. జనా కర్షణ శక్తిలో వివిధ విషయ పరిజ్ఞానంలో ఆధునిక గుజరాత్‌లో ఏ నాయకుడు ఆయనకు దీటుకాడని ఆయన ప్రత్యర్థులే ప్రయివేటు సంభాషణలో అంగీకరిస్తారు.అయితే,ఒక ‘ప్రమాదం లేకపోలేదు. ఏనాటికైనా భారత ప్రధాని కావాలన్నది ఆయన కోర్కె; ఆయన అభిమానుల అభిమతం.అది బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడే సాధ్యం. పార్టీలో ఆయనకు వ్యతిరేకత కూడా లేకపోలేదు. ఏమో? ఒకప్పటి ఆర్టీసి క్యాంటీన్‌ మేనేజర్‌ ఈస్థితికి రాగలడని ఆయనైనా అనుకున్నారా? మోడి ఎమ్‌.ఏ.బి.ఎల్‌. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.

మనకు ‘రాజ్యాంగ సంస్కృతి లేదు

January 25th, 2010 by admin

ప్రియమైన చిదంబరం,
ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసే ప్రశ్నపై పియుసిఎల్‌ అభిప్రాయం ఏమిటో నేను మీకు రాస్తున్నాను.మనవంటి బహుళ వైవిధ్యతగల సమా జాలను రాజ్యాంగపు నాల్గవ భాగంలోగల ఆదేశిక సూత్రాల ప్రకారం పాలించేందుకు చిన్న రాష్ట్రాలు ఏ విధంగా అవసరమో, రజనీ కొఠారి అధ్యక్షుడుగా ఉన్నపుడు మేము పియుసిఎల్‌లో చర్చించాము.

ప్రస్తుతం అలవికాకుండా ఉన్న ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలోకన్న చిన్న రాష్ట్రా లుగా ఏర్పడితేనే వెనుకబడిన ప్రాంతాల పట్ల రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాల ప్రకారం శ్రద్ధచూపేందుకు వీలు కలుగు తుంది. వాస్తవానికి అటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకు న్నందువల్లనే, పౌరుల మౌలిక విధులను పేర్కొంటూ రాజ్యాం గాన్ని సవరించి 4-తి భాగాన్ని ప్రవేశపెట్టారు.ఆదేశిక సూత్రాల వలెనే ఈ విధులు కూడా కోర్టుల ద్వారా అమలు చేయించగలవికాదుగాని, అదే సమయంలో ఉపేక్షించగలవి కూడా కాదు. పౌరుల వ్యవహరణను అంచనా వేయటంలో, వారి కోర్కెలు ఎంత సమంజసమో పరిశీలించటంలో, పౌరుల కోరికలకు గల ఆమోదయోగ్యమైన పరిమితులు ఏమిటో, ప్రభుత్వ పాలనకు గల పరిమితులు ఏమిటో ఆదేశిక సూత్రాలు, పౌర విధులు నిర్ణయిస్తాయి.ఇటువంటి అంచనాలు, పరిశీలనల నుంచే రాజ్యాంగ సంస్కృతి అనేది రూపుదిద్దుకుంటుంది.

ఆర్టికిల్‌ 51ఎ(ఇ)లో ఏముందో ఒకసారి గమనించండి. ”మత, భాషా, ప్రాంత, వర్గపరమైన వైవిధ్యాలకు అతీతంగా భారత దేశంలోని ప్రజలందరి మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు పెంపొం దేందుకోసం… అని అందులో ఉంది. బ్రాండిస్‌ జె. అన్నట్లు ”ప్రభుత్వానిది ఒక గొప్ప అధ్యాపక పాత్ర. ఏ అవగాహన ప్రకారమైతే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలవారు ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డారో దానిఅమలుకు పైన పేర్కొన్న ఆర్టికిల్‌ స్ఫూర్తి ప్రకారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించి ఉంటే మనం ఇపుడు చూస్తున్నటువంటి పరిస్థితి తలెత్తేది కాదు. అదే విధంగా, ”అస మానతలను, ఆదాయాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకూ, హోదాలు, వసతులు, అవకాశాల మధ్య వ్యత్యాసాలను తొలగిం చేందుకు ఆర్టికిల్‌ 38 (2) నిర్దేశించినట్లు ఆంధ్ర, తెలంగాణ ప్రజల విషయంలో వ్యవహరించినా ఈ దురదృష్టకర పరిస్థితి ఏర్పడేదికాదు. రాజ్యాంగం అమలుకు వచ్చిన ఇన్నేళ్లలో మనం రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ సంస్కృతి అనదగ్గ లక్షణాలను అభివృద్ధిపరచలేదు. అందువల్లనే మనవంటి వైవిధ్య సమా జాలలో ఈ తరహా సమస్యలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించలేకపోతున్నాము.

వైవిధ్య సమాజాలను పరిపాలించడమంటే ఏమిటో, ఆ పని ఏ విధంగా జరగాలో అర్ధంచేసుకోకపోవటంవల్లనే, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఎందుకన్న ప్రశ్నను కూడా మనం గ్రహించలేకపోతున్నాము. భాషా ప్రాతిపదికపై 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తమిళ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం సమానా భివృద్ధి సాధించటం లేదన్నది ఆంధ్ర రాష్ట్రం కోర్కెకు ఒక ప్రధాన కారణం. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌కు నివేదించకుండానే అపుడు కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయంటూ ఆంధ్రులు తీవ్ర ఆవేదన చెందటంతో, ప్రత్యేక రాష్ట్ర కోరిక సమంజసమా కాదా అని విచారించేందుకు కూడా కేంద్రానికి సమయం లేకపోయింది. వలసపాలన కాలపు భారతదేశ పునర్ని ర్మాణం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో ఆరంభమైంది. దేశాన్ని రాష్ట్రా లుగా ఏర్పాటు చేసేందుకు బహుశా ఇదొక నమూనాగా ఉపయోగపడింది.
భారతదేశ పరిపాలనాపరమైన, రాజకీయమైన చిత్రపటాన్ని కొత్తగా తయారుచేసేందుకు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ ఏర్పాటైంది. వలస భారతంతో ఉండిన సంబంధాలను తెంచి వేసేందుకు కూడా అది ఉపయోగపడింది. అయితే ఈ క్రమంలో ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణ విలీనం గత అయిదు దశాబ్దాలుగా ప్రశ్నార్ధకౖమవుతూనే వచ్చింది. ఈ ప్రశ్న ఎస్సార్సీ నిర్ణయాన్ని కూడా సవాలు చేస్తూనే ఉంది. జస్టిస్‌ ఫజల్‌ అలీ, కె.ఎం. పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ ఆ ఎస్సార్సీ సభ్యులు. వారు తమ నివేదికను 1955లో సమర్పించారు. అందులో 369 నుంచి 389వరకు గల పేరాగ్రాఫ్‌లు తెలంగాణకు, ఆ రాష్ట్రాన్ని ఆంధ్రతోవిలీనంచేయటానికి సంబంధించినవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలన్న కోరికను ఆ కమిషన్‌ పరిశీలించింది. వారిచ్చిన నివేదికలోని కొన్నిభాగాలు ఈ కిందివిధంగా ఉన్నాయి:
పేరా 375: విశాలాంధ్ర ఏర్పడాలనే వాదనలు చాలా మెప్పించేవే. అదే సమయంలో తెలంగాణ ప్రత్యేకంగా ఉండా లనే వాదనలను తేలికగా తోసిపుచ్చలేము.

పేరా 376: ….. తెలంగాణలో భూమిశిస్తు ఎక్కువ కావటం, అయిదు కోట్ల రూపాయల మేరగల ఆబ్కారీ ఆదాయంతో తేడా కనిపిస్తున్నది. ఎటువంటి వివరణలైనా ఇవ్వవచ్చుగాక. కాని, సమైక్య రాష్ట్రం ఏర్పడితే తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పడగల నిశ్చితమైన ఆదాయ వనరులకు బదులు, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలోవలె ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఏర్పడగలవన్నది కొందరు తెలంగాణ నాయకుల భయమైనట్లు తోస్తున్నది. తమది ప్రగతిపథంలోగల రాష్ట్రమని, సమైక్యతవల్ల తమకు ఒనగూర గల ప్రయోజనాలు ఏవీ లేవని కూడా వారు భావిస్తున్నారు.

పేరా: 377: భవిష్యత్తులో అభివృద్ధి పథకాలను పరిశీలించి నపుడు, తమ అవసరాలకు విశాలాంధ్రలో తగిన ప్రాధాన్యత లభించదన్నది తెలంగాణ ప్రాంతీయుల సందేహం. తెలంగాణకు గాని, మొత్తం దేశంలోగాని నందికొండ, కుష్టాపురం (గోదావరి) పథకాలు చాలా ముఖ్యమైనవి. అయితే కోస్తాలో ఈ రెండు నదులపై కూడా నీటిపారుదల పథకాలకు తెలంగాణలో రూపకల్పన చేసారు. అందువల్ల కృష్ణా, గోదావరి నీటి వినియోగానికి తనకు గల స్వతంత్ర హక్కులను వదలుకోవటం తెలంగాణకు ఇష్టంకాదు.

పేరా 378: తెలంగాణకు చెందినవారు విద్యారంగంలో వెనుకబడి ఉన్నందున, విశాలాంధ్ర ఏర్పడితే విద్యాధికులైన కోస్తా ప్రాంతీయులవల్ల తమకు నష్టం జరుగుతుందనే భయాలు న్నాయి. హైదరాబాద్‌కు బయట తెలంగాణ జిల్లాల్లో విద్యా రంగం చాలా వెనుకబడిఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రు లకు ఉద్యోగావకాశాలు లభిస్తే వారికే అధిక ప్రయోజనాలు చేకూరి, మంచి చొరవగల కోస్తాంధ్ర వారికి తాము వలసగా మారగలమనే సందేహాలున్నాయి.

పేరా 382: అందువల్ల, పెద్ద రాష్ట్రం ఏర్పాటు గురించి అనుకూలాంశాలు చాలానే ఉన్నాయి. అందుకు ఆటంకాలు కల్పించకూడదు. కాని అదే సమయంలో సమైక్య రాష్ట్రానికి కోస్తాలో పూర్తి సానుకూలత ఉండగా తెలంగాణలో అది ఇంకా స్థిరరూపం తీసుకోలేదు… రెండు రాష్ట్రాల విలీనం వాంఛ నీయమే అయనా అది ప్రజల స్వచ్ఛంద నిర్ణయంతో జరగాలి. ముఖ్యంగా తమ భవిష్యత్తు గురించి తెలంగాణ ప్రజలు తీసుకోవలసిన నిర్ణయమిది.

ఎస్సార్సీ తన నివేదికను 1955 సెప్టెంబర్‌ 30న సమర్పిం చగా, దానిపై హైదరాబాద్‌ అసెంబ్లీలో అదే సంవత్సరం నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 3 వరకు చర్చ జరిగింది. ఎటు వంటి తీర్మానం చేయకుండానే సభ వాయిదా పడింది. కాని సభ ఆలోచనాతీరు స్పష్టంగానే కన్పించింది. 174 మంది సభ్యులలో 147 మంది చర్చలో పాల్గొనగా 103 మంది విశాలాంధ్రకు, 29 మంది తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. 15 మంది గైర్‌ హాజరయారు. ఈ వార్త డిసెంబర్‌ 5న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెలువడింది.

అదెట్లున్నా, తెలంగాణ ప్రజల సందేహాలు నిజమని మాత్రం తదనంతర పరిణామాలు రుజువు చేసాయి. సామాన్య ప్రజలకు హానికరమయే విధంగాసంపదలు కొందరి చేతులలో కేంద్రీకృతం కావటాన్ని రాజ్యాంగంలోని పరిపాలనా సూత్రాలు అనుమ తించవు. దాయాలు,అవకాశాలలో అసమానతలను ప్రభుత్వం అదుపు చేస్తుందనీ, వేర్వేరు ప్రాంతాలలో నివసించే ప్రజలకు లభించే అవకాశాలు,హోదాలలో తారతమ్యాలు తగ్గేట్లు చూస్తుం దని మరొక ఆదేశిక సూత్రం చెప్తున్నది. ఆస్తుల కేంద్రీకరణను, వలసీకరణను నిరోధించేందుకు ఇవన్నీ ఒప్పందంలో ఉన్నాయి గాని అమలుకాలేదు. జలవనరుల పంపిణీలో ట్రిబ్యునల్‌ వారు నదీ పరీవాహక ప్రాంతాలను గుర్తించకపోవటం, వాటికి నిర్దిష్ట మైన రీతిలోనీటిని కేటాయించకపోవటంతో రాజకీయ చాతుర్యం ద్వారా ఈ విషయంలో ఆంధ్ర ప్రాంతానికి మేలు కలిగింది. రాజ్యాంగపు నాల్గవ పరిచ్ఛేదంలోగల సమానతా సూత్రాలను అనుసరించినట్లయితే ఇటువంటి అన్యాయం జరిగేదికాదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి తలెత్తేది కాదు.

ఇపుడు తెలంగాణ రాష్ట్రం కోసం రెండవ ఉద్యమం ఆరంభమైంది. దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రశేఖరరావు పిలుపుతో ప్రజలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. నిజానికి అన్యా యాలకు వ్యతిరేకంగా ఆయన అసెంబ్లీలో ఎప్పుడూ మాట్లాడ లేదు. సభలో తను ఎక్కువ మాట్లాడే మనిషి కూడా కాదు. ఇదంతా ఉద్యమానికి నాయకత్వం వహించినాకనే జరిగింది. గతంలో ఆయన పార్టీ క్రమశిక్షణకు బద్దుడైపోయారు. ప్రతి మనిషి జీవితంలో కూడా ”ఇక సహించబోను అనుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ సమయం రావటంతో తాను అధికారపక్షం లోని తన స్థానాన్ని వదలుకుని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. తన పార్టీ అధినేత పార్లమెంటరీ ప్రజాస్వామికవాది అయినందున చంద్రశేఖరరావు అసమ్మతిని అనుమతించారు. తనపై పోలీస్‌ బలగాన్ని ప్రయోగించలేదు.

అయితే, ఈ ఆందోళనను మావోయిస్టులు నడుపుతున్నట్లు ఆరోపించి, లోగడ 70లలో, తర్వాత వైఎస్‌ఆర్‌ హయాంలో నక్సలైట్లతో చర్చల అనంతరం వలె పాశవికంగా అణచివేయ వచ్చుననే  సందేహాలు కొందరికి ఉన్నాయి. రాష్ట్రానికి ప్రస్తుతం మాజీ ఐ.బి అధిపతి అయిన వ్యక్తి గవర్నర్‌ హోదాలో, ఆయనతోపాటు డిజిపి అధినాయకులుగా కనిపిస్తున్నందున ఆ పని తేలికే కూడా. డిజిపి ఇటీవల చేసిన ఒక ప్రకటన ఇందుకు సూచనగా కూడా కన్పిస్తున్నది. రాజకీయ వాతావరణం సరిగాలేని రాష్ట్రాలలో ఈ విధంగా పోలీసు అధికారుల చేతికి పగ్గాలివ్వటం అనారోగ్యకరమైన రాజకీయ విధానమవుతున్నది. గవర్నర్‌, డిజిపి కలిసి రాష్ట్ర పరిపాలనను చేతిలోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది తగిన పనికాదు. గవర్నర్లుగా మాజీన్యాయమూర్తులు, మాజీ సివిల్‌ సర్వెంట్స్‌ మాజీ పోలీసు అధికారులు ఇటువంటి హోదాల కోసం ఎదురు చూడకూడదు. వారు తమ రిటైర్మెంట్‌ను ఆనందంగా గడపాలి.

ఇట్లు
కె జి కన్నబిరాన్‌,
తేదీ: 20-1-2010
పియుసిఎల్‌ జాతీయ అధ్యక్షుడు

 
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com