సీబీఐ నుండి రాకేశ్‌ అస్థానా బదిలీ

 

rakesh asthana
rakesh asthana

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేశ్‌ అస్థానాకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనతో పాటు మరో ముగ్గురు సీనియర్‌ అధికారులనూ గురువారం ఉన్నఫళంగా బయటకు పంపింది. అస్థానాతో పాటు సంయుక్త సంచాలకుడు అరుణ్‌కుమార్‌ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, ఎస్పీ జయంత్‌ జె నాయక్‌నవరేల పదవీ కాలాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు సిబ్బంది శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అస్థానాను పౌర విమానయాన భద్రతా సంస్థ బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల భద్రతను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. అయితే, మిగతా ముగ్గురు అధికారులను ఎక్కడకు పంపుతారన్న వివరాలను వెల్లడించలేదు.