సత్యనారాయణగౌడ్‌ ప్యానల్‌ను గెలిపించాలి:రవీందర్‌రెడ్డి


సైఫాబాద్‌, జనవరి 17 ప్రభాతవార్త: ఎపిఎన్‌జివొఎస్‌ (గచ్ఛిభౌలి) మ్యూచువల్లి ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సోసైటి డైరెక్టర్స్‌కు ఈ నెల 19వ తేదీన జరగనున్న ఎన్నికల నేపధ్యంలో భాగ్యనగర్‌ టిఎన్‌జివొఎస్‌ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్‌ ప్యానల్‌ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని టిఎన్‌జివోఎస్‌ ఛైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్యానల్‌కు ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధుల మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. మూడు దశాబ్ధాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల కోసం సోసైటికి 190 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో 90 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, ఉన్న వంద ఎకరాల భూమిని కాపాడుకుని సోసైటిలోని సభ్యులందరికి ఇళ్ళ స్ధలాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్యానల్‌లోని డైరెక్టర్లు విజయం సాధిస్తే ప్రభుత్వంతో పోరాడి ఇళ్ళ స్ధలాలను సాధించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. సంఘం సెక్రటరీ జనరల్‌ మమత మాట్లాడుతూ సోసైటిలోని సభ్యులు ఒక్కొక్కరూ ఇప్పటికే లక్షన్నర రూపాయలు చెల్లించడం జరిగిందని ఇంత వరకు ఇళ్ళ స్ధలాలు రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్యానల్‌ విజయం సాధిస్తే సభ్యులందరికి ఇళ్ళ స్ధలాలు వస్తాయని ఆమె భరోసా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు సత్యనారాయణగౌడ్‌, రేచల్‌, లక్ష్మణ్‌, రాజేందర్‌, డైరెక్టర్‌ పోస్టులకు పోటి చేస్తున్న అభ్యర్ధులు 15 మంది పాల్గొన్నారు. అనంతరం ప్యానల్‌ అభ్యర్థులతో ఉన్న వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.